సమీక్ష : ప్రేమ ఇష్క్ కాదల్ – డీసెంట్ లవ్ ఎంటర్టైనర్

PIK విడుదల తేదీ : 6 డిసెంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : పవన్ సాధినేని
నిర్మాత : బెక్కం వేణుగోపాల్
సంగీతం : శ్రవణ్
నటీనటులు : హర్షవర్ధన్ రాణే, విష్ణు, హరీష్ వర్మ, వితిక, రీతు వర్మ,  శ్రీ ముఖి..

‘ప్రేమ ఇష్క్ కాదల్’ లవ్ ఇలా ఎన్ని భాషల్లో చెప్పినా ఈ మూడింటికి అర్థం మాత్రం ఒక్కటే. ఇదే ప్రేమలోని భావాల్ని ఎప్పటినుంచో పలు దర్శకులు పలు రకాలుగా చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో కొందరు సక్సెస్ అయ్యారు, కొందరు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు పవన్ సాధినేని అనే నూతన దర్శకుడు కూడా ప్రేమ అనే విషయాన్ని తీసుకొని చేసిన మొదటి ప్రయత్నమే ‘ప్రేమ ఇష్క్ కాదల్’. హర్షవర్ధన్ రాణే, విష్ణు, హరీష్ వర్మ, వితిక, రీతు వర్మ, శ్రీ ముఖి లాంటి నూతన తారలతో తీసిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకే అర్థం వచ్చే పదాన్ని మూడు భాషల్లో వచ్చేలా కాస్త డిఫరెంట్ గా టైటిల్ పెట్టిన పవన్ సాధినేని అంతే డిఫరెంట్ గా సినిమాని తీసాడో లేదో ఇప్పుడు చూద్దాం…

కథ :

మొదటగా ఒకే అర్ధం వచ్చే లవ్ అనే పదాన్ని ‘ప్రేమ ఇష్క్ కాదల్’ అనే మూడు భాషల్లో టైటిల్ పెట్టిన డైరెక్టర్ ఈ సినిమాలో కూడా మూడు డిఫరెంట్ లవ్ స్టోరీస్ ని చూపించాడు..

మొదటిది – రాండీ(హర్షవర్ధన్ రాణే)కి ఎవరూ లేని ఓ అనాధ. తనొక కాఫీ షాప్ నడుపుతుంటాడు. అలాగే అతనొక రాక్ స్టార్. కానీ తను డబ్బులు కోసం షోస్ చెయ్యడు, కేవలం తన కాఫీ షాప్ లో మాత్రం పాటలు పాడుతుంటాడు. అలాంటి సమయంలో తనతో ఎలాగన్నా ఓ ప్రోగ్రాం చేయించాలని సరయు(వితిక షేరు) ఎంటర్ అవుతుంది. సరయు అనుకున్నట్లుగా రాండీ చేత ప్రోగ్రాం చేయిస్తుంది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది.

రెండవది – అర్జున్(హరీష్ వర్మ) ఒక ప్లే బాయ్. తను 92.7 బిగ్ ఎఫ్ఎంలో ఆర్.జె గా పనిచేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి సమయంలో అతనికి శాంతి(శ్రీ ముఖి) కనిపిస్తుంది. ఎలాగన్నా తనని కూడా లైన్ లో పెట్టాలనుకున్న అర్జున్ శాంతి వెంట పడతాడు. మొదట కామెడీగా తీసుకున్న అర్జున్ నిజంగానే శాంతి ప్రేమలో పడతాడు.

చివరిది మూడవది – రాయల్ రాజు(విష్ణు) ఎలాగైనా తనలాగే మందు, సిగరెట్ తాగే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశంతో సిటీకి వస్తాడు. అలా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిలో చేరిన రాజుకి అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసే సమీర(రీతు వర్మ)తో పరిచయం ఏర్పడుతుంది. రాజు కోరుకున్న క్వాలిటీస్ అన్నీ సమీరలో ఉంటాయి. ఇలా తనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న సమీరతో రాజు ప్రేమలో పడతాడు.

ఇలా రక రకాల కారణాల వల్ల ఈ మూడు జంటల మధ్య మొదలైన ప్రేమ చివరికి ఏమైంది? ఎంతమంది కలిసున్నారు? ఎంతమంది విడిపోయారు? అనేది మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొట్ట మొదటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే నటీనటుల పెర్ఫార్మన్స్. అందరూ చాలా బాగా చేసారు. నటీనటుల్లో మొదటగా చెప్పాల్సింది.. రాయల్ రాజు పాత్ర చేసిన విష్ణు గురించి.. విష్ణు మూవీలో మాస్ లుక్ లో కనిపిస్తూ, పల్లెటూరి యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేసాడు. డైరెక్టర్ అనుకున్న మాస్ పాత్రకి 100% న్యాయం చేసాడు. ఇతని పాత్ర బి, సి సెంటర్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుంది. సరైన పాత్రలు పడితే విషుని మంచి యాక్టర్ గా పెరుతెచ్చుకుంటాడు. హర్షవర్ధన్ రాణే రాక్ స్టార్ పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయాడు. అతను చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ప్లే బాయ్ పాత్రకి హరీష్ వర్మ పూర్తి న్యాయం చేసాడు.

ఇక హీరోయిన్స్ లో రీతు వర్మ మోడరన్ గర్ల్ గా చూడటానికి ఎంత బాగుందో, అలాగే డైరెక్టర్ అనుకున్న పాత్రకి కూడా న్యాయం చేసింది. వితిక షేరు మంచి నటనని కనబరిచింది. శ్రీ ముఖి ఓకే అనేలా ఉంది. సెకండాఫ్ లో అర్జున్ – శాంతి మధ్యలో వచ్చే ట్విస్ట్ బాగుంది. ఇక మిల్లినియం స్టార్ మహానామగా కనిపించిన సత్యం రాజేష్ మంచి కామెడీని పండించి ప్రేక్షకులను బాగా నవ్వించాడు. అలాగే రాండీ ఫ్రెండ్ గా సినిమాలో అతనితో పాటు ట్రావెల్ అయిన జబర్దస్త్ జోష్ రవి కూడా బాగా నవ్వించాడు.

క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా బాగుంది. మూడు జంటల లవ్ స్టొరీలకి క్లైమాక్స్ లో ఇచ్చిన జస్టిఫికేషన్ చాలా బాగుంది. ఈ సినిమాలోని పాటలు ఎంత హిట్ అయ్యాయో అంతకన్నా విజువల్స్, లోకేషన్స్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

మన నిజజీవితంలో కనిపించే ప్రేమ కథలనే కాస్త డిఫరెంట్ గా ప్రెజెంట్ చెయ్యాలనుకున్న డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లేని కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నాడు. కానీ సెకండాఫ్ ని మాత్రం రొటీన్ గా చేసేసాడు. సెకండాఫ్ లో వేగం కాస్త తగ్గిపోవడమే కాకుండా మూడు లవ్ ట్రాక్స్ లో వచ్చే సీన్స్ ఏమిమీ జరుగుతుందా అనేది ఆడియన్స్ ఊహించేలా ఉంటుంది. కానీ క్లైమాక్స్ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది.

సినిమా నిడివి 2 గంటలా 18 నిమిషాలు కావడం వల్ల చాలా చోట్ల సాగదీస్తున్నాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇదే కాన్సెప్ట్ ని డైరెక్టర్ నిడివి తగ్గించి తీసుంటే ఇంకా బాగుండేది. అలాగే డైరెక్టర్ ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకొని ఉంటే సినిమాకి చాలా హెల్ప్ అయ్యేది. అలాగే డైరెక్టర్ ముందు నుంచే మల్టీ ప్లేక్స్ సినిమా అనుకోని తీసినట్టున్నాడు. అందుకే బి సి సెంటర్ కి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ని పెద్దగా టచ్ చెయ్యలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో మొదటగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని గురించి. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఫస్ట్ ఫ్రేం నుంచి చివరి వరకు ప్రతి ఫ్రేంని బాగా రిచ్ గా చాలా కలర్ఫుల్ గా చూపించాడు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రతి ఫ్రేం లోని ఫీల్ పోకుండా, సీన్ లోని ఎమోషన్ మిస్ అవ్వకుండా సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే శ్రవణ్ అందించిన పాటల్లో సమ్మతమే, తుల్లే తుల్లే, ప్రేమ ఇష్క్ కాదల్ పాటలు చాలా బాగున్నాయి.

సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయి. అందులో మచ్చుకి ఒకటి చెప్తా ‘నొప్పెడితే అమ్మా అని కూడా ఇంగ్లీష్ లో అనే అమ్మాయితో ఏం మాట్లాడుతాం రా’. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ నిర్మాతగా బాగా రిచ్ ఫీల్ వచ్చేలా ఈ సినిమాని తెరకెక్కించారు. చివరిగా ఈ సినిమాకి సూత్రధారి అయిన డైరెక్టర్ పవన్ సాధినేని గురించి మాట్లాడుదాం. ఈ మధ్య 90% చిన్న సినిమా అంటే భూతు అంటున్న తరుణంలో ఇలాంటి డీసెంట్ మూవీ తీసినందుకు పవన్ ని మెచ్చుకొని తీరాలి. సినిమా పరంగా ఫస్ట్ హాఫ్, క్లైమాక్స్ మీద తీసుకున్నంత శ్రద్ధ సెకండాఫ్, ఎంటర్టైన్మెంట్ మీద కూడా తీసుకొని ఉంటే బాగుండేది. కథా పరంగా మూడు లవ్ స్టొరీలను ఎంచుకున్న పవన్ ప్రతి ఒక్క స్టొరీకి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చాడు. ఇది చాలా కష్టమైన విషయం కానీ పవన్ మాత్రం చాలా బాగా డీల్ చేసాడు. ఓవరాల్ గా మొదటి సినిమాతో విషయమున్న డైరెక్టర్ అనిపించుకుంటాడు.

తీర్పు :

ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా ఎక్కువగా మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులని ఆకట్టుకునే డీసెంట్ లవ్ ఎంటర్టైనర్. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ చాలా రిచ్ ఫీల్ వచ్చేలా తీసిన ఈ చిత్ర టీంని అభినందించి తీరాలి. కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఆకట్టుకునే ఫస్ట్ హాఫ్, క్లైమాక్స్, నటీనటుల పెర్ఫార్మన్స్, సూపర్బ్ సాంగ్స్ ఈ సినిమాకి ప్లస్ అయితే రొటీన్ గా కనిపించే సెకండాఫ్ చెప్పదగిన మైనస్ పాయింట్. ఓవరాల్ గా ప్రేమ ఇష్క్ కాదల్ చూడదగిన డీసెంట్ లవ్ ఎంటర్టైనర్.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

రాఘవ

 

CLICK HERE FOR ENGLISH REVIEW

 
Like us on Facebook