సమీక్ష : బుర్రకథ – ఆకట్టుకోలేకపోయిన ‘బుర్రకథ’ !

Published on Jul 6, 2019 2:59 am IST
Burra Katha movie review

విడుదల తేదీ : జూలై 05, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : ‘ఆది’ హీరోగా మిస్తీ చక్రబోర్తి , నైరా షా త‌దిత‌రులు.

దర్శకత్వం :  డైమండ్ రత్నబాబు

నిర్మాత : హెచ్‌ కె.శ్రీకాంత్ దీపాల

సంగీతం : సాయి కార్తీక్

సినిమాటోగ్రఫర్ : రామ్ ప్రసాద్

ఎడిటర్ : ఎం ఆర్ వర్మ

రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ‘ఆది’ హీరోగా ‘మిస్తీ చక్రబోర్తి , నైరా షా’ హీరోయిన్స్ గా ఓ విభిన్న కథాంశంతో వచ్చిన మూవీ “బుర్ర కథ”. కాగా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

అభి రామ్ (ఆది) రెండు మెద‌ళ్ల‌తో పుడతాడు. అతను పెరిగే క్రమంలో అతని శరీరంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తెలుస్తోంది. అలా ‘అభిరామ్’ కాస్త అభిగా మరియు రామ్ గా చివరికి ఇద్దరు వ్యక్తిలుగా పిలువబడతాడు. అయితే చిన్నప్పటి నుండీ ఆ ఇద్దరూ ఆలోచనలు వేరు, గోల్స్ వేరు, లైఫ్ స్టైల్స్ వేరు.. దాంతో ఒకరి కారణంగా ఒకరు జీవితంలో తమ గోల్స్ ను చివరికీ తమ కెరీర్ ను పోగొట్టుకుంటారు. దాంతో ఒకరు అంటే ఒకరికి పడదు. ఆ తరువాత వారి జీవితంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఇద్దరూ వేరు వేరుగా కాకుండా ఒకేలా ఎలా ఆలోచించారు ? అలా ఆలోచించడానికి వారిద్దరూ ప్రేమించిన ఒకే అమ్మాయి ‘హ్యాపీ’ (మిస్తీ చక్రబోర్తి) ఎలా కారణమైంది ? ఇంతకీ అభి మరియు రామ్ చివరికీ అభిరామ్ గా ఒక్కటయ్యారా ? లేదా ? ఈ క్రమంలో వారికి ఎలాంటి సమస్యలు వచ్చాయి ? ఇద్దరూ ఎలాంటి మానసిక సంఘర్షణ అనుభవించారు ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర ఈ సినిమాని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

రెండు మెద‌ళ్ల‌తో పుట్టిన హీరో.. ఆ మెద‌ళ్ల‌ కారణంగా తనలో తానే ఎన్ని ఇబ్బందులు పడ్డాడు.. జీవితంలో ఎలాంటి క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడ‌నే కాన్సెప్ట్‌ తో వచ్చిన ఈ సినిమా కాన్సెప్ట్‌ పరంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కోసం ఆది పెట్టిన ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా అభిగా.. అలాగే అభికి పూర్తి విరుద్ధంగా ఉండే రామ్ గా రెండు పాత్రల్లోనూ ‘ఆది’ చక్కని నటనను కనబరిచాడు. గత సినిమాల్లో కంటే, ఈ సినిమాలో ఆది నటన ఆకట్టుకుంటుంది. మెయిన్ గా సినిమాలో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ప్రీ క్లైమాక్స్ లో ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తోనూ ఆది తన పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు.

ఇక ఈ సినిమాలో కథానాయకిగా నటించిన మిస్తీ చక్రబోర్తి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ మెప్పిస్తోంది. అలాగే మరో హీరోయిన్ నైరా షాకు పెద్దగా స్క్రీన్ టైం లేకపోయినా.. ఉన్నంతలో తన గ్లామర్ తో మెప్పిస్తోంది. సినిమాలో ‘ఆది’ తండ్రిగా నటించిన రాజేంద్రప్రసాద్ తన నటనతో పాటు ఆయన చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇక కీలక పాత్రల్లో నటించిన పోసాని, చంద్ర, పృథ్వి తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఓ వ్యక్తిలో ఇద్దరు.. ఆ ఇద్దరూ వేరే వేరుగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనల ప్రభావంతో ఒకరి కారణంగా ఒకరు తమ గోల్స్ ను చివరికీ తమ కెరీర్ ను పోగొట్టుకుంటారు. దాంతో ఒకరు అంటే ఒకరికి పడదు. సినిమా మొత్తంగా ఇదే ప్రధానమైన సంఘర్షణ. కానీ ప్రీ క్లైమాక్స్ లో గాని ఇది కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ కాదు. దర్శకుడు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను కనీస స్థాయిలో కూడా ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో చాల సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి.

పైగా కథకు అవసరానికి మించి కామెడీ అండ్ మసాలా సన్నివేశాలు ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలకు అయితే అసలు సరైన ప్లో కూడా ఉండదు. పైగా సెకండాఫ్ బాగా ల్యాగ్ అయింది. ఇక కథకు సంబంధించిన సీన్స్ కూడా ఏ సీన్ కి ఆ సీన్ సాగుతునప్పటికీ.. ఓవరాల్ గా కథనం మాత్రం ముందుకు నడిపించవు. పైగా కొన్ని కామెడీ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం సినిమాకి మరో పెద్ద మైనస్ పాయింట్.

మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద కరెక్ట్ గా ఎలివేట్ చేయలేకపోయారు. కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం కథకు అవసరం లేని కామెడీ సీక్వెన్స్ తో.. అసందర్భంగా వచ్చే రొమాంటిక్ సాంగ్స్ తో సినిమాని నడిపించడంతో సినిమా ఆకట్టుకోదు.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు రత్నబాబు మంచి స్టోరీ పాయింట్ తీసుకున్నా ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అందించిన సంగీతం కూడా బాగాలేదు. ఎం ఆర్ వర్మ ఎడిటింగ్ కూడా ఆకట్టుకోదు. సెకండాఫ్ ను ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ మాత్రం ఆకట్టుకున్నేలా ఉంది. కొన్ని సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా అందంగా చూపించారు. ఇక నిర్మాత హెచ్‌ కె.శ్రీకాంత్ దీపాల పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు :

 

డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ‘ఆది’ హీరోగా ‘మిస్తీ చక్రబోర్తి , నైరా షా’ హీరోయిన్స్ గా వచ్చిన ఈ చిత్రం ఆసక్తికరంగా సాగలేదు. కాకపోతే సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. అయితే దర్శకుడు రత్నబాబు రాసుకున్న కథా కథనాల్లో సరైన ప్లో లేకపోవడం, సినిమాలో కథకు అనవసరమైన పండని కామెడీ సీన్స్ ఎక్కువుగా ఉండటం.. అన్నిటికి మించి స్టోరీ పాయింట్ కి తగ్గట్లు సినిమా ఆసక్తికరంగా సాగకపోగా, స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

 

Click Here For English Review

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం :