సమీక్ష : యూటర్న్ – సస్పెన్స్ తో సాగే మిస్టరీ

సమీక్ష : యూటర్న్ – సస్పెన్స్ తో సాగే మిస్టరీ

Published on Sep 14, 2018 12:20 PM IST
U Turn movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 13, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు :  సమంత, భూమిక, ఆది పినిశెట్టి

దర్శకత్వం : పవన్ కుమార్

నిర్మాతలు : శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు

సంగీతం : పూర్ణచంద్ర

సినిమాటోగ్రఫర్ : నికెత్ బొమ్మి రెడ్డి

ఎడిటర్ : సురేష్ ఆరుముగమ్

అగ్ర హీరోయిన్ సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యూ టర్న్’. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వినాయకచవితి రోజు సందర్భంగా తెలుగు , తమిళ భాషల్లో ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ:

రచన (సమంత) టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్టర్ గా వర్క్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆర్కేపురం ఫ్లై ఓవర్ పై జరిగే యాక్సిడెంట్లకు సంబంధించి ఓ కథ రాయాలనుకుంటుంది. ఆ ప్రక్రియలో ఆ ఫ్లై ఓవర్ పై యూ టర్న్ తీసుకున్న వ్యక్తులను ఇంటర్వ్యూ చేసే ప్రాసెస్ లో వాళ్ళ వెహికిల్స్ నెంబర్స్ కలెక్ట్ చేస్తోంది. అలా కలెక్ట్ చేసుకున్న వ్యక్తుల్లో సుందరం ఒకడు. అతన్ని ఇంటర్వ్యూ చెయ్యటానికి అతని ఇంటికి వెళ్లి వస్తోంది. కానీ అప్పటికే సుందరం చనిపోయి ఉంటాడు. దీంతో రచనే సుందరాన్ని హత్య చేసిందని, పోలీసులు ఆమెను అనుమానించి ఎంక్వేరి చేస్తారు. ఆ ఎంక్వేరిలో ఎస్ఐ నాయక్ (ఆది)కు రచన ఏ తప్పు చెయ్యలేదని అర్ధమవుతుంది.

కానీ అంతలో రచన కలెక్ట్ చేసిన ఆ ఫ్లై ఓవర్ పై యూ టర్న్ తీసుకున్న వ్యక్తులు అందరూ చనిపోయి ఉంటారు. అసలు ఫ్లై ఓవర్ పై యూ టర్న్ తీసుకున్న వ్యక్తులే ఎందుకు చనిపోతున్నారు ? వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఎవరైనా వారిని హత్య చేశారా ? రచనకు ఈ కేసుకు సంబంధం ఏమిటి ? రచన ప్రేమించిన రాహుల్ రవింద్రన్ కి ఈ కేసులో ఏమైనా సంబంధం ఉందా ? చివరకి రచన మరియు నాయక్ యూ టర్న్ తీసుకున్న వ్యక్తుల చావుకు కారణం ఎవరో తెలుసుకుంటారా ? ఫైనల్ గా ఈ యూ టర్న్ మిస్టరీకి సొల్యూషన్ ఏమిటి ?
లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో రచన అనే జర్నలిస్టు పాత్రలో నటించన సమంత తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఒక పక్క ఏం జరుగుతుందో, తాను డిటైల్స్ కలెక్ట్ చేసిన వ్యక్తులే ఎందుకు వరుసగా చనిపోయారో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఆమె తన అభినయంతో మరింతగా ఉత్సుకతను పెంచుతూ సినిమాకే హైలెట్ గా నిలిచారు.

వాళ్ళ చావుకి కారణం తెలిసాక, మిగిలిన వారిని కాపాడటానికి ప్రయత్నించే సన్నివేశాల్లో కూడా సమంత తన నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఇక మొదటి భాగంలో సస్పెన్స్ తో కూడుకున్న సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే యూ టర్న్ కి సంబంధించి చేసే ఇన్వెస్టిగేషన్ కూడా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.

