మే 15న ‘ఆంధ్రాపోరి’ రిలీజ్..!

మే 15న ‘ఆంధ్రాపోరి’ రిలీజ్..!

Published on Apr 2, 2015 3:31 PM IST

Andhra-pori-team
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్‌ పూర్తి స్థాయి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆంధ్రాపోరి’. ప్రతిష్టాత్మక ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించబడ్డ ఈ సినిమాకు ‘ఋషి’ సినిమా ఫేం రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించారు. ఉల్కా గుప్తా హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నేడు (ఏప్రిల్ 2) మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా నిర్మాత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. 50 ఏళ్ళ చరిత్ర కలిగిన ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వస్తోన్న చిత్రం ‘ఆంధ్రాపోరి’ అని, కేవలం 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు. ఇది చిన్నసినిమా కాదని, ప్రేక్షకులు ఆదరిస్తే పెద్ద సినిమా అవుతుందని ఆయన అన్నారు.

దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ.. మరాఠీలో విజయవంతమైన ‘టైమ్‌పాస్’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిందని అన్నారు. పూరీ ఆకాష్ నర్సింగ్ పాత్రకు సరిగ్గా సరిపోయాడని తెలిపారు. టీమ్ మొత్తం తమ శక్తిమేర ప్రయత్నించారనీ, ఆ శ్రమను తెరపై చూస్తారని ఆయన అన్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈనెల 25న ఆడియోను, మే 15న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

హీరో పూరీ ఆకాష్ మాట్లాడుతూ.. ఇప్పుడప్పుడే హీరో అవ్వాలనుకోలేదని, ఈ కథ నాకు సరిగ్గా సరిపోతుందన్నాకే ఈ సినిమా చేశానని చెప్పారు. ఈ సినిమాలో ‘నిజామాబాద్ నర్సింగ్’ అనే పాత్ర చేశానని, ఆ పాత్ర కోసం తెలంగాణ యాసను నేర్చుకొని మాట్లాడానని తెలిపారు. హీరో అంటే ఒక బాధ్యత అన్న విషయం ఈ సినిమా ద్వారా అర్థమైందని తెలిపారు.

ఇదే సమావేశంలో సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్, సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ వనమాలి, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్, కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు