పవన్‌ తమ్ముడిగా నటించడం అదృష్టంగా భావిస్తున్నా!

3rd, October 2016 - 11:26:16 AM

shiva-balaji
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘కాటమరాయుడు’ అనే సినిమా ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. చాలా నెలల క్రితమే అనౌన్స్ అయిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ చేస్తోన్న పాత్రకు ముగ్గురు తమ్ముళ్ళు ఉంటారట. ఇందులో ఒక తమ్ముడి పాత్రలో యంగ్ హీరో శివ బాలాజి నటిస్తున్నారు. ఈమధ్యే పూర్తైన ఫస్ట్ షెడ్యూల్‌లోనూ శివ బాలాజీ పాల్గొన్నారు.

ఇక ఈ సినిమాలో నటించడం గురించి మాట్లాడుతూ.. ‘కాటమరాయుడు’ కోసమే ప్రత్యేకంగా గడ్డం పెంచానని, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ పక్కన, ఆయన తమ్ముడిగా, శివరాయుడు అనే పాత్రలో నటించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని శివబాలాజీ అన్నారు. ఓ అద్భుతమైన కథతో ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా నడుస్తుందని శివబాలాజీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 5 నుంచి రామేశ్వరంలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది.