సమీక్ష : చందమామ కథలు – బోరింగ్ కథలు

  విడుదల తేదీ : 25 ఏప్రిల్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
నిర్మాత : చాణక్య బూనేటి
సంగీతం : మిక్కీ జె మేయర్
నటీనటులు : లక్ష్మీ మంచు, నరేష్, ఆమని, కిషోర్, కృష్ణుడు, చైతన్య కృష్ణ, తదితరులు

‘ఎల్.బి. డబ్ల్యూ’, ‘రొటీన్ లవ్ స్టొరీ’ లాంటి క్లాస్ ఎంటర్టైనర్స్ ని అందించిన ప్రవీణ్ సత్తారు మరో సారి ఒక డిఫరెంట్ క్లాస్ మూవీ ‘చందమామ కథలు’తో మనముందుకు వచ్చాడు. 8 డిఫరెంట్ కథల సమూహారంతో తెరకెక్కిన ఈ సినిమాలో లక్ష్మీ మంచు, నరేష్, ఆమని, కిషోర్, కృష్ణుడు, చైతన్య కృష్ణ, అభిజిత్, రిచా పనాయ్, నాగ శౌర్య, శాలిని, అమిత రావు, కృష్ణేశ్వరరావు ప్రధాన పాత్రలు పోషించారు. మిక్కీ జె మేయర్ స్సంగీతం అందించిన ఈ సినిమాని చాణక్య బూనితి నిర్మించాడు. ప్రవీణ్ సత్తారు 8 డిఫరెంట్ కథలను ఒకే కథలా చెప్పాలని చేసిన ‘చందమామ కథలు’ ఎలా ఉంది? ఈ 8 కథల్లో ఎన్ని క్లిక్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఒక రైటర్ అయిన సారధి(కిషోర్) నుంచి ఈ కథ మొదలవుతుంది. ఓ రోజు సారధికి తన కూతురుకి కాన్సర్ ఉందని, తనని బతికించుకోవాలంటే 4 లక్షల డబ్బు అవసరమవుతుంది. చిన్న రైటర్ అయిన సారధి తన కూతురిని బతికించుకోవడానికి ఏమి చేసాడనేదే సారధి కథ.

ఒకప్పుడు ఇండియన్ టాప్ మోడల్ అయిన లిసా స్మిత్(మంచు లక్ష్మీ) అవకాశాలు కోల్పోయి డౌన్ ఫాల్ స్టేజ్ లోఉంటుంది. అలా డౌన్ ఫాల్ స్టేజ్ నుంచి మళ్ళీ టాప్ ప్లేస్ కి రావడానికి ట్రై చేసిందా? లేదా? అనేదే లిసా స్మిత్ కథ.

జి. వెంకటేశ్వరరావు(కృష్ణుడు) పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ట్రై చేస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. జస్ట్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాదండోయ్ ఆధార్ కార్డున్న ఇంజనీర్. పెళ్లి కోసం పరితపించే వెంకటేశ్వరరావుకి పెళ్లి అయ్యిందా? లేదనేదే అతని కథ.

గతంలో ప్రేమించుకొని విడిపోయిన వాళ్ళే మోహన్(సీనియర్ నరేష్) – సరిత(ఆమని). పెళ్ళానికి దూరమైన మోహన్, భర్త చనిపోయిన సరిత ఒకటయ్యారా? లేదా? అనేదే ఈ జోడీ కథ.

ముస్లీంలైన అష్రఫ్(అభిజిత్) – హసీనా(రిచా పనాయ్)లు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. కానీ లైఫ్ లో సెటిల్ అవ్వని అష్రఫ్ తన ప్రేమని చెప్పడానికి భయపడుతుంటాడు. ఇలాంటి వీరిద్దరి ప్రేమ పెళ్ళికి దారితీసిందా? లేదా? అనేదే ఈ జోడీ కథ.

కాలేజ్ స్టూడెంట్స్ అయిన రఘు(చైతన్య కృష్ణ) – రేణు(షామిలి అగర్వాల్) ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. కానీ శాలిని నాన్న పొలిటీషియన్ కావడం వల్ల వీరిద్దరూ ఒకటయ్యారా? లేదా? అనేదే ఈ జోడీ కథ.

పల్లెటూరిలో ఆకతాయిగా పెరిగిన రఘు(నాగ శౌర్య) చేసిన ఓ తుంటరి పని వల్ల చిన్నతనంలోనే గౌరీ(అమిత రావు)తో పెళ్ళవుతుంది. దానివల్ల వారిద్దరూ ఎదుర్కొన్న సమస్యలేమిటి అనేదే వీరి కథ.

ఓ భిక్షగాడు(కృష్ణేశ్వరరావు) తన కంటూ ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలని 10 లక్షలు దాచిపెడతాడు. కానీ తను దాచిపెట్టిన డబ్బుతో ఇల్లు కొనుక్కున్నాడా? లేదా? అనేదే ఈ భిక్షగాడి కథ.

ఈ 8 కథల్లో వచ్చిన ట్విస్ట్ ల గురించి తెలుసుకోవాలన్నా? అలాగే ఈ 8 కథలకి మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు ‘చందమామ కథలు’ చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ లో మొదటగా చెప్పాల్సింది ప్రవీణ్ సత్తారు ఎంచుకున్న నటీనటుల గురించి.. తను రాసుకున్న 8 కథలకి పర్ఫెక్ట్ గా సరిపోయే నటీనటులను ఎంచుకున్నాడు. ఒక రైటర్ గా, కూతురిని ప్రేమించే తండ్రి పాత్రలో కిషోర్ నటన చాలా బాగుంది. టాప్ మోడల్ అయిన లిసా స్మిత్ పాత్రలో మంచు లక్ష్మీ పెర్ఫార్మన్స్ సూపర్బ్. మంచు లక్ష్మీ తప్ప ఆ పాత్రకి ఇంకెవరూ న్యాయం చేయలేరు అనే విధంగా నటించింది.

పెళ్లి కోసం పరితపించే కుర్రాడి పాత్రలో కృష్ణుడు మెప్పించాడు. ముస్లీం లవర్స్ అభిజిత్ – రిచా పనాయ్ పెయిర్ చూడటానికి బాగుంది, అలాగే వారి పాత్రలకు న్యాయం చేసారు. కాలేజ్ స్టూడెంట్స్ గా చైతన్య కృష్ణ – షామిలిల కాంబినేషన్, నటన బాగుంది. ముఖ్యంగా చైతన్య కృష్ణ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రని బాగా చేసాడు. పల్లెటూరి పాత్రల్లో నాగ సౌర్య- అమిత రావు బాగా సెట్ అయ్యారు. ముఖ్యంగా వీరిద్దరి స్టొరీ లో వచ్చే ‘నాకు రాదు’ అని చెప్పే సీన్స్ కాస్త నవ్వు తెప్పిస్తాయి.

సీనియర్ నటులైన నరేష్, ఆమని, వెన్నెల కిషోర్ మరియు భిక్షగాడిగా చేసిన కృష్ణేశ్వరరావులు తమ పాత్రలకి న్యాయం చేసారు. సెకండాఫ్ కాస్త బెటర్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బాగుంది. అలాగే ప్రతి పాత్రకి చివర్లో ఇచ్చిన జస్టిఫికేషన్ చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటి బిగ్గెస్ట్ మైనస్ ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని నటీనటుల ఇంట్రడక్షన్ తోనే సినిమాని బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ కి బాగా బోర్ కొడుతుంది. అలాగే 8 కథలని చెప్పాలనే ఉద్దేశంతో డైరెక్టర్ స్క్రీన్ ప్లే ని బాగా గజిబిజి చేసేసారు. సామాన్య ప్రేక్షకుడికి ఏమి చూపిస్తున్నాడు అనేది అర్థం కాదు. దాంతో బి, సి సెంటర్ ప్రేక్షకులు గందరగోళానికి గురవుతారు.

సినిమాలో చాలా చోట్ల ప్రతి కథలోనూ ఏదో సందర్భంలో ఒక సీన్ ని స్టార్ట్ చేస్తాడు కానీ ఆ సీన్ కి సరైన ఎండింగ్ ఇవ్వకనే వేరే కథలోకి వెళ్ళిపోతుంటాడు. ఎడిటర్ కనీస శ్రద్ధ కూడా తీసుకోకపోవడంలో సినిమా బాగా స్లోగా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చోట్ల చిరాకు తెప్పిస్తుంది.

అలాగే సినిమాలో కామన్ ఆడియన్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ అనేది అస్సలు లేకపోవడం మరో మేజర్ మైనస్ పాయింట్. ఆల్జీబ్రా ఉపయోగించి 8 కథలకి టైం ఇచ్చానని డైరెక్టర్ చెప్పాడు. కొన్ని కథలకి చాలా తక్కువ టైం ఇవ్వడం వెనుక ఉన్న ఆల్జీబ్రా లెక్కలేంటో తనకే తెలియాలి. 8 కథల ఎండింగ్ పై తీసుకున్న శ్రద్దలో సగం సినిమాని చెప్పడంలో, ఫస్ట్ హాఫ్ మీద తీసుకొని ఉన్తెసినేమా ఓ రేంజ్ లో ఉండేది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ముందుగా మెచ్చుకోవాల్సింది సురేష్ రగుటు సినిమాటోగ్రఫీ. ఎంచుకున్న ప్రతి లొకేషన్ ని బాగా రిచ్ గా చూపించడం వల్ల విజువల్స్ చాలా బాగుంటాయి. మిక్కీ జె మేయర్ అందించిన పాటలు బాగున్నాయి, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది కానీ కొన్ని చోట్ల సీన్స్ కి సెట్ అయ్యింది. కానీ కొన్ని చోట్ల అవసరం లేకపోయినా ఎందుకు అంతలా మ్యూజిక్ కొడుతున్నాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ సినిమాకి ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగతా ఎక్కడా హెల్ప్ అవ్వలేదు.

ఇక మిగిలిన కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – దర్శకత్వం విభాగాలను ప్రవీణ్ సత్తారు డీల్ చేసాడు. కథ – కథ మంచిదే కానీ ప్రెజెంటేషన్ బాలేకపోవడంతో కథని ఎవరూ పట్టించుకోరు. స్క్రీన్ ప్లే – ఒక సినిమాలో 8 కథలు చెప్పాలనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే అనేది అస్సలు గందరగోళంగా ఉండకూడదు. అలా ఉంది అంటే సినిమా ఫెయిల్ కి అదే కారణం అవుతుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లేలో కూడా క్లారిటీ కంటే గందరగోళం ఉంటుంది. డైలాగ్స్ – రైటర్ పాత్రకి రాసిన డైలాగ్స్ తప్ప మిగతా ఏ డైలాగ్స్ లోనూ పసలేదు. స్టొరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో పెద్దగా మెప్పించలేకపోయిన ప్రవీణ్ సత్తారు డైరెక్టర్ గా మాత్రం మెప్పించాడు. అనుకున్న పాత్రలకు నటీనటులను ఎంచుకోవడంలో, వారి నుంచి నటనని రాబట్టు కోవడంలో, ఆ పాత్రలకి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇవ్వడంలో ప్రవీణ్ సత్తారు సక్సెస్ అయ్యాడు. కానీ ఓవరాల్ గా ఆడియన్స్ కి సినిమాని చెయ్యడంలో మాత్రం ఫ్లాప్ అయ్యాడు. కానీ ఇలాంటి సినిమాని అటెంప్ట్ చేసినందుకు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాలి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

‘ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డైడ్’ అనే కోవలోకి ‘చందమామ కథలు’ సినిమా వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ బాగుంది, కానీ టేకింగ్ ఫెయిల్యూర్. మొదటి రెండు సినిమాలతో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తారు ‘చందమామ కథలు’ సినిమాతో వారిని కూడా ఆకట్టుకోలేకపోవడం దురదృష్టకరం. స్టొరీ లైన్, నటీనటుల పెర్ఫార్మన్స్ తప్ప చెప్పుకోవడానికి ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్, జీరో ఎంటర్టైన్మెంట్ మేజర్ మైనస్ పాయింట్స్. ఎ,బి,సి సెంటర్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే చాన్స్ లేని ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద నిలబడడం చాలా కష్టం. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు తీసేటప్పుడు చాలా కేర్ తీసుకొని చేయాలి లేదంటే సినిమా ఫెయిల్ అవ్వడమే కాకుండా ఇలాంటి సినిమాలు ట్రై చెయ్యాలనుకునే వారికి అవకాశాలు రాకుండా చేసినట్టవుతుంది.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5

123తెలుగు టీం

సంబంధిత సమాచారం :