బర్త్ డే ఇంటర్వ్యూ : సిద్దార్ధ్ వర్మ – ‘3జి లవ్’ నిర్మాత ప్రతాప్ కోలగట్ల నా గాడ్ ఫాదర్
Published on Jan 25, 2015 11:11 am IST

Siddarth_Varma
ప్రతిభకు తెలుగు చిత్ర పరిశ్రమలో తగిన గుర్తింపు లభిస్తుంది అనడానికి తాజా ఉదాహరణ యువహీరో సిద్దార్ధ్ వర్మ. ఎటువంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా 2013లో విడుదలైన ‘3జి లవ్’ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన సిద్దార్ధ్ వర్మ, అతి తక్కువ సమయంలో అగ్ర నిర్మాణ సంస్థలు, దర్శకుల సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుని తన ప్రతిభను నిరూపించుకున్నాడు. జనవరి 26న తన పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ యువహీరో పాత్రికేయులతో సమావేశం అయ్యారు. తన కెరీర్, అప్ కమింగ్ సినిమాల గురించి ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) మీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పండి..?

స) బేసిగ్గా మాది వైజాగ్. చిన్నప్పటి నుండి సినిమాలంటే ఆసక్తి. ఎటువంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేదు. భీమవరం, డి.యెన్.ఆర్. కాలేజీలో బి.ఎస్సీ చదువుతున్న సమయంలో ‘3జి లవ్’ ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి హాజరయ్యాను. నిర్మాత ప్రతాప్ కోలగట్ల నన్ను సెలెక్ట్ చేశారు. ఆ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కొత్త నటీనటులలో నేను ఒకడిని. నా ఇష్టాన్ని అర్ధం చేసుకున్న తల్లిదండులు, ఇతర కుటుంబ సభ్యులు బాగా ప్రోత్సహించారు. మొదట నన్ను నేను నిరూపించు కోవడానికి ఒక ఏడాది గడువు విధించారు. ‘3జి లవ్’ సక్సెస్ కావడంతో వారు కూడా హ్యాపీ.

ప్రశ్న) నటనలో ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా..?

స) లేదండి. ‘3జి లవ్’లో సెలెక్ట్ అయిన తర్వాత వారు కొన్ని రోజులు శిక్షణ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత ‘సాంబ’ రచయిత డి.ఎస్.రావు దర్శకుడిగా పరిచయమైన ‘నేను నా ఫ్రెండ్స్’ సినిమాలో అవకాశం లభించింది. ఒక గురువులా డి.ఎస్.రావు గారు చాలా విషయాలు నేర్పించారు. సినిమా పరిశ్రమలో నాకు ‘3జి లవ్’ నిర్మాత ప్రతాప్ కోలగట్ల గాడ్ ఫాదర్ అయితే, డి.ఎస్.రావు గురువుగా భావిస్తాను.

ప్రశ్న) ప్రస్తుతం ఏయే సినిమాలలో నటిస్తున్నారు..?

స) ఉషా కిరణ్ మూవీస్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దాగుడుమూత దండాకోర్’ సినిమాలో నటించాను. ఈ నెలలో ఆడియో, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ వంటి గొప్ప నటుడితో కలిసి పని చేయడం మధురమైన అనుభూతి. కోడి పుంజు ఈ సినిమాలో ఓ ప్రముఖ పాత్రలో నటించడం ప్రత్యేకత. బిఏ జయ గారు దర్శకత్వం వహించోయే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా చేస్తున్నాను.

ప్రశ్న) ‘దాగుడుమూత దండాకోర్’ సినిమా అవకాశం ఎలా లభించింది..?

స) ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ అయ్యాను. రెండు ప్రతిష్టాత్మక సంస్థలు నిర్మించే సినిమా కావడంతో ఆడిషన్స్ కు చాలా మంది హాజరయ్యారు. ఒక రోజంతా వివిధ సన్నివేశాలలో నటించి చూపించమన్నారు. అవి క్రిష్ గారికి నచ్చడంతో హెవీ కాంపిటీషన్లో నన్ను సెలెక్ట్ చేశారు. అలా ‘దాగుడుమూత దండాకోర్’లో అవకాశం లభించింది. పశ్చిమ గోదావరిలో 28 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరిగితే, 20 రోజులు క్రిష్ ఉన్నారు. నటనలో కొన్ని మెళకువలు అందించారు. దర్శకుడు రాధాకృష్ణ మలినేని గారు కూడా బాగా ప్రోత్సహించారు.

ప్రశ్న) నటుడిగా మీ ఇన్స్పిరేషన్ ఎవరు..?

స) ప్రతి ఒక్కరూ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరో వరకు అందరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను.

ప్రశ్న) నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి..?

స) ‘దాగుడుమూత దండాకోర్’, బిఏ జయ గారి సినిమాల విడుదల పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. మంచి కథలు రావాలి, దర్శకులు నన్ను ఇలాగే ప్రోత్సహించాలి అని కోరుకుంటున్నాను. అంతే తప్ప పెద్దగా ప్లాన్స్ ఏమి లేవు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook