Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : వీరి వీరి గుమ్మడి పండు – వీరీ ‘సినిమా’ ఎటుపోయిందీ!?

Veeri Veeri Gummadi Pandu Review

విడుదల తేదీ : 26 ఫిబ్రవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : ఎం.వీ.సాగర్

నిర్మాత : కేలం కిరణ్

సంగీతం : పీ.ఆర్.

నటీనటులు : రుద్ర, సంజయ్, వెన్నెల…


శివ కృతి క్రియేషన్స్ పతాకంపై కేలం కిరణ్ కుమార్ నిర్మించిన సినిమా ‘వీరి వీరి గుమ్మడి పండు’. లవ్, ఫ్యామిలీ, హర్రర్ ఎలిమెంట్స్ ప్రధాన అంశాలుగా తెరకెక్కిన ఈ సినిమాలో రుద్ర, సంజయ్, వెన్నెల ప్రధాన పాత్రల్లో నటించారు. ఎమ్.వీ.సాగర్ దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమాను రూపొందించారు. మొత్తం 63 మంది కొత్తవాళ్ళను పరిచయం చేస్తూ రూపొందిన సినిమాగా ప్రచారం పొందిన ‘వీరి వీరి గుమ్మడి పండు’, ఎంతవరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

రావు గారి కుటుంబం ఓ సూపర్ స్టార్ ఎంతో ఇష్టంగా కట్టించుకొని, కలిసిరాక వదిలేసిన ఓ బంగ్లాను కొనుగోలు చేస్తుంది. పిల్లల అల్లరి, పెద్దల ప్రేమానురాగాలతో ఎంతో సరదాగా సాగిపోయే వారి జీవితాల్లోకి అనూహ్యంగా కొన్ని మలుపులు వస్తాయి. బంగ్లాలో జరిగే ఏవేవో విచిత్ర పరిస్థితులు ఆ కుటుంబానికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అసలు ఆ బంగ్లాలో ఏం ఉంది? ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న అదృశ్య శక్తి ఏంటి? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ సమస్యల నుంచి తమ కుటుంబాన్ని రావు గారి కుమారులు చిట్టి (రుద్ర), బాబు(సంజయ్) ఎలా కాపాడుకున్నారు? అన్నది కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అంటే ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్స్ సమయంలో మేకింగ్ పరంగా, సస్పెన్స్ పరంగా చూపిన ప్రతిభ గురించి చెప్పుకోవచ్చు. అప్పటివరకూ సినిమా అసలు కథలోకి వెళ్ళకపోవడంతో ఈ పార్ట్‌లో సస్పెన్స్ ఎలిమెంట్‌ను బాగానే పట్టుకున్నారు. ప్రీ క్లైమాక్స్ కూడా ఉన్నంతలో బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ హైలైట్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక ‘ఈ సినిమాకు సీక్వెల్ కూడానా?’ అన్న ఆలోచనను పక్కనబెడితే, సీక్వెల్‌కు ఇచ్చిన లీడ్ చాలా బాగుంది.

నటన పరంగా చూసుకుంటే రుద్ర తన పాత్రలో బాగా మెప్పించాడు. ఉన్నంతలో అందరిలోకెల్లా అతడి పాత్రకే ఒక సరైన అర్థం ఉండడంతో, ఆ పాత్రలో రుద్ర ఆకట్టుకున్నాడు. సంజయ్ సినిమాకు ప్రధానమైన సన్నివేశాల్లో కనిపిస్తూ ఫర్వాలేదనిపిస్తాడు. కీలక పాత్రల్లో నటించిన చిన్నారులు హార్దికేష్, రుషిత బాగా చేశారు. ఇక పోసాని కృష్ణ మురళీ, రఘు బాబు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ అంటూ చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ‘రాజుగారి గది’ అనే హర్రర్ కామెడీ ఫార్మాట్‌లో సాగిపోయే ఈ సినిమాలో మొత్తమ్మీద కథలో ఉన్న ఒకే ఒక్క ఎలిమెంట్.. క్లైమాక్స్. ఇక ఆ క్లైమాక్స్ వరకూ సినిమాలో ఒక సరైన పద్ధతిలో ఒక్క సన్నివేశమంటూ రాకపోవడం, ఫన్, ఎమోషన్ లాంటివి అస్సలు లేకపోవడం, అర్థం పర్థం లేని పాత్రలు.. అన్నీ కలిపి సినిమాను ఎటు తీసుకుపోతున్నాయో కూడా అర్థం కాదు. సస్పెన్స్ ఎలిమెంట్ చుట్టూ ఒక బలమైన కథంటూ లేకపోవడం, దానికి కనీసం ఫర్వాలేదనిపించేలా కూడా కథనం లేకపోవడం సినిమా పూర్తిగా నిస్సత్తువగా సాగిపోతుంది.

హీరోయిన్ పాత్ర సినిమాలో ఎందుకొస్తుందో అర్థం కాదు. ఇక ఆ పాత్రలో నటించిన వెన్నెల కూడా అందాల ప్రదర్శనలో తప్ప నటన పరంగా చేసిందేమీ లేదు. పాటలు కూడా అసందర్భంగా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వచ్చేస్తుండడం కూడా విసుగు తెప్పిస్తుంది. ఈ సినిమా కథకు, మరీ రెండున్నర గంటలున్న నిడివికి పొంతనే లేదు. లవ్, ఫ్యామిలీ, హర్రర్ ఎలిమెంట్స్ ప్రధానంగా తెరకెక్కిందన్న ప్రచారం పొందిన ఈ సినిమాలో నిజానికి అలాంటి ఎలిమెంట్స్ ఏవీ లేకపోవడం విచిత్రంగా తోస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో బాగా చేశారని చెప్పుకోవాల్సి వస్తే, సినిమాటోగ్రాఫర్ గురించి చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రాఫర్ ఉన్నంతలో సినిమాకు ఒక మూడ్ తేగలిగారు. అసలు ఏమాత్రం బలం లేని సన్నివేశాలను సినిమాటోగ్రాఫర్ పనితనం వల్లే కాస్త అయినా చూడగలం. ఇక సంగీత దర్శకుడు పీ.ఆర్. అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ ఆకట్టుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నాసిరకంగా ఉంది. పాటల్లో ఉన్నంతలో ‘వెన్నెల’ పాట ఫర్వాలేదు. ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

ఇక దర్శక, రచయిత ఎం.వీ.సాగర్ గురించి చెప్పుకుంటే, ఒక్క క్లైమాక్స్‌లో తప్ప దర్శకుడిగా ఆయన ఈ సినిమాతో ఎక్కడా మెప్పించలేదు. ఒక సస్పెన్స్ ఎలిమెంట్ చుట్టూ సాదాసీదా కథను అల్లడం, ఆ కథను చెప్పేందుకు రాసుకున్న స్క్రీన్‌ప్లే కూడా ఎక్కడా బాగోలేకపోవడం, మేకింగ్ పరంగానూ ఎక్కడా కొత్తదనం చూపకపోవడం.. ఇవన్నీ కలిపి చూస్తే, దర్శకుడిగా ఎం.వీ.సాగర్ నిరుత్సాహపరిచాడనే చెప్పుకోవాలి.

తీర్పు :

కొత్త దర్శకుడి సినిమా అనగానే సహజంగానే ఏదో ఒక కొత్తదనం ఆశించడమో, లేదంటే, తెలిసిన విషయాన్నే పద్ధతిగా చెప్పడాన్ని కోరుకోవడమో చేస్తుంటాం. అయితే ‘వీరి వీరి గుమ్మడి పండు’, మొత్తం 63 మంది కొత్తవారిని పరిచయం చేస్తూ కొత్త దర్శకుడు తీసిన అర్థం లేని సినిమా. ఒక్క చిన్న పాయింట్‌తో రెండున్నర గంటల నిడివి గల సినిమా చెప్పాలనుకోవడం, అందులో ఎక్కడా కట్టిపడేసే తరహా సన్నివేశాలు లేకపోవడం, ఒక కథంటూ లేకపోవడం, కథనం కూడా ఎటుపోతుందో తెలీనంత గందరగోళంగా ఉండడం లాంటివన్నీ కలిపి ఈ సినిమాను ఒక నాసిరకం సినిమాగానే మిగిల్చాయి. రెండున్నర గంటల నసను భరించగలిగితే ఇంటర్వెల్, క్లైమాక్స్‌ పార్ట్స్ మాత్రం నచ్చొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘వీరి వీరి గుమ్మడి పండు’ సినిమా ప్రచార చిత్రాల్లోనే చెప్పినట్లు, ఇది ఏ జానర్ సినిమానో అని చూస్తే, ఏదీ కానీ, అన్నీ కలిసిన ఒక కలగాపులగం అనీ, ఎటూ తెలియకుండా వెళ్ళిపోయిన ఒక అర్థం లేని ‘సినిమా’ అని స్పష్టంగా అర్థమవుతుంది!

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW


సంబంధిత సమాచారం :