ఇంటర్వ్యూ : శ్రీను వైట్ల – ఎప్పటికీ కామెడీని వదలకుండా సినిమాలు చేస్తాను !
Published on Apr 9, 2017 4:39 pm IST


‘ఆగడు, బ్రూస్లీ’ వంటి పరాజయాలతో బాగా వెనుకబడ్డ దర్శకుడు శ్రీను వైట్ల ఈసారి విజయం అందుకోవాలనే ఖచ్చితమైం ఉద్దేశ్యంతో మెగా హీరో వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’ చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం రాబోయే 14వ తేదీన రిలీజ్ కానున్న సందర్బంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం…

ప్ర) ఈ ‘మిస్టర్’ ప్రాజెక్ట్ ఎలా రూపుదిద్దుకుంది ?
జ) ఇదొక ట్రావెల్ సినిమా. చాలా రోజులుగా ఒక ట్రావెల్ ఫిలిం చేయాలని అనుకున్నాను. అంటే విజువల్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ కి స్కోప్ ఉన్న సినిమా చేద్దామనుకున్నాను. అలా ఉండగా గోపి మోహన్ నాకీ లైన్ చెప్పాడు. అలా కథను రెడీ చేసుకునేప్పుడు వరుణ్ తేజ్ అయితే బాగుంటుందని అనుకుని అన్నీ రెడీ చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేశాం.

ప్ర) సినిమాని ఎక్కడెక్కడ షూట్ చేశారు ?
జ) ఫారిన్లోకేషన్ కు వెళితే ఏదో ఒక ఊర్లో షూటింగ్ చేసేస్తాం. కానీ ఈ సినిమా కోసం స్పెయిన్లో 11 సిటీస్లో షూట్ చేశాం. ఆ తర్వాత స్విట్జర్ ల్యాండ్ కు వెళ్ళాం. ఆ తర్వాత ఇండియా వచ్చి చిక్ మంగుళూరు వెళ్ళాం. అక్కడ చాలా కష్టపడి షూట్ చేశాం. దాని తర్వాత ఊటీ, తర్వాత కేరళ వెళ్ళాం. హైదరాబాద్లో ఒక్క షాట్ కూడా తీయలేదు.

ప్ర) వరుణ్ తేజ్ ఎలా చేశారు ?
జ) నేను చిన్నప్పుడు వరుణ్ చూసి చాలా బాగున్నాడు అనే వాడిని. అప్పుడే నాగబాబుగారు అయితే నువ్వే సినిమా తీయొచ్చుగా అనేవారు. నేను కూడా తప్పకుండా చేస్తాను అన్నాను. అతని మొదటి సినిమా ‘ముకుంద’ చూస్తే బాగా చేశాడనిపించింది. ఇప్పటిదాకా వరుణ్ చేసిన సినిమాల్లో ఎందులోనూ అతను పూర్తిగా ఓపెన్ కాలేదు. కానీ ఈ సినిమాలో మాత్రం అన్ని యాంగిల్స్ లోనూ కనిపిస్తాడు.

ప్ర) ఇది మీ పాత సినిమాల్లాగే ఉంటుందా లేక భిన్నంగా ఉంటుందా ?
జ) తప్పకుండా వేరేగా ఉంటుంది. ఇదొక ఫ్రెష్ లవ్ స్టోరీ. ఇప్పటిదాకా నేను ఇలాంటిది చేయలేదు. నా లాస్ట్ సినిమాల్లో నేను సరిగా నవ్వించలేదు. ఈ సినిమాలో మాత్రం క్వాలిటీ కామెడీ దొరుకుతుంది.

ప్ర) హీరోయిన్ల గురించి చెప్పండి ?
జ) ఇందులో లావణ్య, హెబా పటేల్ నటించారు. మరీ కొత్తవాళ్లు కాకుండా కొన్నిసినిమాలు చేసిన వాళ్లతో చేయాలని అనుకుని వీళ్ళను తీసుకున్నాం. హెబా పటేల్ పాత్ర ఆమె ఇదివరకటి సినిమాలకన్నా భిన్నంగా ఉంటుంది. చాలా క్లాస్ గా అనిపిస్తుంది. లావణ్య కూడా చంద్రముఖి పాత్రలో బాగా పెర్ఫామ్ చేసింది.

ప్ర) మిక్కీ మ్యూజిక్ ఎలా ఇచ్చాడు ?
జ) అన్నీ కొట్టగానే ఉండాలి అనుకున్నప్పుడు మ్యూజిక్ కోసం మిక్కి అయితే బాగుంటుందని తీసుకున్నాం. మొదట్లో ఎలా చేస్తాడో అనుకున్నా. కానీ చాలా బాగా చేశాడు. ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాకి మ్యూజిక్ ఇవ్వడమంటే అంత ఈజీ కాదు.

ప్ర) ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్స్ ఏమన్నా ఉంటాయా ?
జ) ఇందులో చాలా పాత్రలుంటాయి. ‘రెడీ’ సినిమాలోకన్నా ఎక్కువ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. కామెడీ క్యారెక్టర్స్ కొత్తగా ఉంటూనే నవ్విస్తాయి.

ప్ర) బ్రూస్లీ ఫెయిల్యూర్ తర్వాత మిమ్మల్ని మోటివేట్ చేసింది ఎవరు ?
జ) మంచి సినిమా తీసి ఫెయిల్ అయితే భాధపడతాం. బ్రూస్లీ సమయంలో నాకు అన్నీ అనుకున్నట్టు కుదరలేదు. అది ప్రేక్షకులకు నచ్చలేదు కాబట్టి రిజెక్ట్ చేశారు. అలా అనుకునే త్వరగా డైజెస్ట్ చేసుకున్నాను. ‘మిస్టర్’ కూడా సక్సెస్ కోసం చేయలేదు. ప్రేక్షకుల ప్రేమ కోసం చేశాను.

ప్ర) ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి మీకిచ్చిన ప్రోత్సాహం గురించి మీ ఫీలింగ్ ?
జ) నిజంగా ఆయన అలా మాట్లాడటం గొప్ప విషయం. ఈ సినిమా మంచి విజయం సాధించిన తర్వాత పర్సనల్ గా వెళ్లి ఆయన్ను కలిసి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను.

ప్ర) ‘భద్ర’ తరహా కామెడీ చేయకూడదని ఎప్పుడనుకున్నారు ?
జ) అంటే ‘ఢీ’ అప్పటి నుండి ఆ తరహా కామెడీతో చాలా సినిమాలు చేశాను . నాతో పాటు చాలామంది చేశారు. ఏదైనా అన్ని సార్లు చేస్తే జనాలకు బోర్ కొట్టేస్తుంది. అందుకే ముందే ఆపేద్దాం అనుకున్నాను. కానీ ఒక దెబ్బ తగిలాకే ఆపగలిగాను.

ప్ర) ఈ స్క్రిప్ట్ రెడీ చేయడానికి అంత ఎక్కువ సమయం ఎందుకు పట్టింది ?
జ) నేను కొత్త సినిమానే చేద్దామని అనుకున్నాను. అందుకే అన్నీ కొత్తగా ఉండేలా చూసుకున్నాను. ఆ తర్వాత ప్రేక్షకులు నా నుండి ఆశించేది కామెడీ కానుక దాన్ని కూడా కథ చెడిపోకుండా అందులో ఇన్వాల్వ్ చేయాలి. అది చాలా కష్టం. అందుకే ఎక్కువ సమయం పట్టింది. ఇకపై కూడా నా నుండి కోరుకునే కామెడీని మాత్రం వదిలిపెట్టకుండా సినిమాలు చేస్తాను.

ప్ర) అసలీ మిస్టర్ కథేమిటి ?
జ) సాధారణంగా ట్రైయాంగిల్ లవ్స్టోరీ లో ఒకటే కథ ఉంటుంది. కానీ ఇందులో ముగ్గురికీ మూడు కథలుంటాయి. మూడింటినీ కలుపుతూ మంచి కామెడీ జనరేట్ చేయడానికి కాస్త ఎక్కువ టైమ్ పట్టింది. రెడీ సినిమా కొచ్చినంత పేరొస్తుంది.

ప్ర) ఫ్యూచర్ లో సినిమాలు నిర్మించే ఆలోచనుందా ?
జ) తప్పకుండా నిర్మాతనవుతాను. సినిమాల్ని వేరొకరితో కలిసి వేరొకరితో కలిసి అయినా చేయొచ్చు లేకపోతే సోలోగా అయినా చేయవచ్చు.

 
Like us on Facebook