ఇంటర్వ్యూ : అనుష్క – ‘రుద్రమదేవి’.. కథా బలమున్న సినిమా!

ఇంటర్వ్యూ : అనుష్క – ‘రుద్రమదేవి’.. కథా బలమున్న సినిమా!

Published on Oct 5, 2015 9:55 PM IST

Anushka
గుణ శేఖర్ కలల ప్రాజెక్ట్ అయిన ‘రుద్రమదేవి’ సినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 9న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. అనుష్క టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో రానా, అల్లు అర్జున్, నిత్యా మీనన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో తనదైన బ్రాండ్‌తో గ్లామర్ పాత్రలు చేస్తూనే, లేడీ ఓరియంటడ్ సినిమాల్లోనూ మెప్పిస్తూ వస్తోన్న అనుష్కతో ‘రుద్రమదేవి’ రిలీజ్ సందర్భంగా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘రుద్రమదేవి’.. రిలీజ్ అవ్వడానికి చాలా కాలం తీసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ వారం విడుదలవబోతోంది. ఎలా ఉంది?

స) చాలా సంతోషంగా ఉందండీ. సినిమా అనేది ఎంతోమంది కష్టపడితే వచ్చే ఒక కళ. మేమేం చేసినా అది చివరకు ప్రేక్షకులకు నచ్చడమే ప్రధానం. సో.. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు మా బాధ్యత అయిపోయింది. సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే విషయమై ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నేను కూడా ఇంకా సినిమా చూడలేదు కాబట్టి అందరిలాగే నేనూ సినిమా కోసం చూస్తున్నా.

ప్రశ్న) రిలీజ్ ఆలస్యం అవుతోందీ అన్నప్పుడు ఎలా ఫీలయ్యేవారు?

స) ఇక్కడ నేను ఫీల్ అవ్వడానికి ఏమీ ఉండదండీ. ఒక డైరెక్టర్ విజన్‌తో సినిమా పుడుతుంది. అది చివరకు ప్రేక్షకుడికి ఎలా కనిపించాలన్నది డిసైడ్ చేసేది డైరెక్టరే! ఆ క్రమంలో డైరెక్టర్స్ తమ బెస్ట్ ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. రుద్రమదేవి సినిమా గుణశేఖర్ గారి కల. ఆయనకు ఫైనల్ ఔట్‌పుట్ నచ్చడమనేదే ఇక్కడ ప్రధాన విషయం. షూటింగ్ అయ్యాక తాను కోరిన ఔట్‌పుట్ రావడానికి ఆయన ఇంతకాలం కష్టపడ్డారు. ఈ సమయంలో మేం ఫీలవ్వడం అంటూ ఏమీ ఉండదు.

ప్రశ్న) ‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’.. ఇలా చారిత్రక నేపథ్యంలో నడిచే బలమైన పాత్రలతో మెప్పిస్తూ వస్తున్నారు. ఈ అవకాశాలన్నీ మీకే రావడానికి కారణం ఏమనుకుంటున్నారు?

స) అది నా అదృష్టమండీ. ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలన్నీ చేసే అవకాశం వస్తుందంటే ఎక్కడో అదృష్టం ఉండి ఉండాలి కదా! ఇవన్నీ ఒకే తరహాలో కనిపిస్తున్న వేర్వేరు ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్స్. విజన్ ఉన్న దర్శకులైన రాజమౌళి, గుణశేఖర్ లాంటి వ్యక్తులతో పనిచేయడంతో నాకూ ఇలాంటి పాత్రలు చేయడం ఎగ్జైటింగ్‌గా కనిపిస్తూ వచ్చింది.

ప్రశ్న) రాణీ రుద్రమదేవి అన్న బలమైన చారిత్రక నేపథ్యం ఉన్న పాత్ర చేసే అవకాశం రాగానే ఎలా ఫీలయ్యారు?

స) గుణశేఖర్ గారు నాకీ కథ చెప్పినపుడు నేనిది అందంగా అల్లిన కల్పిత కథ అనుకున్నా. కానీ రుద్రమదేవి జీవిత కథ అని తెలిసినపుడు, ఒక వ్యక్తి జీవితంలో ఇంత బలమైన భావోద్వేగం, బాధ ఉందా అనిపించింది. మరింకేం మాట్లాడకుండా ఒప్పేసుకున్నా. చెప్పాలంటే నేను చేసిన ఇతర చారిత్రక నేపథ్యాలున్న సినిమాలన్నీ కల్పితాలే! రుద్రమదేవి మాత్రం ఒక నిజమైన చారిత్రక కథ. ఆ రకంగా ఈ సినిమా నాకు ప్రత్యేకమైనదనే చెప్పాలి.

ప్రశ్న) ఈ సినిమా ఒప్పుకున్నాక రుద్రమదేవి గురించి పరిశోధన చేశారా?

స) నేను స్వతహాగా చేసిన పరిశోధన ఏమీ లేదు. గుణశేఖర్ గారు ఈ సినిమా కోసం చాలాకాలం పాటు పరిశోధన చేశారు. నేను రుద్రమదేవి గురించి తెలుసుకున్న విషయాలన్నీ ఆయన దగ్గర్నుంచే! నిజానికి రుద్రమదేవి చరిత్ర ఎక్కడా పూర్తిగా లేదు. గుణశేఖర్ తన టీమ్‌తో కలిసి ఎంతో కష్టపడి ఈ కథను తయారు చేశారు. గుణ శేఖర్ గారి విజన్‌ను ఫాలో అయిపోవడమే నేను చేసింది.

ప్రశ్న) రుద్రమదేవి వంటి బలమైన పాత్ర చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఆందోళన చెందారా?

స) లేదండీ. గుణ శేఖర్ గారు అన్ని విధాలా మంచి సపోర్ట్ ఇస్తూ నేను ఈ పాత్రను సులువుగా చేయగలిగేలా చేశారు. ఇక ఈ కథ జరిగి ఇన్ని వందల సంవత్సరాలైనా మనం ఇంకా గుర్తుంచుకున్నామంటే.. అది వాళ్ళ గొప్పదనమే! ఇక మావరకు మేము చరిత్రను అందంగా, వీలైనంత స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశాం. వాళ్ళ గొప్పదనాన్ని సినిమా ద్వారా అందరికీ పరిచయం చేయడం మా అదృష్టమనే భావిస్తా.

ప్రశ్న) దర్శకుడు గుణ శేఖర్‌తో పనిచేయడం ఎలా అనిపించింది?

స) గుణ శేఖర్ గారు పర్ఫెక్షనిస్ట్. సినిమాలో తనకు ఏమేం కావాలన్న విషయంపై ఆయనకు సరైన క్లారిటీ ఉంది. కథ కోసం ఎంత కష్టపడ్డారో దాన్ని సినిమాగా మలచడానికీ ఆయన అదే స్థాయిలో కష్టపడ్డారు. ఈ సినిమా మొదలైనప్పట్నుంచీ ఆయన సినిమాయే ప్రధాన ఆలోచనగా చేసుకుంటూ వచ్చారు.

ప్రశ్న) అల్లు అర్జున్, రానా, నిత్యా మీనన్.. ఇలా మిగతా స్టార్స్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

స) అల్లు అర్జున్ వేదం సినిమా అప్పట్నుంచే నాకు బాగా తెలుసు. ఈ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర ఎవరు చేస్తారా? అనేది ముందునుంచీ సస్పెన్సే! గోన గన్నారెడ్డి ఎవరవుతారో అనుకుంటూ ఉండేవాళ్ళం. చివరకు అల్లు అర్జున్ ఆ పాత్ర చేశారు. అల్లు అర్జున్ ఈ క్యారెక్టర్‌కు సరిగ్గా సరిపోయారు. బాహుబలికి భిన్నంగా ఇందులో నాది, రానాల కాంబినేషన్ ఉండనుంది. నిత్యా మీనన్, క్యాథరిన్, ప్రకాష్ రాజ్ గారు, కృష్ణం రాజు గారు ఇలా యాక్టర్స్ అందరం సినిమాను బాగా ఎంజాయ్ చేస్తూ చేశాం.

ప్రశ్న) మరో ఐదు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతోంది. సినిమాకు మేజర్ హైలైట్ అంటే ఏం చెబుతారు?

స) నన్నడిగితే కథే ఈ సినిమాకు మేజర్ హైలైట్. ఇది మన కథ. మన చరిత్రను సినిమా ద్వారా తెలుసుకునే అవకాశాన్ని ఈ సినిమా కల్పిస్తోంది. ఈ కథలో బలమైన ఎమోషన్ ఉంది. భారీ సెట్టింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ వీటన్నింటికన్నా ఈ సినిమాకు కథే ప్రధాన బలమని చెప్తా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు