‘ఇజం’, ‘కబాలి’కి ఉన్న ఆ పోలిక ఏంటి..!?
Published on Oct 20, 2016 3:35 pm IST

ism-kabali
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇజం’ అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని రేపు భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉండగా, సినిమా ఎలా ఉంటుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రమోషన్స్‌తో అంచనాలను మరింత పెంచేసిన టీమ్, ఇప్పటికీ ట్రైలర్‌ను మాత్రం విడుదల చేయడం జరగలేదు.

సాధారణంగా ఏ తెలుగు సినిమాకైనా ఆడియోతో పాటే ట్రైలర్ రిలీజ్ ఉంటుంది. ఇజంకి మాత్రం పూరీ టీమ్ మొదట్లో విడుదల చేసిన టీజర్ తప్ప ట్రైలర్ ఏదీ విడుదల చేయలేదు. ఇక ఈమధ్య కాలంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘కబాలి’కి కూడా ఇలాగే టీజర్ తప్ప ట్రైలర్ విడుదలవ్వలేదు. ఈ రెండు సినిమాలూ టీజర్‌తోనే అంచనాలను తారాస్థాయికి చేర్చుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ట్రైలర్ విడుదల చేయకుండా పూరీ దాచిపెట్టినది సినిమాలో ఏముందో రేపు తెలుసుకోవాల్సిందే!

 
Like us on Facebook