ఫ్యామిలీ అప్పులు తీర్చడమే అసలైన కిక్.. కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ గ్లింప్స్ చూశారా?

ఫ్యామిలీ అప్పులు తీర్చడమే అసలైన కిక్.. కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ గ్లింప్స్ చూశారా?

Published on Oct 5, 2026 1:01 PM IST

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘క’ వంటి విజయాల తర్వాత రూపొందుతున్న ఆయన 13వ చిత్రానికి (#KA13) టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర బృందం సరికొత్త గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘రియాలిటీ’ అనే అర్థవంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా కిరణ్ అబ్బవరమే స్వయంగా చేపట్టడం విశేషం.

జాయ్ ఫిలింస్ పతాకంపై సుధాకర్ చాగంటి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సురేష్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

మనసును హత్తుకునేలా టైటిల్ గ్లింప్స్

తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఇందులో ఆనందం అనే బాధ్యత గల యువకుడి పాత్రలో కిరణ్ అబ్బవరం కనిపించారు. ‘ఆనందం హోటల్’ నడుపుతూ ప్రజలకు ఎంతో ఇష్టంగా భోజనం వడ్డించడంలోనే అతడు నిజమైన ఆనందాన్ని వెతుక్కుంటాడు. కుటుంబానికి ఉన్న అప్పులన్నీ తీర్చినప్పుడే తనకు నిజమైన కిక్ వచ్చిందని స్నేహితులతో చెప్పే డైలాగ్ మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలకు అద్దం పడుతోంది. అలాగే మిద్దెపై కుటుంబ సభ్యులతో కలిసి అప్పడాలు వత్తుతూ గడిపే సన్నివేశాలు కుటుంబ విలువల ప్రాధాన్యతను చాటుతున్నాయి.

ఈ చిత్రంలో దేవిక భట్ కథానాయికగా నటిస్తుండగా.. శరత్ కుమార్, సాయి కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, నేపథ్యంలోని ‘భజగోవిందం’ ట్రాక్ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందించగా, సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, సంతోష్ నాయుడు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అన్ని హంగులతో సిద్ధమవుతున్న ‘రియాలిటీ’ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు