సంక్రాంతి సినిమాలన్నీ ఫిక్స్ అయిపోయాయ్!

khaidi-gpsk-shatamanm
తెలుగు సినీ పరిశ్రమలో అతిపెద్ద సీజన్ ఏదీ అంటే సంక్రాంతి అనే చెప్పుకోవాలి. ఆ సీజన్‌లో తమ సినిమా వస్తే పండగే అని ప్రతి హీరో అభిమాని కోరుకుంటూ ఉంటారు. తాజాగా ఈ ఏడాది సంక్రాంతికి రెండు ప్రతిష్టాత్మక సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ చేస్తోన్న ‘ఖైదీ నెం 150’ కాగా, మరొకటి నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ రెండు సినిమాలూ ఇప్పటికే భారీ అంచనాలను మూటగట్టుకొని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాల్లో గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల తేదీని జనవరి 12గా ఎప్పుడో నిర్ణయించేశారు.

ఖైదీ నెం. 150 కోసం జనవరి 11, 12 రెండు తేదీలనూ పరిశీలిస్తూ వచ్చిన ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ తాజాగా 11వ తేదీని ఫిక్స్ చేసేశారు. అదేవిధంగా శర్వానంద్ హీరోగా నటించగా, దిల్‌రాజు నిర్మించిన శతమానం భవతి కూడా సంక్రాంతికే రానున్నట్లు ఎప్పుడో ప్రకటించగా, ఈమధ్యే 14వ తేదీకి పక్కాగా ఫిక్స్ అయింది. ఈ మూడు సినిమాలతో పాటు విప్లవ కథానాయకుడు ఆర్.నారాయణమూర్తి నటించిన హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య కూడా సంక్రాంతి సీజన్‌కు జనవరి 13వ తేదీన వస్తోంది. మొత్తానికి ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు సందడి చేయనుండగా, ఆ నాలుగు సినిమాలూ వేటికవే విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి.