సమీక్ష : ఏం బాబు లడ్డూ కావాలా – మాకొద్దు బాబోయ్ .!!

సమీక్ష : ఏం బాబు లడ్డూ కావాలా – మాకొద్దు బాబోయ్ .!!

Published on Sep 21, 2012 12:45 PM IST
విడుదల తేదీ: 21 సెప్టెంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : గాంధీ మనోహర్
నిర్మాత : జనార్ధన్. టి
సంగీతం: యం. యం శ్రీ లేఖ
నటీనటులు : శివాజీ, అధితి అగర్వాల్, రచనా మౌర్య

కామెడీ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న కామెడీ హీరో శివాజీ. గత కొంతకాలంగా సరైన హిట్ లేక డీలా పడిపోయిన శివాజీ హిట్ కోసం అప్పుడప్పుడు తన సినిమాలతో టాలీవుడ్ బాక్స్ ఆఫీసు పై దండయాత్ర చేస్తూనే ఉన్నారు. శివాజీ హీరోగా, గాంధీ మనోహర్ అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ తెరకెక్కిన ‘ఏం బాబూ లడ్డూ కావాలా.!’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అధితి అగర్వాల్ మరియు రచన మౌర్య కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులకు లడ్డూలు పంచిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

సినిమా హీరో శివాజీ(శివాజీ) పాత్రతో సినిమా ప్రారంభమవుతుంది. అతన్ని ఎంతగానో ఇష్టపడే రాజేష్ చెల్లెలు అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడంతో పెళ్లి సంబంధం కోసం రాజేష్ శివాజీని కలుస్తాడు. అతను కుదరదనడంతో, అతని అసిస్టెంట్ ఇదే సిటీలో శివాజీలానే మరో వ్యక్తి అడ్రస్ చెప్పి అతనితో తన చెల్లి పెళ్లి చేయమని రాజేష్ కి సలాహా ఇస్తాడు. ఇక్కడ అసలు కథ మొదలవుతుంది. అచ్చం శివాజీలా ఉండే వంశీ కృష్ణ (శివాజీ) చూసి షాక్ అయిన రాజేష్ ఎలాగైనా తన చెల్లితో పెళ్ళికి ఒప్పించాలని చూస్తాడు. వంశీకి ఇంతక ముందే అధితి అగర్వాల్ తో పెళ్లై ఉండడంతో అతను ఒప్పుకోడు. అతన్ని తన భార్యతో విడగొట్టి తన చెల్లితో పెళ్లి జరిపించాలనుకుంటాడు రాజేష్.

అధితి మామూలుగానే తన భర్త వంశీని అనుమానిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా అమ్మాయిలతో అక్రమ సంబందాలు పెట్టుకునే రాంబాబు (చిత్రం శ్రీను) వల్ల వంశీకి అనుకోని ఇబ్బంది వచ్చి పడుతుంది. అలాగే తన షాప్ లో వస్తువులు తీసుకునే నందిని (రచన మౌర్య) వంశీ పై మనసు పడి, అతన్ని ఎలాగైనా లొంగదీసుకోవాలని చూస్తూ ఉంటుంది. అధితి చెల్లి చెప్పిన ఒక అపద్దం వల్ల అధితి శివాజీని దూరం పెడుతుంది. రాంబాబు మరియు రాజేష్ వల్ల ఎదురైన ఇబ్బందులను వంశీ ఎలా ఎదుర్కున్నాడు? అధితి దగ్గర వంశీ తన నిజాయితీని ఎలా నిరూపించుకున్నాడు అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తున్నా శివాజీ నటనలో ఏ మాత్రం మార్పు కనిపించలేదు కానీ ప్రేక్షకుల చేత జస్ట్ పాస్ మార్కులు వేయించుకున్నాడు. అనుమానించే భార్య పాత్రలో అధితి అగర్వాల్ నటన పరవాలేదనిపించాగా, రచనా మౌర్య తన గ్లామర్తో బాగానే ఆకట్టుకున్నారు. అత్యాస పడే వడ్డీ వ్యాపారిగా మరియు భార్యను అనుమానించే భర్తగా ఏ.వి.ఎస్ నటన బాగుంది.

మైనస్ పాయింట్స్ :

‘పెళ్ళాం ఊరెళితె’ చిత్ర కాన్సెప్ట్ ని తీసుకుని గ్రైండర్లో వేసి బాగా మిక్స్ చేసి సినిమా తెసేద్దామని ప్రయత్నించిన గాంధీ మనోహర్ ప్రయత్నాన్ని ప్రేక్షకులు తిప్పి కొట్టారు. ఈ చిత్రానికి కథ కథనం చాలా వీక్, దానికి తోడు తొలి దర్శకుడి దర్శకత్వం తోడవడంతో సినిమా మరీ నిధానంగా సాగుతూ ప్రేక్షకుడు ఎందుకు సినిమాకి వచ్చామా అనుకునేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మరీ చిరాకు తెప్పిస్తుంది. ఎం.ఎస్ నారాయణ పాత్ర నవ్వించకపోగా తెరచించెయ్యాలన్నంత కోపాన్ని తెప్పిస్తుంది. సినిమా మొత్తం కనిపిస్తూ తెగ నవ్వించాలని ప్రయత్నించిన చిత్రం శ్రీను ప్రేక్షకులను నవ్వించలేక బొక్క బోర్లా పడ్డాడు.

అటు సగం తమిళ్, ఇటు బట్లర్ ఇంగ్లీష్ కలిపి మాట్లాడి నవ్వించాలనుకున్న ‘సత్యం’ రాజేష్ నవ్వించక పోగా ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాడు. దర్శకుడు రచనా మౌర్యాని కూడా పూర్తి గ్లామరస్ గా వాడుకోలేక పోయాడు. శివాజీ డాన్సుల్లో స్పెషల్ మార్క్ స్టెప్పు లేయాలని ప్రయత్నించి తనకి డాన్స్ రాదని చెప్పకనే చెప్పాడు. సినిమాలో డైలాగ్స్ దర్శకుడు రాయకుండా మరెవరి చేతనైనా రాయించి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

ఎం. ఎం శ్రీ లేఖ అందించిన పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా, నేపధ్య సంగీతం మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ పరవాలేదనిపించినా ఎడిటర్ ఇంకొంచెం కత్తెరకి పని పెట్టి ఫస్ట్ హాఫ్ లో కొంత లేపేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులకు తొందరగా చేరుతాయని సినిమాకి సంబంధం లేని టైటిల్స్ పెడుతున్నారు. అలా కథకి టైటిల్ కి సంభందం లేని సినిమా ఇది. ఒక పాత హిట్ సినిమా కాన్సెప్ట్ ని తీసుకొని అదే కాన్సెప్ట్ ని డిజాస్టర్ సినిమాగా ఎలా తీయోచ్చో దర్శకుడు గాంధీ మనోహర్ ఈ చిత్రంలో చూపించాడు. శివాజీ సినిమా అంటే ప్రేక్షకుడు కొంతైనా ఎంటర్టైనింగ్ ఉంటుందని ఆశిస్తాడు. సినిమాలో ఎంటర్టైనింగ్ లేకపోగా చెప్పుకోవడానికి ఎలాంటి అంశాలు లేకపోవడం ఈ చిత్రం యొక్క విశేషం. మీరు ఈ సినిమాకి పెట్టే టికెట్ డబ్బుతో ఒక స్వీట్ షాప్ కి వెళ్లి ఒక నాలుగు లడ్డూలు కొనుక్కొని తింటే మీకు మరియు మీ ఆరోగ్యానికి చాలా మంచిది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

– రాఘవ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు