సమీక్ష : కోకో కోకిల – అన్ కన్వెన్షనల్ డార్క్ కామెడీ

విడుదల తేదీ : ఆగష్టు 31, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : నయనతార, యోగి బాబు, శరణ్య పొన్వన్నన్, శరవణన్, రాజేంద్రన్

దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్

నిర్మాతలు : లైకా ప్రొడక్షన్స్

సంగీతం : అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫర్ : శివకుమార్ విజయన్

ఎడిటర్ : ఆర్.నిర్మల్

స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రగా వచ్చిన తమిళ చిత్రాన్ని ‘కోకో కోకిల’ పేరుతో తెలుగులో అనువాదించారు. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించారు. కాగా లైకా ప్రొడక్షన్స్ ఈ ‘కోకో కోకిల’ చిత్రాన్ని ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :

కోకిల(నయనతార) ఓ సాధారణమైన మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. అసలుకే కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండగా.. కోకిల తల్లికి క్యాన్సర్ వస్తుంది. వేంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదమని డాక్టర్స్ చెబుతారు. ట్రీట్మెంట్ తీసుకోవాలంటే 15 లక్షలు కావాలి. కోకిల దగ్గర డబ్బులు ఉండవు. డబ్బులు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో “కోకిల” డ్రగ్స్ సరఫరా చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

మరి కోకిల డ్రగ్స్ ఎలా సరఫరా చేసింది ? చేయడానికి ఆమె ఎదురుకున్న ఇబ్బందులు ఏమిటి ? అసలు డ్రగ్స్ సరఫరా తెలిసే చేసిందా?, లేకుంటే కోకిలకి తెలియకుండా ఆమె చేత ఎవరైనా చేయించారా? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా మొత్తం నయనతార మరియు ఆమె ఆర్థిక సంక్షోభం చుట్టూ తిరుగుతుంది. కాగా నయనతార తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. తన అభినయంతో అందంతో చిత్రంలోనే హైలెట్ గా నిలుస్తూ ఈ చిత్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసింది.

హీరోల్లా ఫైట్స్ చేయకపోయినప్పటికీ కేవలం తన అమాయకత్వంతోనే విలన్ల అంతు చూసే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాగే తన తల్లిని తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె పడే బాధ, ఇబ్బందులు సినిమాకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేస్తోంది.

మొదటి సగభాగంలో సినిమా సెటప్ అంతా వాస్తవికానికి దగ్గరగా సాగుతూ.. మాదకద్రవ్యాల వ్యాపారం కళ్ళకు కట్టినట్లు చక్కగా చూపించారు. యోగి బాబు మొట్టాయ్ రాజేంద్రన్, శరణ్య మంచి పాత్రలు పోషించారు. మెయిన్ గా యోగి బాబు తన కామెడీ టైమింగ్ తో బాగానే నవ్వించాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్ :

సినిమాలో కొన్ని దృశ్యాలని అనవసరంగా సాగాతీశారనిపిస్తోంది. రెగ్యూలర్ సాగే కథనం, సినిమాలోని ఉత్సుకతకు అడ్డుపడుతుంది. హీరోయిన్ తన కుటుంబం తన జీవితంలో అతిపెద్ద నిర్ణయం తీసుకోవలసి వచ్చే సీరియస్ సన్నివేశంలో దర్శకుడు అనవసరమైన కామెడీ ట్రాక్ ని చొప్పించి.. కథలోనో సీరియస్ నెస్ ని డైవర్ట్ చేశాడు. పైగా కథలో నమ్మశక్యం కాని ట్విస్ట్ లు ఉండటం కూడా అంతగా రుచించదు.

క్లైమాక్స్ సీక్వెన్స్ లోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కూడా చాలా సాధారణమైనవిగా అనిపిస్తాయి. పైగా ఫస్టాఫ్‌లో అక్కడక్కడ బాగా సాగినట్లుండే సీన్లు ప్రేక్షకుల సహననానికి పరీక్ష పెట్టినట్లు ఉంటుంది.

ఇక సినిమా సాగే తీరు, సినిమాలోని సంఘటనలు నటించిన నటీనటులు ఇలా ప్రతి అంశంలో తమిళ్ నేటివిటీ కనిపిస్తుంది. మరీ ఎక్కువుగా తమిళ వాసనలు వస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు తమిళ్ సినిమా చూస్తున్న ఫీలింగే వస్తోంది.
సాంకేతిక విభాగం :

ఈ చిత్ర దర్శకుడు నెల్సన్ ఒక విచిత్ర కథాంశాన్ని ఎంచుకున్నాడు. తన దర్శకత్వ పనితనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నే ప్రయత్నం చేశాడు. అయితే ఆయన రాసుకున్న రెండో భాగంలోని కథనం ఫ్లాట్ గా ఉంది. నెల్సన్ స్క్రిప్ట్ మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉంటే ఈ చిత్రం ఇంకా బాగా వచ్చి ఉండేది.

శివకుమార్ విజయన్ కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్ చాలా బాగున్నాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం బాగుంది. కాకపోతే తమిళ చిత్రాల్లోని బిట్స్ గుర్తువస్తాయి. ఇక ఈ ఆల్బమ్ మొత్తంలో ఒకే ఒక్క పాట మాత్రమే ఉంది. ఎడిటర్ పనితరం కూడా పర్వాలేదు. నిర్మాతలు పనితనం బాగుంది. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో చిత్రకరించడం వల్ల తక్కువ బడ్జెట్లోనే ఈ చిత్రం నిర్మించేశారు.
తీర్పు :

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పై నయనతార ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘కోకో కోకిల’ చిత్రం రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాగుతుంది. సినిమాలో అక్కడక్కడ వచ్చే కామెడీ బాగా నవ్విస్తుంది. ఊహించని ట్విస్టులు కూడా సినిమా పై ఆసక్తిని పెంచుతాయి. నయనతార తన పెర్ఫార్మెన్స్ తో సినిమానే నిలబెట్టే ప్రయత్నం చేసింది. కాకపోతే తమిళ నేటివిటీ ఎక్కువుగా కనిపిస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

X
More