సమీక్ష : శంభో శంక‌ర‌ – శంకర్ పెర్ఫార్మెన్స్ బాగుందంతే

సమీక్ష : శంభో శంక‌ర‌ – శంకర్ పెర్ఫార్మెన్స్ బాగుందంతే

Published on Jun 29, 2018 5:12 PM IST
Shambo Shankara movie review

విడుదల తేదీ : జూన్ 29, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : శంకర్, కారుణ్య చౌదరి, అజయ్ ఘోష్

దర్శకత్వం : ఎన్. శ్రీధర్

నిర్మాతలు : వై.రమణా రెడ్డి, సురేష్ కొండేటి

సంగీతం : సాయి కార్తిక్

సినిమాటోగ్రఫర్ : రాజశేఖర్

ఎడిటర్ : చోటా.కె.ప్రసాద్

స్క్రీన్ ప్లే : ఎన్. శ్రీధర్

హాస్యనటుడిగా అందరికీ సుపరిచితమైన శంకర్ హీరోగా టర్న్ తీసుకుని చేసిన చిత్రం ‘శంభో శంకర’. ఎన్. శ్రీధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

కరువుతో అల్లాడుతున్న అంకాలమ్మ పల్లెను ఆ ఊరి ప్రెసిడెంట్ (అజయ్ ఘోష్) అక్రమాలు చేస్తూ ఇంకా దోచుకుతింటుంటాడు. అదే ఊర్లో ఉండే శంకర్ (శంకర్) అనే కుర్రాడు అప్పుడప్పుడు ప్రెసిడెంట్ చేసే అక్రమాలకు అడ్డుపడుతుంటాడు.

దాంతో ప్రెసిడెంట్ అతన్ని అడ్డు తొలగించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కొని శంకర్ ఎలా తన ఊరిని కాపాడాడు, రైతుల కష్టాల్ని ఎలా తీర్చాడు అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో బాగా అలరించిన అంశం ఏదైనా ఉందా అంటే అది శంకర్ అనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు హాస్యనటుడిగా కనిపించిన శంకర్ ను ఒక్కసారిగా హీరోగా చూడటం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. బరువు తగ్గి, బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న ఆయన తన పెర్ఫార్మెన్స్ తో అలరించాడు. పెద్ద పెద్ద డైలాగులను చెబుతూ, మంచి డ్యాన్సులు, ఫైట్స్ చేస్తూ సహజమైన నటనను కనబర్చి తనలో కథను నడపగల సత్తా ఉందని నిరూపించుకున్నాడు. తన ట్రేడ్ మార్క్ అయిన శ్రీకాకుళంలో యాసలో మాట్లాడుతూ ఆకట్టుకున్నాడు.

ఇక దర్శకుడు ఎన్. శ్రీధర్ శంకర్ పాత్రను జాగ్రత్తగా డిజైన్ చేసి శంకర్ నుండి తనకు కావాల్సిన ఔట్ పుట్ రాబట్టుకోవడంలో సఫలమయ్యారు. ఫస్టాఫ్ లో ఆయన రాసిన కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ను కూడ బాగుంది. చాలా చోట్ల శంకర్ లోని నటుడు బాగా ఎలివేట్ అయ్యాడు. హీరోయిన్ కారుణ్య చౌదరి, శంకర్ లకు కెమిస్ట్రీ బాగానే కుదిరింది. పాటలు చూడటానికి, వినడానికి కొంతమేర బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు ఎన్.శ్రీధర్ కథలో శంకర్ పాత్రను బాగానే డిజైన్ చేసుకున్నారు కానీ కథనాన్ని సరిగ్గా రాసుకోలేకపోయారు. కొన్ని బోర్ కొట్టే అనవసరమైన సన్నివేశాలు ఉన్నా మొదటి అర్ధభాగం వరకు పర్వాలేదనిపించిన స్క్రీన్ ప్లే సెకండాఫ్ కు వచ్చే సరికి పూర్తిగా రొటీన్ అయిపొయింది. ఎన్నో పాత సినిమాల్లో చూసిన మలుపులు, సన్నివేశాలే ఇందులోనూ దర్శనమిచ్చాయి.

