శివ కార్తికేయన్ “వరుణ్ డాక్టర్” ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

Published on Sep 27, 2021 2:22 pm IST

అనగనగా ఓ డాక్టర్, అతని పేరు వరుణ్. అతనికి ఓ కుటుంబం ఉంది. అయితే, అది సొంత కుటుంబం కాదు. అందరూ కలిసి కుటుంబంలా నటిస్తూ, కిడ్నాప్ లు చేస్తుంటారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కు, డాక్టర్ చేయించే కిడ్నాప్ లకు సంబంధం ఏమిటి? వైద్యం చేయాల్సిన డాక్టర్ గన్ చేతపట్టి హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాలోకి ఎందుకు వచ్చాడు? దాన్ని ఎలా అరికట్టాడు? అనేది తెలియాలంటే విజయదశమి కానుకగా విడుదలవుతున్న వరుణ్ డాక్టర్ చిత్రాన్ని థియేటర్లలో చూడాల్సిందే.

రెమో, సీమ రాజా, శక్తి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఆయన హీరోగా నటించిన చిత్రం వరుణ్ డాక్టర్. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ బీస్ట్ దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన చిత్రమిది. కె.జె.ఆర్. స్టూడియోస్ అధినేత కోటపాడి జె. రాజేష్ ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్, ఎస్.కె. ప్రొడక్షన్స్ సంస్థలతో సంయుక్తంగా నిర్మించారు. విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 9న డాక్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు.‌ దానికి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. 1.5 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

ఈ సందర్భంగా నిర్మాత కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ, “శివ కార్తికేయన్ గారికి తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. ట్రైలర్ కు లభిస్తున్న స్పందన అందుకు ఉదాహరణ.‌ శక్తి తర్వాత మరోసారి ఆయనతో చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ లో ఆయన స్టైలిష్ లుక్, నటన అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాలో కథానాయకుడి పాత్ర చిత్రణ సైతం అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అద్భుతమైన కథ, కమర్షియల్ హంగులతో ఎక్స్ట్రాడినరీ సినిమా తీశారు. ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తుంది. వానలో హీరోగా నటించిన వినయ్, డాక్టర్ లో ప్రతినాయకుడిగా నటించారు. అలాగే, గ్యాంగ్ లీడర్ తో తెలుగు పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్ శివ కార్తికేయన్ సరసన నటించారు. అనిరుధ్ అందించిన పాటలకు తమిళంలో అద్భుత స్పందన లభించింది. త్వరలో తెలుగు పాటలను విడుదల చేస్తాం. విజయదశమికి ప్రేక్షకులందరూ కుటుంబంతో కలిసి చూసే చక్కటి చిత్రమిది” అని అన్నారు.

దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ, “ఇదొక మాస్ ఎంటర్టైనర్. ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి చక్కటి స్పందన లభించడం సంతోషంగా ఉంది. సినిమా సైతం ప్రేక్షకులు అందరినీ తప్పకుండా అలరిస్తుందని చెప్పగలను” అని అన్నారు.

సంబంధిత సమాచారం :