ఇంటర్వ్యూ : సందీప్ కిషన్ – ‘అల్లరి నరేష్’ సినిమా అని ట్యాగ్ లైన్ పెట్టమన్నాను..

ఇంటర్వ్యూ : సందీప్ కిషన్ – ‘అల్లరి నరేష్’ సినిమా అని ట్యాగ్ లైన్ పెట్టమన్నాను..

Published on Sep 19, 2013 5:00 PM IST

Sundeep-Kishan
‘ప్రస్థానం’ సినిమాలో నెగటివ్ రోల్ చేసి ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ కిషన్ ఆ తర్వాత హీరోగా మారి తన టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఒక వారం గ్యాప్ లో సందీప్ కిషన్ నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు ముచ్చటించాము. ఎంతో ఫ్రాంక్ గా మాట్లాడిన సందీప్ కిషన్ తన చేస్తున్న సినిమాల గురించి, తను ఏయే డైరెక్టర్స్ తో పని చేయాలనుకుంటున్న విషయాలను మాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘మహేష్’ సినిమా ‘యారుడా మహేష్’ కి డబ్బింగ్ వెర్షన్. అసలు మీకు తమిళ్ సినిమాలలో ఆఫర్ ఎలా వచ్చింది?

స) నేను పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోనే, అలాగే నేను గౌతమ్ మీనన్ గారి దగ్గర కొంత కాలం అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. హిందీ ఫిల్మ్ ‘షోర్ ఇన్ ది సిటీ’ చూసి 2011 సమ్మర్ లో నేను తమిళ్ లో 7 అప్ యాడ్ ఒకటి చేశాను. అది చూసిన చాలా మంది నాతో సినిమా చెయ్యాలని అడగడం జరిగింది. కానీ నేనేమో తెలుగు సినిమాలో నెగిటివ్ పాత్రలో ఎంట్రీ ఇచ్చాను. కానీసం తమిళ్ లో అయినా పెద్ద సినిమాతో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాను. అప్పుడే మదన్ కథ వినడానికి రమ్మంటే వెళ్లాను. నేను కథ వింటున్నంత సేపు పడి పడి నవ్వాను. ఆ తర్వాత ఒక రోజు గ్యాప్ తీసుకొని ఈ సినిమా ఓకే చేశాను.

ప్రశ్న) మహేష్ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?

స) ఈ మూవీలో నా పాత్ర పేరు శివ. చాలా పెద్ద సోంబేరి, దద్దమ్మ అలాగే వాడికి పెద్దగా ఏమీ గుర్తుండదు. వాడి పనులు మాత్రం జరిగిపోతే చాలు అనుకునే టైపు. నా పాత్ర గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ’7/జి బృందావన కాలని’ సినిమాలో రవికృష్ణ పాత్రలాంటిది. సినిమా మొత్తం శివ మహేష్ అనే వ్యక్తిని వెతుకుతూ ఉంటాడు. అలా ఎందుకు వెతుకుతున్నాడనేదే కథ. సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. తెలుగులో వస్తుందన్నప్పుడు ఈ సినిమాకి ఉపశీర్షికగా ‘అల్లరి నరేష్ సినిమా’ అని పెట్టమన్నాను. అంటే అర్థం చేసుకోవచ్చు. సినిమాలో ఎంత కామెడీ ఉంటుందో..

ప్రశ్న) మహేష్ భూతు కామెడీ సినిమానా?

స) మహేష్ సినిమాలో భూతు కామెడీ అదే డబుల్ మీనింగ్ డైలాగ్స్ కామెడీ ఉండదు. అమెరికన్ పై తరహాలో ఉంటుంది. సీన్ పరంగా అడల్ట్ కామెడీ అనిపించొచ్చు కానీ డైలాగ్స్ లో మాత్రం అడల్ట్ కామెడీ ఉండదు.

ప్రశ్న) తమిళ్ లో ఈ సినిమా ఒప్పుకున్నప్పుడే, తెలుగులో డబ్ చేస్తారని అనుకున్నారా?

స) నేను ఒప్పుకున్నప్పుడు తెలుగులో డబ్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. కానీ నాకు నేను చేస్తున్న సినిమాలపై నమ్మకం ఉంది. ఇక్కడ హిట్ అవుతుంది ఆ తర్వాత దాన్ని తెలుగులో డబ్ చేస్తారని, అలాగే తెలుగులో హిట్ అయిన సినిమాల్ని తమిళ్ లో రిలీజ్ చేస్తారు. దాంతో నా మార్కెట్ పెరుగుతుందని మాత్రం నమ్మాను.

ప్రశ్న) మరి ఇక్కడ హిట్ అయిన రొటీన్ లవ్ స్టొరీ ని తమిళ్ లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారా?

స) మన తెలుగు ప్రేక్షకులు చాలా మంచి వారండి. ఎందుకంటే మన వాళ్ళు అది ఏ లాంగ్వేజ్ సినిమా అయినా సరే బాగుందంటే చూస్తారు కానీ మిగతా వాళ్ళు అలా కాదు. మన తెలుగు మూవీని అలానే తమిళ్ లో రిలీజ్ చెయ్యలేం అందుకే కొన్ని సీన్స్ రీ షూట్ చెయ్యాలని చెప్పాను. దాని గురించి చర్చలు జరుగుతున్నాయి.

ప్రశ్న) తమిళ్, హిందీ భాషల్లో మళ్ళీ సినిమాలు చేస్తారా?

స) అవకాశాలు వస్తే చేస్తాను. కానీ నా దృష్టి అంతా తెలుగు పైనే.. చెప్పాలంటే తమిళ్, హిందీ అనేది నాకు హోటల్ భోజనం లాంటిది, వెళ్లి నాక్కావలసింది ఆర్డర్ చేసుకొని తినోచ్చేస్తాను. అదే తెలుగు అంటే అమ్మ చేతి ఇంటి భోజనం లాంటిది. కావున ఇక్కడే ఎక్కువగా సినిమాలు చేస్తాను. హిందీలో చేస్తే ప్రయోగాత్మక సినిమాలు చేస్తాను, తెలుగులో అయితే కమర్షియల్ సినిమాలు చేస్తాను. ఈ సంవత్సరంలో తమిళ్, హిందీలో ఏమీ చెయ్యడం లేదు. వచ్చే సంవత్సరం చేస్తాను.

ప్రశ్న) ఒక వారం గ్యాప్ లో మీవి రెండు సినిమాలు వస్తున్నాయి. ఆ విషయంలో ఏమన్నా భయపడుతున్నారా?

స) మొదట్లో కాస్త భయపడ్డాను. కానీ ఆలోచిస్తే జనాలకి సినిమాలు కావాలి బాగుంటే ఆడుతాయి లేదంటే లేదు. ఒకే రోజు వస్తే ఇబ్బంది కాని వారం గ్యాప్ లో వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదటి వారం వచ్చే కలెక్షన్స్ మాత్రమే లెక్క ఆ తర్వాత ఎంత వచ్చినా బోనస్ కింద తీసుకోవాలి.

ప్రశ్న) మీ ‘డీ ఫర్ దోపిడీ’ కి ఏమైంది?

స) ‘డీ ఫర్ దోపిడీ’ ఫస్ట్ కాపీ సిద్దమవుతోంది. ఈ సినిమా ఆలస్యమవడానికి కారణం ఏమిటంటే.. ఆ సినిమాకి నిర్మాతలు ‘రాజ్ & డికె. వాళ్ళు ఇటీవలే సైఫ్ అలీ ఖాన్ తో ‘గో గోవా గాన్’ అనే ఒక సినిమా తీసారు. ఆ సినిమా ఫస్ట్ కాపీ చూసిన సైఫ్ వెంటనే వాళ్ళని పిలిచి వాళ్ళతో ఇంకో సినిమా చెయ్యడానికి డేట్స్ ఇచ్చారు. దాంతో వాళ్ళు కొన్ని రోజులు ఈ సినిమాని పక్కన పెట్టి సైఫ్ తో హిందీ సినిమా చేస్తున్నారు. అది పూర్తికావచ్చింది. దాంతో ఇప్పుడు కాస్త టైం ‘డీ ఫర్ దోపిడీ’ కి ఇచ్చారు. త్వరలోనే రిలీజ్ అవుతుంది.

ప్రశ్న) నెగటివ్ రోల్ తో ఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ నెగటివ్ రోల్స్ వస్తే చేస్తారా?

స) చేస్తానండి. కానీ కాస్త ప్రాముఖ్యత ఉన్న పాత్రలు వస్తే చేస్తాను. ఉదాహరణకి వరుడు సినిమాలో ఆర్య చేసిన లాంటి సబ్జెక్ట్స్ వస్తే చేస్తాను.

ప్రశ్న) యంగ్ హీరోస్ అయిన మీరు, అల్లరి నరేష్, నాని మంచి ఫ్రెండ్స్. మీరంతా కలిసి ఏమన్నా మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారా?

స) ఎప్పుడు కలిసినా మేమంతా కలిసి ఓ సినిమా చెయ్యాలనుకుంటాం. ఇటీవలే నరేష్ కూడా అన్నాడు. అలాంటి సినిమా చెయ్యాలంటే కథ, మా ముగ్గురికి రెమ్యునరేషన్ ఇచ్చే ప్రొడ్యూసర్ ఇలా అన్ని కుదిరితే చేస్తాం. త్వరలోనే అన్నీ కుదిరి ఓ సినిమా చెయ్యాలని కోరుకుంటున్నాను.

ప్రశ్న) అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను అన్నారు. డైరెక్షన్ వైపు ఏమన్నా వచ్చే చాన్స్ ఉందా?

స) అసలు డైరెక్షన్ చేసే సమస్యే లేదు. డైరెక్షన్ అనేది గొప్ప విషయం, దానికి చాలా టాలెంట్ కావాలి. నా దగ్గర అంత టాలెంట్ లేదు. నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. ప్రస్తుతం అదే పని చేస్తున్నాను.

ప్రశ్న) మీకు ఏమన్నా డ్రీం రోల్స్ ఉన్నాయా? అలాగే ఏయే డైరెక్టర్స్ తో పనిచెయ్యాలనుకుంటున్నారు?

స) డ్రీం రోల్స్ అంటే చాలా ఉన్నాయి. తమిళ్లో ధనుష్ చేసిన ‘పుదు పెట్టై’, తెలుగులో ఘర్షణ, ఆర్య, జగడం సినిమాల్లో హీరోస్ చేసిన పాత్రలు చెయ్యాలనుంది. అలాగే డైరెక్టర్స్ అంటే కూడా పెద్ద లిస్టు ఉంది. కచ్చితంగా చెయ్యాలనుకున్న డ్రీం డైరెక్టర్స్ అంటే సుకుమార్, సెల్వ రాఘవన్, గౌతం మీనన్, రాజమౌళి, పూరి జగన్నాథ్, కృష్ణవంశీ గార్లతో పనిచేయాలనుంది.

ప్రశ్న) మీరు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, అలాగే ఇకముందు చేయనున్న సినిమాలేంటి?

స) ప్రస్తుతం ‘రారా కృష్ణయ్య’ సినిమా షూటింగ్ జరుగుతోంది. అలాగే ఆనంది ఆర్ట్స్ లో ఓ సినిమా చేస్తున్నాను. అది నా కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ. ఇంకా సాంగ్స్ షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉన్న ఈ సినిమా వివరాలు త్వరలో అనౌన్స్ చేస్తాము. అవి కాకుండా డీ ఫర్ దోపిడీ రిలీజ్ కి సిద్దమవుతోంది. ప్రస్తుతానికి ఇవన్నీ ఫినిష్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నా అవన్నీ అయ్యాకే కొత్త సినిమాలు మొదలుపెడతాను.

ప్రశ్న) చివరిగా మహేష్ సినిమాలో హైలైట్స్ మరియు ఈ సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలంటారు ?

స) మహేష్ సినిమాలో నా కంటే జగన్ పాత్ర పెద్ద హైలైట్. చెప్పాలంటే సినిమాలో అతనే హీరో. తమిళ్ లో చూసిన చాలా మంది నాకు – జగన్ మధ్య కెమిస్ట్రీ బాగా వచ్చిందని చెప్పారు. అలాగే ఆడియన్స్ సినిమా ఎందుకు చూడాలంటే రెండుగంటల పాటు హాయిగా నవ్వుకోవాలంటే ఈ సినిమా చూడండి.

అంతటితో సందీప్ కిషన్ కి అల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం. ఒక వారం గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని ఎంటర్టైన్ చెయ్యడానికి సిద్దమవుతున్న సందీప్ కిషన్ కి ఈ రెండు సినిమాలు విజయం సాధించి మంచి పేరు రావాలని ఆశిద్దాం..

రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు