పవన్ కంటే నేనే బెటర్ : రామ్ గోపాల్ వర్మ

ram-gopal-varma
ఎప్పుడూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని పలు కామెంట్స్ చేయడం అలవాటే! తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటే నేనే బెటర్ సింగర్‌ని అంటూ ఓ ట్వీట్ వేసి నెటిజన్లలో హాట్ టాపిక్ అయిపోయారు. ‘జనసేన’ పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఈమధ్యే పవన్ కళ్యాణ్ కాకినాడలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో తన ప్రసంగంలో భాగంగా పవన్ ఓ జానపద గేయం పాడారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పవన్ కంటే తానింకా బాగా పాట పాడగలనని వర్మ కామెంట్ చేశారు.

అంతే కాకుండా తన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వంగవీటి’ అనే సినిమాలో తాను స్వయంగా పాడిన చంపరా అనే పాటను విడుదల చేశారు. ఇప్పటికే ‘రక్తచరిత్ర’ సినిమాలో ఓ పాట పాడి ఆకట్టుకున్న వర్మ, వంగవీటి సినిమాలోనూ పాట పాడడం ఆసక్తి రేకెత్తిస్తోంది. పవన్ పాటను, తన పాటను రెండింటినీ పోల్చి చూసి ఎవరు మంచి సింగరో తెలపాలంటూ వర్మ ట్విట్టర్‌లో కోరడం విశేషంగా చెప్పుకోవాలి.