సమీక్ష : సాహసం శ్వాసగా సాగిపో – కొంచెం రొమాన్స్, కొంచెం యాక్షన్..!!

Sahasam Swasaga Sagipo review

విడుదల తేదీ : నవంబర్ 11, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : గౌతమ్ మీనన్

నిర్మాత : రవీందర్ రెడ్డి

సంగీతం : ఏ.ఆర్.రహమాన్

నటీనటులు : నాగ చైతన్య, మంజిమ మోహన్..


దర్శకుడు గౌతమ్ మీనన్ – హీరో నాగ చైతన్య కలిసి చేసిన ‘ఏమాయ చేశావే’కి కల్ట్ క్లాసిక్ అన్న పేరుంది. తాజాగా ఈ కాంబినేషన్‌లో వచ్చిన మరో సినిమాయే ‘సాహసం శ్వాసగా సాగిపో’. గతేడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ప్రేమమ్‌’తో ఈమధ్యే కెరీర్ బెస్ట్ హిట్ కొట్టేసిన నాగ చైతన్య, ‘సాహసం శ్వాసగా సాగిపో’తో దాన్ని కొనసాగించే స్థాయిలోనే మెప్పించాడా? చూద్దాం..

కథ :

చిన్నా (నాగ చైతన్య) చదువైపోయి సరదాగా కాలం వెళ్ళదీసే ఓ ఎగువ మధ్యతరగతి యువకుడు. ఏదైనా మంచి జాబ్ ఆఫర్ వచ్చేవరకూ ఖాళీగానే కాలం వెళ్ళదీయాలనుకొని, సింపుల్ జీవితం గడుపుతూ ఉండే అతడి జీవితంలోకి లీలా (మంజిమ మోహన్) ప్రవేశిస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు కొద్దిరోజుల్లోనే బాగా దగ్గరవుతారు. కన్యాకుమారికి రోడ్ ట్రిప్‌పై వెళ్ళడమైన తన కలను లీలాతో కలిసి చిన్నా నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలోనే వీరి ప్రయాణం అనుకోని మలుపులు తిరుగుతుంది. లీలాపై కొందరు దుండగులు దాడికి పాల్పడుతూ ఉంటారు. ఆ దుండగులెవరు? లీలాపై వారెందుకు దాడి చేస్తూంటారు? వీటన్నింటిని చిన్నా, లీలాలు ఎలా ఎదుర్కున్నారన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

గౌతమ్ మీనన్ ట్రై చేసిన యాక్షన్, రొమాన్స్‌ను మిక్స్ చేయడమనే అంశం ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్ అంతా రొమాన్స్‌తో, రోడ్ ట్రిప్‌తో సరదాగా నడిపి, ఇంటర్వెల్‌లో మంచి ట్విస్ట్ పెట్టడం, అక్కణ్ణుంచి సినిమానంతా ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా మార్చేయడం ఇలా ఈ సెటప్ అంతా బాగుంది. ఇక ఫస్టాఫ్‌ అంతా గౌతమ్ మీనన్ స్టైల్ మేకింగ్, రొమాంటిక్ సన్నివేశాల్లోనుంచి ఆయన పుట్టించే ఫన్‌తో చాలా బాగుంది. హీరో ఫ్రెండ్ మహేష్ పాత్ర చుట్టూ వచ్చే ఫన్ కూడా బాగుంది. హీరో-హీరోయిన్ల లవ్ చాలా కొత్తగా ఉంది.

నాగ చైతన్య ఈ సినిమాతో నటుడిగా మరోస్థాయికి వెళ్ళాడనే చెప్పొచ్చు. ఫస్టాఫ్‌లో సాఫ్ట్‌గా పక్కింటి కుర్రాడిలా కనిపించి, సెకండాఫ్‌లో పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి వెళ్ళిపోయే పాత్రలో చైతన్య అదిరిపోయే ప్రతిభ కనబరిచాడు. మంజిమ మోహన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. నటనపరంగానూ ఆమెకు వంక పెట్టలేం. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇక హీరో పేరును మొదట్నుంచీ ప్రీ క్లైమాక్స్ వరకూ దాచిపెట్టి అక్కడ రివీల్ చేయడం చాలా కొత్తగా ఉంది.

మైనస్ పాయింట్స్ :

క్లైమాక్స్‌ను కథతో సంబంధం లేకుండా విచిత్రంగా డిజైన్ చేయడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. అంతవరకూ సింపుల్‌గా, బాగా కనిపించిన సినిమా ఈ క్లైమాక్స్‌తో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. నాగ చైతన్య పాత్ర కూడా అంతవరకూ ఈజీగా కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేసి క్లైమాక్స్ కోసమే పూర్తిగా మార్చేయడం మాత్రం ఇబ్బంది పెట్టింది. ఇక మరీ స్లో నెరేషన్ కావడం కూడా కొన్నిచోట్ల ఇబ్బంది పెట్టింది. ఇక ఫస్టాఫ్‌లో రొమాన్స్ చూసి సెకండాఫ్ కూడా అలాగే ఉండాలని ఆశిస్తే మాత్రం సినిమా అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటూ నిరుత్సాహపరుస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, దర్శకుడు గౌతమ్ మీనన్ ఎప్పట్లాగే తన స్టైల్‌ను ఎక్కడా వీడకుండా రొమాన్స్‌ను అద్భుతంగా పండించారు. గౌతమ్ మీనన్ ప్రేమకథల్లో మెచ్యురిటీతో పాటు కొత్తదనం కూడా ఉంటుంది. ఈ సినిమాలోనూ అది చూడొచ్చు. రొమాన్స్, యాక్షన్‌ను సరిగ్గా కలపడంలో రచయితగా గౌతమ్ మీనన్ ప్రతిభగా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ విషయంలో వేరేలా ఆలోచించి ఉంటే సినిమా స్థాయి ఇంకోలా ఉండేదనిపించింది. మేకింగ్ పరంగా గౌతమ్ మీనన్ మార్క్‌ను చాలాచోట్ల చూడొచ్చు.

ఏ.ఆర్.రహమాన్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. అవన్నీ కథలో భాగంగా వస్తూ ఇంకా బాగా ఆకట్టుకున్నాయి. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదే స్థాయిలో ఉంది. సినిమాటోగ్రాఫీ టాప్ క్లాస్ ఉంది. ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కి వంక పెట్టడానికి లేదు.

తీర్పు :

గౌతమ్ మీనన్ సినిమాలంటే తెలిసిన కథలనే చాలా కొత్తగా, ఇంతకుముందు చూడని కోణంలో చెప్పేవిగా పేరుంది. ‘సాహసం శ్వాసగా సాగిపో’ కూడా అలాంటి సింపుల్ కథతో వచ్చిన సినిమాయే! ఆ సింపుల్ కథకే రొమాన్స్, యాక్షన్‌ను సరిగ్గా జోడిస్తూ గౌతమ్ మీనన్ చేసిన ప్రయత్నం ఆకట్టుకునేదిగా చెప్పుకోవచ్చు. అలవోకగా నటించేసిన నాగ చైతన్య నటనా ప్రతిభ, మంజిమ మోహన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫస్టాఫ్‌లో వచ్చే క్యూట్ రొమాన్స్ ఈ సినిమాకు అనుకూలాంశాలు. ఇకపోతే సెకండాఫ్ కాస్త స్లో అవ్వడం, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన నెరేషన్ కావడం ప్రతికూలాంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘సాహసం శ్వాసగా సాగిపో’, కొంచెం రొమాన్స్, కొంచెం యాక్షన్‌తో సాగిపోయే సినిమా!

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

 
Like us on Facebook