సమీక్ష : “తగ్గేదే లే” – బోరింగ్ క్రైమ్ థ్రిల్లర్!

సమీక్ష : “తగ్గేదే లే” – బోరింగ్ క్రైమ్ థ్రిల్లర్!

Published on Nov 5, 2022 3:02 AM IST
taggedhele Movie-Review-In-Telugu

విడుదల తేదీ : నవంబర్ 04, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: నవీన్ చంద్ర .. అనన్య రాజ్ .. దివ్య పిళ్లై కనిపించనున్నారు. ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతాన్ని

దర్శకుడు : శ్రీనివాస్ రాజు

నిర్మాత: భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్

సంగీతం: చరణ్ అర్జున్

సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

నవీన్ చంద్ర హీరోగా వచ్చిన ‘తగ్గేదే లే’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి శ్రీనివాసరాజు దర్శకుడిగా వ్యవహరించాడు. గతంలో ఆయన నుంచి వచ్చిన ‘దండుపాళ్యం’ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే సిరీస్ లో ఆయన చేసిన సినిమానే ‘తగ్గేదే లే’. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

 

నవీన్ చంద్ర (ఈశ్వర్) ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. ఫ్రెండ్స్ కారణంగా ఎంజాయ్ చేయడానికి ఓ ప్రైవేట్ ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ నవీన్ చంద్రకి అనన్య రాజ్ (లీజా) పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరు శారీరికంగా దగ్గర అవుతారు. అయితే, ఆ విషయాన్ని అక్కడే మర్చిపోమని అనన్య రాజ్ (లీజా) నవీన్ చంద్రని వదిలేసి వెళ్ళిపోతుంది. అనంతరం కొన్ని నాటకీయ పరిణామాల మధ్య దేవి (దివ్యా పిళ్లై)తో నవీన్ చంద్ర పెళ్లి అవుతుంది. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయితే, అంతలో సడెన్ గా మళ్లీ అనన్య రాజ్ (లీజా) ఎంట్రీ ఇచ్చి.. నవీన్ చంద్ర ఫ్యామిలీ లైఫ్ ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మరి నవీన్ చంద్ర ఎలా రియాక్ట్ అయ్యాడు ?, ఈ మధ్యలో ‘దండుపాళ్యం’ బ్యాచ్ ట్రాక్ ఏమిటి ?, అలాగే పోలీస్ ఆఫీసర్ ర‌వి శంక‌ర్ పాత్ర కథను ఎలా నడిపింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాకి ప్రధానంగా ప్లస్ పాయింట్ అంటే.. ఈ కథలోని దండుపాళ్యం బ్యాచ్ తాలూకు యాక్షన్ ఎపిసోడే. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన ర‌వి శంక‌ర్, తన నటనతో సినిమాకే హైలైట్ గా నిలిచారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లోని యాక్షన్ సీక్వెన్స్ లో ర‌వి శంక‌ర్ అద్భుతంగా నటించాడు. హీరోగా నటించిన నవీన్ చంద్ర తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

‘దండుపాళ్యం’ బ్యాచ్ మొత్తం సినిమాని తమ భుజాలపై వేసుకుంది. ముఖ్యంగా మకరంద్ దేశ్ పాండే .. పూజా గాంధీ చాలా బాగా నటించారు. ఇక హీరోయిన్ గా నటించిన దివ్యా పిళ్లై తన పాత్రలో చాలా బాగా నటించింది. అలాగే అనన్య రాజ్ కూడా తన స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్సీ తో మెప్పించింది. ఆమె కొన్ని ఎక్స్ ప్రేషన్స్ ను కూడా చక్కగా పలికించింది. మొత్తంగా హీరోయిన్లిద్దరూ తమ టైమింగ్ తో బాగా అలరించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

 

మైనస్ పాయింట్స్ :

 

అసలు ఈ ‘తగ్గేదే లే’ కథకు సినిమా టైటిల్ కి ఎక్కడా సంబంధమే లేదు. నిజానికి పాత్రల చిత్రీకరణ పరంగా పర్వాలేదు అనిపించినా, దర్శకుడు శ్రీనివాసరాజు కథను మొదలు పెట్టడంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా బోరింగ్ గా సాగుతుంది. అయినా ఓ మర్డర్ చుట్టూ కథను నడుపుతూ కూడా, దర్శకుడు కథలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెట్టలేకపోయాడు.

దీనికితోడు ప్లే లో చాలా టర్నింగ్ పాయింట్లు ఉన్నాయి గానీ, ఒక్కటి కూడా సహజంగా అండ్ ఆసక్తిగా సాగదు. సినిమా చివరి వరకూ చాలా ట్రాక్స్ ప్లాట్స్ తోనే ప్లేను సాగతీశారు. కానీ, ప్లే లో కనీస ఇంట్రెస్ట్ కూడా లేదు. స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా నడపడంతో సినిమా ఎవరికీ కనెక్ట్ కాదు. దీనికి తోడు ప్రతి పాత్ర ఒకే ఎమోషన్ తో ఎలాంటి బలమైన సంఘర్షణ లేకుండా చాలా నిస్సహాయతతోటి సాగింది.

అదేవిధంగా చాలా సీన్స్ అస్సలు లాజిక్ లేకుండా సాగాయి. సెకండ్ హాఫ్ బాగా బోర్ గా సాగింది. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే.. చిరాకు తెప్పిస్తాయి. సైకోలు కూడా ఆ సీన్స్ ను ఇష్టపడకపోవచ్చు. ఆ స్థాయిలో ఉన్నాయి ఆ సీన్స్. ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా అసలు మెప్పించదు.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. శ్రీనివాసరాజు దర్శకుడిగా ఆకట్టుకున్నా.. కథనంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. కెమెరామెన్ గా చేసిన వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని క్రైమ్ సన్నివేశాల్లో వెంకట్ ప్రసాద్ పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా నైనా గంగూలీ పాట, ఆ పాటను చిత్రీకరించిన విధానం మెప్పిస్తోంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

‘తగ్గేదే లే’ అంటూ క్రైమ్ అండ్ యాక్షన్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. స్లో నేరేషన్, సినిమాలో బోరింగ్ ట్రీట్మెంట్ ఎక్కువవడం, బలమైన కాన్ ఫ్లిక్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే, నవీన్ చంద్ర, రవి శంకర్ నటన బాగుంది. కానీ, ఈ సినిమా మాత్రం ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు