యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న 2018 నాటి హిట్ చిత్రం ‘హుషారు’కు సీక్వెల్ సిద్ధమైంది. ‘హుషారు 2’ పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. మొదటి భాగాన్ని రూపొందించిన శ్రీహర్ష కొనుగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఆకట్టుకుంటున్న టైటిల్ పోస్టర్
విడుదలైన టైటిల్ పోస్టర్ అమృత మథనం కాన్సెప్ట్‌ను గుర్తు చేస్తూ డిఫరెంట్‌గా ఉంది. మొదటి భాగంలో స్నేహితులు తయారు చేసిన ‘కబూమ్’ బీర్ ఉన్న ట్రక్కును ఇరువైపులా కొందరు లాగుతుండగా, మధ్యలో పాము రూపంలోని తాడులో స్నేహితులు చిక్కుకుని కనిపిస్తున్నారు. ట్రక్కు కింద తాబేలు, కాస్త దూరంలో బంగారు నగలతో ఉన్న పెట్టె, వెనుక ఫ్యాక్టరీ బ్యాక్‌డ్రాప్‌ను డిజైన్ చేశారు. ఈ విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్
సినిమా ప్రధాన షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్రబృందం తెలిపింది. రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి అంథోని, దినేష్ తేజ్, శశిధర్ కోచర్లకోట, విధి యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సన్నీ ఎం.ఆర్ సంగీతం అందిస్తుండగా, రామ్ మిర్యాల అడిషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కేవ్‌మ్యాన్ స్టోరీస్, హెచ్‌కే ఫిల్మ్స్, కలియుగ వారధి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


