చిట్‌చాట్ : చరణ్‌దీప్ – ఈ ఏడాది రెండు వంద కోట్ల సినిమాల్లో నటించా!

Charan
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జిల్లా’ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటుడు చరణ్‌దీప్. తెలుగులో ‘పటాస్’, ‘వినవయ్యా రామయ్యా’ సినిమాలతో మెప్పించిన చరణ్, విడుదలకు సిద్ధమైన ‘బాహుబలి’, ‘పులి’ (తమిళం) లాంటి రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు, కెరీర్ గురించి తన పుట్టిన రోజు సందర్భంగా చరణ్ పంచుకున్న విశేషాలు..

ప్రశ్న) మీ నేపథ్యం, సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చిందో చెప్పండి?

స) నేను పుట్టి పెరిగిందంతా హైద్రాబాద్‌లోనే! చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా నటుడిని అవ్వాలనుకున్నా. బీటెక్ పూర్తి కాగానే యాక్టింగ్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని అవకాశాల కోసం వెతగ్గా, తమిళంలో విజయ్ గారి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాయే నన్ను అందరికీ పరిచయం చేసింది. ఇక ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

ప్రశ్న) ‘బాహుబలి’ సినిమాలోనూ నటించినట్టున్నారు. ఆ అవకాశమెలా వచ్చింది?

స) ‘బాహుబలి’ సినిమా కోసం నటీనటులు కావాలంటే నా ఫోటోలు కూడా పంపించా. ఆ తర్వాత రాజమౌళి గారి దగ్గర్నుంచి పిలుపొచ్చింది. ఓ ముప్ఫై రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి కాళకేయ తమ్ముడి పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. ప్రభాస్ – రాజమౌళిల ‘ఛత్రపతి’ చూశాకే నేను సినిమాల్లోకొచ్చా. వాళ్ళతో కలిసిపనిచేయడం మరిచిపోలేను.

ప్రశ్న) ‘బాహుబలి’ కాకుండా ఇంకా ఏమేం పెద్ద సినిమాలు చేస్తున్నారు?

స) తమిళంలో విజయ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘పులి’ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నా. విజయ్ గారే ఆయనతో కలిసి నటించే అవకాశాన్ని మళ్ళీ ఇప్పించారు. ‘బాహుబలి’లానే అది కూడా 100కోట్ల బడ్జెట్‌ సినిమానే! ఆ రకంగా ఈ సంవత్సరం నేను నటించిన రెండు వంద కోట్ల బడ్జెట్ సినిమాలు వస్తున్నాయన్నమాట!

ప్రశ్న) ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు?

స) నా బాడీ లాంగ్వేజ్‌కి విలన్ తరహా పాత్రలు బాగా సూటవుతాయి. అలాంటి పాత్రలే కాక నన్ను నేను నిరూపించుకోగల పాత్ర ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటా. దర్శకుల నటుడు అనిపించుకోవాలనేదే నా లక్ష్యం.

ప్రశ్న) ప్రస్తుతం కెరీర్ ఎలా ఉంది? ఏమేం సినిమాలు ఒప్పుకున్నారు?

స) ప్రస్తుతానికి కెరీర్ చాలా బాగుంది. తమిళంలో ‘పులి’తో పాటు మరో అవకాశం వచ్చింది. ఇక తెలుగులో పూరీ జగన్నాథ్ గారి సినిమాలో విలన్ రోల్ చేయనున్నా. ‘వ్యూహం’ అనే ఓ థ్రిల్లర్ సినిమాలో హీరోగా నటించా. ప్రేక్షకుల ఆశీస్సులతో వరుస అవకాశాలతో కెరీర్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటున్నా.

ఇక అక్కడితో చరణ్‌దీప్‌తో మా ఇంటర్వ్యూ ముగించాం. నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా చరణ్‌కు 123తెలుగు తరపున శుభాకాంక్షలు.