సమీక్ష : వైఫ్ అఫ్ రామ్ – సందేశంతో కూడిన మర్డర్ మిస్టరీ

సమీక్ష : వైఫ్ అఫ్ రామ్ – సందేశంతో కూడిన మర్డర్ మిస్టరీ

Published on Jul 21, 2018 3:22 PM IST
Lover movie review
  • విడుదల తేదీ : జులై 20, 2018
  • 123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
  • నటీనటులు : మంచు లక్ష్మి , ప్రియదర్శి ,సామ్రాట్ రెడ్డి
  • దర్శకత్వం : విజయ్ యెలకంటి
  • నిర్మాతలు : విశ్వప్రసాద్ టి జి , మంచు లక్ష్మి
  • సంగీతం : రఘు దీక్షిత్
  • సినిమాటోగ్రఫర్ : సామల భాస్కర్
  • ఎడిటర్ : తమ్మిరాజు

 

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు విజయ్ తెరకెక్కించిన చిత్రం ‘వైఫ్ అఫ్ రామ్’. ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈసినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

దీక్ష (మంచు లక్ష్మి) భర్త రామ్ (సామ్రాట్)హత్యకు గురైతాడు. దీక్ష కూడా ఆ సమయంలో అక్కడే ఉంటుంది. గాయాలతో బయటపడిన దీక్ష ఆమె భర్తను ఎవరు హత్యా చేశారో తెలుసుకోవడానికి పోలీస్ లను ఆశ్రయిస్తుంది. అయితే వారిదగ్గర నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆమె స్వయంగా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో ఆమె ఈ మిస్టరీని ఎలా ఛేదించగలిగింది అనేదే మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ట్విస్ట్ ను చెప్పిన తీరు దర్శకుడి ప్రతిభను వెలికితీసింది. కొత్త దర్శకుడైన విజయ్ తడబడకుండా మర్డర్ మిస్టరీ కథతో మంచి మెసేజ్ ను అందించాడు. ప్రధానంగా చివరి 20నిమిషాలు కథను నడిపించిన తీరు అద్భుతమనే చెప్పాలి .

ఇక ప్రధాన పాత్రలో నటించిన మంచు లక్ష్మి చాలా బాగా నటించింది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలోఎలాంటి బెరుకు లేకుండా సునాయాసంగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. అలాగే సపోర్టింగ్ పాత్రలో నటించిన కమెడియన్ ప్రియదర్శి తన నటన తో మెప్పిస్తాడు.

ప్రతి నాయకుడి పాత్రలో ఆదర్శ్ బాలకృష్ణ నటన ప్రేక్షకులను అక్కట్టుకుంటుంది. ఇక రామ్ పాత్రలో నటించిన సామ్రాట్ తెర మీద కనిపించింది కొద్దీ సేపే అయినా సినిమా మీద తన ప్రభావం ఉండే పాత్రలో నటించి మెప్పించాడు.

మైనస్ పాయింట్స్ :

ఊహించని రీతిలో ట్విస్ట్ ను రాసుకున్న దర్శకుడు విజయ్ దాన్నిరివీల్ చేసేముందు చూపించిన సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించవు. ప్రధానంగా సినిమా ఫస్ట్ హాఫ్ లో ఇన్విస్టిగేషన్ పేరుతో వచ్చే సన్నివేశాలు విసిగిస్తాయి. అలాగే నరేషన్ కూడా స్లో గా ఉండడం తో సినిమా బోరింగ్ గా అనిపిస్తుంది. ఇక విరామంలో వచ్చే ట్విస్ట్ కూడా అంత ఆసక్తిగా అనిపించదు. హంతకుడు ఎవరో కనిపెట్టె సన్నివేశాలను ఇంకొంచెం బాగా రాసుకోవాల్సింది.

ఇన్వెస్టిగేషన్ విషయంలో దీక్షకు పెద్దగా సవాళ్లు ఎదురుకాకపోవడంతో ఆ సన్నివేశాలు అంతగా ఆసక్తిని కలిగించవు. ఫస్ట్ హాఫ్ లో ఉత్కంఠకు గురిచేసి సన్నివేశాలు ఒక్కటి కూడా కనిపించవు. సెకండ్ హాఫ్ లాగే ఫస్ట్ హాఫ్ ను ఇంట్రస్టింగ్ పాయింట్స్ తో రాసుకొని ఉంటే ఈ చిత్రం మరో స్థాయిలో ఉండేదే.

సాంకేతిక విభాగం :

దర్శకుడు విజయ్ క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో రాసుకున్న కథకు చాలా వరకు న్యాయం చేశాడు. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ రివీల్ చేసిన తీరు బాగుంది. కాకపోతే ఆయన కాన్సంట్రేషన్ అంత సెకండ్ హాఫ్ మీద పెట్టడంతో ఫస్ట్ హాఫ్ సో సో గా అనిపిస్తుంది. అలాగే ట్విస్ట్ తో కూడుకున్న సన్నివేశాలు ఇంకా కొంచెం బలంగా రాసుకొని ఉంటే బాగుండేది.

ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి ని అందించిన సామల భాస్కర్ అద్భుతమైన పని తీరును కనబర్చారు. తన కెమెరా తో సినిమా కు రిచ్ లుక్ ను తీసుకొచ్చారు. రఘు దీక్షిత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగుంది. మంచు ఎంటరైన్మెంట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీల ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

ఒక మంచి ట్విస్ట్ తో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ ‘వైఫ్ అఫ్ రామ్’ ప్రేక్షకులను అక్కట్టుకోవడం లో చాలా వరకు సఫలమైంది. మంచు లక్ష్మి నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కాగా ఫస్ట్ హాఫ్ మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. చివరగా క్రైమ్ స్టోరీస్ ను ఇష్టపడే వారికీ ఈ చిత్రం బాగా నచ్చుతుంది. మిగితా వారు కూడా ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు.

123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

దీక్ష (మంచు లక్ష్మి) భర్త రామ్ (విరాట్ )హత్యకు గురైతాడు. దీక్ష కూడా ఆ సమయంలో అక్కడే ఉంటుంది. గాయాలతో బయటపడిన దీక్ష ఆమె భర్తను ఎవరు హత్యా చేశారో తెలుసుకోవడానికి పోలీస్ లను ఆశ్రయిస్తుంది. అయితే వారిదగ్గర నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆమె స్వయంగా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో ఆమె ఈ మిస్టరీని ఎలా ఛేదించగలిగింది అనేదే మిగితా కథ. సమీక్ష : వైఫ్ అఫ్ రామ్ - సందేశంతో కూడిన మర్డర్ మిస్టరీ