సమీక్ష : ఆటగాళ్లు – ఆసక్తి పెంచని మర్డర్ మిస్టరీ

Published on Aug 25, 2018 11:47 am IST
 Aatagallu movie review

విడుదల తేదీ : ఆగష్టు 24, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : నారా రోహిత్,జగపతిబాబు, దర్శన బానిక్ తదితరులు

దర్శకత్వం : పరుచూరి మురళి

నిర్మాతలు : వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర

సంగీతం : సాయి కార్తిక్

స్క్రీన్ ప్లే : పరుచూరి మురళి

ఎడిటర్ : మార్తండ్ కె వెంకటేష్

వైవిధ్యమైన పాత్రలతో సినిమాలతో ప్రేక్షకులను అలరించే హీరో నారా రోహిత్. ఆయన తాజాగా జగపతిబాబుతో కలిసి నటించిన చిత్రం ‘ఆటగాళ్ళు’. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ:
సిద్దార్థ (నారా రోహిత్) టాలీవుడ్ లో క్రియేటివ్ అండ్ టాప్ డైరెక్టర్. మిడిల్ క్లాస్ అమ్మాయి అయిన అంజలి (దర్శన బానిక్)ని సిన్సియర్ గా ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. వారి దాంపత్యజీవితం మూడు సంవత్సరాలు హ్యాపీగా సాగిపోయిన తర్వాత అంజలి హత్యకు గురవుతుంది. ఆ హత్య చేసింది సిద్దార్థ్ అని పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తారు.

కాగా అంజలి హత్య కేసును వాదించడానికి ఎంటర్ అవుతాడు, ద గ్రేట్ క్రిమినల్ లాయర్ వీరేంద్ర (జగపతిబాబు). కేసు వాదనలో సాక్ష్యాలన్ని అంజలిని సిద్దార్థనే హత్య చేసినట్లు తేలుతుంది. కానీ ప్రాణంగా ప్రేమించిన సిద్దార్థ అంజలిని హత్య చేసి ఉండదని అని నమ్మిన వీరేంద్ర సిద్దార్థను ఆ కేసు నుండి బయట పడేస్తాడు. ఆ తర్వాతే సిద్దార్ధ గురించి వీరేంద్రకు ఊహించని నిజాలు తెలుస్తాయి. దాంతో ఇద్దరి మధ్య గేమ్ స్టార్ట్ అవుతుంది. అసలు సిద్దార్థ్ అంజలిని హత్య చేశాడా ? లేదా ? చేస్తే ఏ కారణంగా చేశాడు ? వీరేంద్ర ఈ కేసుని ఏ విధంగా ఛేదిస్తాడు ? చివరకి అంజలిని చంపిన హంతకుడికి శిక్ష పడుతుందా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ‘ఆటగాళ్ళు’ చిత్రం చూడాలసిందే.

ప్లస్ పాయింట్స్ :

ఓ క్రియేటివ్ సినిమా డైరెక్టర్ గా నటించిన నారా రోహిత్ ఎప్పటిలాగే ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ హీరోగా ఉన్న ఆయన ఇలాంటి పాత్రను ఒప్పుకోవటం సాహసం అనే చెప్పాలి. ఇక నటన విషయానికి వస్తే క్రియేటివ్ డైరెక్టర్ సిద్దార్ధ పాత్రలో ఆయన చక్కగా నటించారు. సందర్భానుసారంగా తన పాత్రలోని డిఫరెంట్ షేడ్స్ చూపిస్తూ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

ఓ సిన్సియర్ అండ్ పవర్ ఫుల్ లాయర్ గా నటించిన జగపతిబాబు తన నటనతో ఆకట్టుకుంటారు. న్యాయం కోసం ఎంతటి దూరమైనా వెళ్లే ఓ సీరియస్ క్యారెక్టర్ ను పోషించిన ఆయన, హీరోకి పోటీగా మైండ్ గేమ్ ప్లే చేసే క్రిమినల్ లాయర్ గా ఆయన నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.

మిడిల్ క్లాస్ అమ్మాయిగా సిద్దార్ధను గాఢంగా ప్రేమించే అంజలిగా నటించిన దర్శన బానిక్ చాలా చక్కగా నటించింది. ప్రధానంగా ఆమె హాత్యకు గురై భావోద్వేగ సన్నివేశంలో ఆమె పలికించిన హావాభావాలు, ఆమె నటన ఆకట్టుకున్నే విధంగా ఉంటుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

మైనస్ పాయింట్స్:

దర్శకుడు పరుచూరి మురళి మంచి స్టోరీ థీమ్ తీసుకున్నప్పటికీ స్లో నేరేషన్ తో, కన్వీన్స్ కానీ ట్రీట్మెంట్ తో సినిమాను ఆసక్తికరంగా మలచలేకపోయారు. ముఖ్యంగా కథ కథనం ఉండాల్సిన స్థాయిలో ఉండవు. సినిమా నిండా అవసరం లేని సన్నివేశాలే ఎక్కువైపోయాయి.

మంచి ఎమోషనల్‌ సన్నివేశంతో, ఆసక్తిని పెంచే పాయింట్ తో సినిమాని ప్రారంభించారు. ఆ తర్వాత సినిమా చాలా బోర్ గా సాగుతుంది. సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రస్ట్ పుట్టించే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు ఆ పాయింట్ ను వదిలేసి అనవసరమైన కామెడీ ట్రాక్ లతో పండని సప్సెన్స్ సీన్స్ తో సినిమాని నింపేశాడు.

సినిమా నిండా కాన్ ఫ్లిట్ ఉన్నట్లే అనిపిస్తోంది. కానీ ఎక్కడా అది సరిగ్గా ఎలివేట్ అవ్వదు. దీనికి తోడు బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి, అవి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయో దర్శకుడికే అర్ధం కానీ విధంగా తెరకెక్కించినట్లు అనిపిస్తోంది. ఏమైనా సినిమా మీద ఇంట్రస్ట్ కలగకుండా చేశారు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు పరుచూరి మురళి మంచి స్టోరీ ఐడియా తీసుకున్నా దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. ఆయన రాసిన స్క్రీన్ ప్లే పండకపోగా విసిగిస్తోంది.

సంగీత దర్శకుడు సాయి కార్తిక్ అందించిన పాటల సంగీతం పర్వాలేదనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో అక్కట్టుకున్నేలా ఉంది. సీనియర్ ఎడిటర్ మార్తండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఆయన స్థాయికి తగినట్లు లేదు.

నిర్మాతలు వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే నారా రోహిత్ మళ్లీ అలాంటి పాత్రతోనే ప్రేక్షకుల ముదుకు వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం నిరాశ పరిచారు. దర్శకుడు రాసుకున్న స్క్రిప్ట్ ఆసక్తికరంగా సాగకపోగా, సాగతీత సన్నివేశాలతో కన్విన్స్ కానీ ట్రీట్మెంట్ తో విసుగు తెప్పిస్తుంది. పైగా సినిమాలో బ్రహ్మానందంతో పండించాలనుకున్న కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడ పాతకాలపు వాసనలు కొడతాయి. మొత్తం మీద ఈ ‘ఆటగాళ్లు’ చిత్రం ఎంటర్టైన్మెంట్ ను ఆశించే ప్రేక్షకులతో పాటు ఓ డిఫరెంట్ జోనర్ లో సినిమాను చూద్దామకొన్నే ప్రేక్షకులను కూడా నిరుత్సాహ పరుస్తోంది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :