‘జ్యో అచ్యుతానంద’ క్లైమాక్స్ చదివి ఏడ్చేశా : సుకుమార్

sukumar
దర్శకుడిగా మారి మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్, తాజాగా ‘జ్యో అచ్యుతానంద’ అనే సినిమాతో వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ట్రైలర్‌తో మంచి అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా ఈ శుక్రవారం (సెప్టెంబర్ 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. దీంతో టీమ్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇక ఈ క్రమంలోనే సినిమా గురించి ప్రముఖ దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. జ్యో అచ్యుతానంద పూర్తి స్క్రిప్ట్ ఎప్పుడో చదివానని, సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు.

“ఊహలు గుసగుసలాడే స్క్రిప్ట్ చదివినప్పుడే అవసరాల శ్రీనివాస్‌పై మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ సినిమా చూసినప్పుడు ఇంత ఫ్రెష్‌గా భలే తీశాడే అనిపించింది. ఆ తర్వాత జ్యో అచ్యుతానంద స్క్రిప్ట్ ఇచ్చి చదవమన్నప్పుడూ ఎంతో ఎగ్జైటింగ్‌గా చదివా. మూడు పాత్రల చుట్టూ సరదాగా సాగుతూ, చివరివరకూ సస్పెన్స్‌ని ఒక థ్రిల్లర్‌లా రాసుకున్న విధానం నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ చదవగానే నేనైతే ఒక్కసారే ఏడ్చేశా. స్క్రిప్ట్ చదివాను కాబట్టి, సినిమా ఎలా వచ్చి ఉంటుందో ఊహించగలను కాబట్టి సాయి కొర్రపాటి గారికి, టీమ్‌కి మంచి విజయం వస్తుందని ఊహిస్తున్నా” అని సుకుమార్ తెలిపారు. నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను వారాహి చలన చిత్రంపై సాయి కొర్రపాటి నిర్మించారు.