హీరో ఊరికి దేవుడిగా మారే సన్నివేశాలు కొంత విపరీతంగాను, సిల్లీగాను ఉండటం, శంకర్ నటన కూడ అదుపుతప్పి కావాల్సిన స్థాయిని మించిపోవడంతో ద్వితీయార్థం బోర్ కొట్టింది. అంతేగాక హీరో తన కొడుకుని చంపినా ప్రతి నాయకుడిలో పెద్దగా చలనం కనబడకపోవడం, ఒక్కసారిగా పరిస్థితులన్నీ హీరోకు అనుకూలంగా మారిపోవడం, కీలక సన్నివేశాలు కొనసాగింపు లేకుండా చక చకా ముగిసిపోవడం వలన సినిమా మరీ నాటకీయంగా మారిపోయింది.

సినిమాలో శంకర్ హీరోనే అయినా ప్రేక్షకుల్ని నవ్వించాల్సిన భాద్యత కూడ ఆయనదే. ఆయన ఆ భాద్యతనే నెరవేర్చలేకపోయారు. కామెడీని పూర్తిగా పక్కనబెట్టేశారు. సినిమా మొత్తంలో హాయిగా నవ్వుకోగల కామెడీ సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడ లేదు. ముగింపుకు ముందు వచ్చే ట్విస్ట్ ఊహించనిదే అయినా ఏమాత్రం థ్రిల్ చేయలేకపోయింది.

సాంకేతిక విభాగం :

హీరో పాత్రను బాగా డిజైన్ చేసి, శంకర్ ను కథానాయకుడిగా చూపగలిగిన దర్శకుడు ఎన్. శ్రీధర్ కథ, కథనాల్ని మాత్రం ఆకట్టుకునేలా రాసుకోలేకపోయారు. ఆయన రాసిన భావోద్వేగపూరితమైన కొన్ని ఫ్యామిలీ సీన్స్, హీరో ఎలివేషన్ సన్నివేశాలు తప్ప సినిమాలో ఎంజాయ్ చేయడానికి పెద్దగా స్కోప్ దొరకలేదు.

సంగీత దర్శకుడు సాయి కార్తిక్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంత మెప్పించాయి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. శంకర్ ను స్క్రీన్ మీద బాగానే చూపించారాయన. ఎడిటర్ చోటా.కె.ప్రసాద్ గారు ఫస్టాఫ్ ను కొంత ట్రిమ్ చేసి ఉండాల్సింది. నిర్మాతలు వై.రమణా రెడ్డి, సురేష్ కొండేటిలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

శంకర్ హీరోగా చేసిన ఈ తొలి ప్రయత్నం ఆయనకు మంచి ఫలితాన్నే ఇస్తుంది. సినిమాలో నటనతో, డ్యాన్సులతో, ఫైట్స్ తో శంకర్ నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకోగా దర్శకుడు ఎన్. శ్రీధర్ రాసిన కొన్ని ఎమోషనల్ సీన్స్, హీరో ఎలివేషన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కానీ రొటీన్ సెకండాఫ్, సాగదీయబడిన ఫస్టాఫ్, నాటకీయంగా సాగిన కీలక సన్నివేశాలు బాగా బోర్ కొట్టించాయి. పైగా సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడ కరువైంది. మొత్తం మీద ఈ ‘శంభో శంకర’ చిత్రం ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ను ఆశించే వాళ్ళను నిరాశను మిగులుస్తుంది కానీ శంకర్ ను స్క్రీన్ మీద హీరోగా చూడాలనుకునే వాళ్లకు మాత్రం కొంత నచ్చుతుంది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు