తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన నైజాం ఎగ్జిబిటర్ల పర్సంటేజీ వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో సమస్య ఒక కొలిక్కి వచ్చింది. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలు, నిర్ణయాలను చిరంజీవికి వివరించగా.. ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ ఇచ్చే నివేదికకు అనుగుణంగానే ముందుకు నడుచుకోవాలని ఆయన ఎగ్జిబిటర్లకు కీలక సూచన చేశారు.
ఈ చర్చల అనంతరం ఎగ్జిబిటర్ల అసోసియేషన్ పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. ప్రస్తుతం పెద్ద సినిమాలను పాత పద్ధతి అయిన ‘రెంటల్ విధానం’లోనే థియేటర్లలో ప్రదర్శించాలని నిర్ణయించారు. అయితే, ఒకవేళ సినిమాకు ప్రభుత్వం నుంచి అదనంగా టికెట్ రేట్లు పెంచుకునే అనుమతి లభిస్తే మాత్రం.. థియేటర్ రెంట్‌తో పాటు అదనంగా 7.5 శాతం మొత్తాన్ని ఎగ్జిబిటర్లకి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక పరిశ్రమలో కొత్త మార్పుల కోసం జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలను మాత్రం ‘పర్సంటేజీ విధానం’లోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. చిరంజీవి చొరవతో ఇటు నిర్మాతలు, అటు ఎగ్జిబిటర్ల మధ్య తలెత్తిన పెద్ద వివాదం ప్రస్తుతానికి సద్దుమణగడం తో టాలీవుడ్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. దీంతో ‘పెద్ది’ చిత్రానికి ఊరట లభించిందని చెప్పాలి.