ఎస్ ఐ నాయక్ పాత్రలో అది పినిశెట్టి ఎప్పటిలాగే బాగా నటించారు. సినిమాకే చాలా కీలకమైన పాత్రలో కనిపించిన భూమిక చావ్లా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో ఆమె నటన సినిమాకి చాలా హెల్ప్ అయింది. అలాగే క్రైమ్ రిపోర్టర్ గా నటించిన రాహుల్ రవింద్రన్ కూడా ఉన్నంతలో తన నటనతో ఆకట్టుకుంటాడు.

సస్పెన్స్ తో సీరియస్ గా సాగుతున్న ఈ సినిమాకి సమంత మదర్ ట్రాక్.. చాలా సరదాగా సాగుతుంది. సమంతకి ఆమె మదర్ కి మధ్యలో వచ్చే డైలాగ్స్ అక్కడక్కడ నవ్విస్తాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

దర్శకుడు పవన్ ఈ సినిమాలో అంతర్లీనంగా చెప్పాలనుకున్న మెసేజ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కథనంలో కూడా ఆయన మెయింటైన్ చేసిన సప్సెన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తోంది.

 

మైనస్ పాయింట్స్:

దర్శకుడు పవన్ కుమార్ మంచి స్టోరీ ఐడియా తీసుకున్నారు. ఆ ఐడియాకి చక్కని మెసేజ్ జోడించడం వరకు బాగుంది. కానీ పవన్ తీసుకున్న పాయింట్ కి సరైన ట్రీట్మెంట్ రాసుకోవడంలో మాత్రం ఆయన విఫలమయ్యారు. సెకెండాఫ్ లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగాతీశారనిపిస్తోంది. ముఖ్యంగా సెకెండాఫ్ లో స్లోగా సాగే కథనం, సినిమా పై ఆసక్తిని నీరుగారుస్తోంది.

కొన్ని సన్నివేశాలను బాగానే చిత్రీకరించినప్పటికి, సినిమాలో చాలా భాగం ఆసక్తికరంగా సాగకపోవడం, భూమిక చావ్లా క్యారెక్టర్ తాలూకు సన్నివేశాలు బాగున్నప్పటికీ, అవి వాస్తవానికి దూరంగా ఉండటం, చాలా చోట్ల స్క్రీన్ ప్లే నమ్మశక్యంగా లేకపోవడం.. ఓవరాల్ గా ఈ సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.

సమంత అండ్ రాహుల్ లవ్ ట్రాక్ కూడా చాలా బోరింగ్ గా సాగుతుంది. దీనికి తోడు సినిమా మొత్తం సింగిల్ పాయింట్ మీద నడవడం కూడా సినిమా పై విసుగు తెప్పిస్తోంది.

 

సాంకేతిక విభాగం :

ఈ చిత్ర దర్శకుడు పవన్ కుమార్ ఒక మంచి కథాంశాన్ని ఎంచుకున్నాడు. అయితే ఆయన రాసుకున్న రెండో భాగంలోని కథనం ఫ్లాట్ గా ఉంది. పవన్ స్క్రిప్ట్ మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉంటే ఈ చిత్రం ఇంకా బాగా వచ్చి ఉండేది.

నికెత్ బొమ్మి రెడ్డి కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్ చాలా బాగున్నాయి. పూర్ణ చంద్ర అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా మిస్టరీకి సంబంధించిన సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన నేపధ్య సంగీతం చాలా బాగుంది. ఎడిటర్ సురేష్ పనితరం కూడా పర్వాలేదనిపిస్తోంది. నిర్మాతలు శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

పవన్ కుమార్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాగుతుంది. సినిమాలో అక్కడక్కడ వచ్చే ఊహించని సన్నివేశాలు, మిస్టరీకి సంబంధించిన సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగున్నాయి. కానీ కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం. సెకెండాఫ్ లో కథనం చాలా చోట్ల స్లోగా సాగడం వంటి డ్రా బ్యాగ్స్ కారణంగా సినిమా స్థాయి తగ్గుతుంది.

మొత్తం మీద భిన్నమైన, కొత్త తరహా చిత్రాలను ఇష్టపడేవారికి, మరియు సమంత మీద అభిమానంతో ఈ సినిమాకి వెళ్లేవారికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు