Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఉపేంద్ర 2 – ప్రేక్షకులకి అర్థం కాని సినిమా.

Upendra 2 review

విడుదల తేదీ : 14 ఆగష్టు 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25 /5

దర్శకత్వం : ఉపేంద్ర

నిర్మాత : నల్లమలపు బుజ్జి

సంగీతం : గురు కిరణ్

నటీనటులు : ఉపేంద్ర, క్రిస్టినా అఖీవా, పరుల్ యాదవ్…


సొసైటీలోని ఓ పాయింట్ ని తీసుకొని దాన్ని రొటీన్ అనే పదానికి దూరంగా, డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసి సినిమాలు చేయడంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రకి మంచి పేరుంది. ఇలాంటి తరహాలోనే గతంలో వచ్చిన ఉపేంద్ర సినిమాకి సీక్వెల్ గా ఉపేంద్ర హీరోగా, దర్శకుడిగా చేసిన సినిమా ‘ఉపేంద్ర 2’. ఉపేంద్ర సరసన క్రిస్టినా అఖీవా, పరుల్ యాదవ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని తెలుగులో నల్లమలపు బుజ్జి నిర్మించాడు. సూపర్ హిట్ మూవీ ఉపేంద్రకి సీక్వెల్ గా వచ్చిన ఈ ‘ఉపేంద్ర 2’ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

‘బ్రెయిన్ అనేది ఓ కోతి లాంటిది, కొంతమంది భవిష్యత్ ఆలోచనలో బిజీగా ఉంటే, కొంతమంది గతంలో ఉండిపోతారు. ఎవరైతే గతం, భవిష్యత్ అనే ఆలోచన లేకుండా ప్రస్తుతం, ఈ క్షణం అనేదాని గురించి మాత్రమే ఆలోచిస్తాడో తను చాలా హ్యాపీగా ఉంటాడు అని’ ఓ సైన్స్ ప్రొఫెసర్ చెప్పడంతో ఈ సినిమా మొదలవుతుంది. ఈ స్టొరీ విన్న లక్ష్మీ(క్రిస్టినా అఖీవా) అలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా అని తెలుసుకోవాలనుకుంటుంది. ప్రస్తుతం మాత్రమే ఆలోచించే వాడు ఒకడున్నాడు, వాడి పేరే నువ్వు(ఉపేంద్ర) అని చెప్పడంతో అతన్ని వెతుక్కుంటూ వెళ్లి అతన్ని కలుస్తుంది. అనుకున్నట్టుగానే ‘నువ్వు’ ఏం జరిగినా, ఎలాంటి సందర్భం ఎదురైనా భయపడకుండా, బాధ పడకుండా, మనీ సంపాదించకుండా ఆ క్షణంలో తనకి తోచింది చేసుకుంటూ జీవిస్తుంటాడు.

ఎవరు ఏం అడిగినా భవిష్యత్ గురించి ఆలోచించడం మానేయ్యండి అన్ని సెట్ అవుతాయని చెబుతుంటాడు. అతన్ని ఫాలో అయిన లక్ష్మీ నువ్వుతో ప్రేమలో పడుతుంది. పెళ్లి కూడా చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంటుంది. కానీ అదే టైంలో షీలా(పరుల్ యాదవ్) వచ్చి నువ్వు అనే వాడు నిజం కాదని, తనో పెద్ద మోసగాడని చెబుతుంది. లక్ష్మీ ఈ సంకటంలో ఉండగానే సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, మాఫియా డాన్ అయిన సలీమ్(శోభ్ రాజ్)లు ఆ నువ్వుని పట్టుకోవాలని ట్రై చేస్తుంటారు. వీళ్ళందరూ నువ్వు వెంట పడటానికి అసలు కారణం మల్టీ మిలినియర్ మందాకిని(ప్రియాంక ఉపేంద్ర). అసలు ఈ మందాకిని ఎవరు.? మందాకినికి నువ్వుకు ఉన్న సంబంధం ఏమిటి.? లక్ష్మీకి మందాకినికి సంబంధం ఏమిటి.? భవిష్యత్ పై ఆశలేని నువ్వుని బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, మాఫియా డాన్ సలీమ్ ఎందుకు టార్గెట్ చేస్తారు.? వీటన్నిటి నుంచి నువ్వు ఎలా బయటపడ్డాడు అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

ఉపేంద్ర సొంతంగా రాసుకునే కథలకు, అందులో క్రియేట్ చేసుకునే పాత్రలకు ఉపేంద్ర తప్ప మరెవరూ న్యాయం చేయలేరు అనడంలో అతిశయోక్తి లేదేమో.. కావున ఎప్పటిలానే తను ఈ సినిమా కోసం క్రియేట్ చేసిన నాలుగు డిఫరెంట్ అవతారాల్లో ఉపేంద్ర చాలా మంచి నటనని కనబరిచారు. సాఫ్ట్ పర్సన్, క్రేజీ అండ్ రూడ్ పర్సన్ గా, సన్యాసిగా, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా, ఇలా 4 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తను చేసిన కొన్ని సీన్స్, స్టైల్స్ ఆడియన్స్ కి క్రేజీగా అనిపిస్తాయి.

ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన క్రిస్టినా అఖీవ(గాలిపటం ఫేం) సినిమా మొదటి నుంచి అల్ట్రా మోడరన్ మరియు గ్లామరస్ లుక్ లో కనిపించి తన అందచందాలతో ముందు బెంచ్ వారిని బాగానే ఆకట్టుకుంది. అలాగే తన పాత్రకి కూడా న్యాయం చేసింది. ఒక చిన్న పాత్రలో కనిపించిన పరుల్ యాదవ్ కూడా తన గ్లామర్ తో, పొట్టి పొట్టి బట్టలతో ఆకట్టుకోవడానికే పరిమితం అయ్యింది తప్ప పాత్ర పరంగా పెద్దగా నటించే ఛాన్స్ లేదు. సాయాజీ షిండే, శోభ్ రాజ్, టెన్నిస్ కృష్ణ, బ్యాంకు జనార్ధన్ లు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సినిమా పరంగా ఓవరాల్ గా అక్కడక్కడా కొన్ని సీన్స్ మాత్రం బాగున్నాయి. ఉదాహరణకి సినిమా స్టార్టింగ్, సెకండాఫ్ లో వచ్చే హిమాలయ ఎపిసోడ్, ఇంటర్వెల్ లో వచ్చే ఓ ట్విస్ట్ లాంటి రెండు మూడు సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :

ఉపేంద్ర సినిమా చూసిన వారు లేదా ఉపేంద్ర సినిమాలు చూసి ఐడియా ఉన్న వారంతా ఈ సినిమా కూడా ఆ సినిమాలలానే చాలా స్పీడ్ గా, మంచి హార్డ్ హిట్టింగ్ పాయింట్ తో ఉంటుందని ఆశిస్తారు. కానీ ఇందులో అలాంటివి ఏమీ లేకపోవడం సినిమాకి మొదటి మైనస్ పాయింట్. సినిమా స్టార్టింగ్ బాగున్నా ఆ తర్వాత స్లో అయిపోతుంది, దానికి తోడు చెప్పిన పాయింట్ నే మళ్ళీ మళ్ళీ చెబుతుంటాడు అనే ఫీలింగ్ వస్తుంది. సినిమా 80% చాలా స్లోగా సాగుతుంది. ఎక్కడా సినిమాని స్పీడప్ చెయ్యాలనే ట్రై చెయ్యలేదు.

ఇకపోతే ఈ సినిమాలో కథ కోసం అనుకున్న పాయింట్ ని ఓవరాల్ గా సినిమాలో చెప్పలేకపోయాడు. కథనంలో ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసాడు. అక్కడి వరకూ బాగుంది, కానీ క్లైమాక్స్ లో ఆ కన్ఫ్యూజన్స్ ని క్లియర్ చెయ్యకుండా, ఆడియన్స్ కి అసలు అంట సేపు చూపిన విషయంపై సరైన క్లారిటీ ఇవ్వకుండా టక్కున సినిమాని ముగించేయడం ఆడియన్స్ కి మెంటల్ ఎక్కించేస్తుంది. ముఖ్యంగా చివర్లో 4 పాత్రలను ఒక్కసారిగా చూపించి, దేనికీ క్లారిటీ, అసలు నిజమైన పాత్ర ఏది అనేది చెప్పకుండా ముగించేయడం ఆడియన్స్ కి ఓ సాల్వ్ చెయ్యలేని పజిల్ లాంటిది. ఉపేంద్ర ఈ సినిమాలో చూపిన లాజిక్స్ ని అర్థం చేసుకోవాలంటే కామన్ ఆడియన్స్ కి చాలా కష్టం.

వీటన్నిటితో పాటు ఉపేంద్ర సినిమాల్లో ఉండే హార్డ్ హిట్టింగ్ కామెడీ, డైలాగ్స్ నాలుగైదు కూడా లేకపోవడం మరో మైనస్. ఎంటర్టైన్మెంట్ కోరుకొని వచ్చే వారికి నరకం చూపిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది సరిపోనట్టు డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో పిచ్చి పిచ్చిగా పాటలు వస్తూనే ఉంటాయి. అవి సినిమా చూసే ఆడియన్స్ కి బుదిబండలా తయారయ్యాయి. సినిమా రన్ టైం 135 నిమిషాలే అయినా మనం ఓ మూడు గంటలపైనే ఉన్న సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. అలాగే ఈ సినిమాలో మెయిన్ వారు తప్ప మిగతా ఎవ్వరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోవడం వలన వారిని భరించడం కాస్త కష్టంగా ఉంటుంది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో చెప్పుకోదగిన అంశాల విషయానికి వస్తే.. అశోక్ కశ్యప్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎంచుకున్న లోకేషన్స్ నీ మరియు వాటిని చూపించిన విధానం చాలా బాగుంది. గురు కిరణ్ అందించిన పాటలు ఒక్కటి కూడా తెలుగులో క్లిక్ అవ్వలేదు. కానీ నేపధ్య సంగీతం మాత్రం డీసెంట్ గా ఉంది. ఎడిటర్ శ్రీ ఇంకాస్త బెటర్ గా ఎడిట్ చేయాల్సింది. తెలుగులో డైలాగ్స్ బాగున్నాయి. ఇక ఈ సినిమాకి కెప్టెన్ అయిన ఉపేంద్ర విషయానికి వస్తే.. ఉపేంద్ర చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉంది, కానీ ఫుల్ స్క్రిప్ట్ మరియు కథనంలో ఆ విషయాన్ని సరిగా చెప్పలేకపోయాడు. ఇక డైరెక్టర్ గా నటీనటుల నుంచి అయితే మంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకోగలిగాడు, కానీ ఆడియన్స్ కి మాత్రం సినిమాని కనెక్ట్ చేయలేకపోయాడు. నల్లమలపు బుజ్జి డబ్బింగ్ వర్క్స్ డీసెంట్ గా ఉంది.

తీర్పు :

‘ఉపేంద్ర’ సినిమాని ఊహించుకొని, దానికి సీక్వెల్ గా వచ్చిన ‘ఉపేంద్ర 2’ సినిమాకి వచ్చే తెలుగు ఆడియన్స్ ని చివరిగా ఓ గందరగోళాన్ని మిగిల్చే సినిమానే ఇది. ఉపేంద్ర ఈ సినిమా కాన్సెప్ట్ ని చాలా క్లిష్టమైన పద్దతిలో, చూసే ప్రేక్షకులకు మెంటల్ వచ్చే రేంజ్ లో తీసాడు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత కన్ఫ్యూజన్ ఉన్న సినిమా రాలేదు. సినిమాలో సబ్ ప్లాట్స్, ఆసక్తి కోసం కొన్ని అపద్దపు ట్రాక్స్ ని రాసుకోవడంలో తప్పు లేదు, కానీ వాటికి చివర్లో క్లారిటీ ఇవ్వకపోతే ఆడియన్స్ కి మెంటల్ ఎక్కుతుంది, అదే విషయమే ఈ సినిమాలో జరిగింది. ఓవరాల్ గా ఉపేంద్ర పెర్ఫార్మన్స్, క్రిస్టినా అఖీవా, పరుల్ యాదవ్ ల గ్లామర్ అట్రాక్షన్ సినిమాకి ప్లస్ అయితే, అర్థం కాని కథ, బోరింగ్ కథనం, స్లో నేరేషన్, వీక్ డైరెక్షన్, నో ఎంటర్టైన్మెంట్ చెప్పదగిన బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా ‘ఉపేంద్ర 2’ సినిమా చూసిన ఆడియన్స్ కి సాల్వ్ చెయ్యలేని పజిల్ గా నిలిచిపోయే సినిమా ‘ఉపేంద్ర 2’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

 


సంబంధిత సమాచారం :