ఇంటర్వ్యూ: వంశీ కృష్ణ – నాని, శర్వానంద్ లాంటి హీరోలతో సినిమాలు చేయాలని ఉంది !
Published on Mar 2, 2017 1:45 pm IST


‘దొంగాట’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై ప్రసుతం యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ అనే సినిమాని డైరెక్ట్ చేసిన దర్శకుడు ‘వంశీ కృష్ణ’ రేపు మార్చి 3వ తేదీన చిత్ర రిలీజ్ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం…

ప్ర) మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎక్కడ్నుంచి వచ్చారు ?
జ) మాది చెన్నై. నేను అక్కడే పెరి గాను,అక్కడే చదువుకున్నాను. మా నాన్న కూడా నిర్మాతే. ముందుగా ఎడిటర్ గా చేరి తర్వార ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేసి ఆ తర్వాత డైరెక్షన్లోకి వచ్చాను.

ప్ర) ఎవరెవరి దగ్గర పని చేశారు ?
జ) ఎడిటర్ గా ఉన్నప్పుడు శ్రీకర్ ప్రసాద్ దగ్గర పని చేశా. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత ‘దేనికైనా రెడీ, గుండెల్లో గోదారి, ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశాక గౌతమ్ వాసు దేవ్ మీనన్ వద్ద డైరెక్షన్ డిపార్టుమెంట్లో వర్క్ చేశా.

ప్ర) ఇన్ని విభాగాల్లో ఎందుకు పని చేశారు ?
జ) హాలీవుడ్ సినిమాలు చూస్తే అక్కడ సక్సెస్ అయిన చాలా మంది దర్శకులు నిర్మాతలుగా చేసిన వాళ్ళే. అలా చేయడం వలన సినిమాకి ఎంత ఖర్చవుతుంది, ఎంత మిగులుతుంది అనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. అలాగే సినిమా గురించిన చాలా నిర్ణయాలు ఎడిటింగ్ చేసేప్పుడే జరుగుతుంటాయి, అందుకే అవి రెండు అవసరమని తెలుసుకున్నాను.

ప్ర) సినిమా విడుదల పట్ల ఎగ్జైటింగా ఫీలవుతున్నారా ?
జ) అవును.. సినిమా విడుదల చాలా ఎగ్జైటింగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు కూడా తప్పక నచ్చుతుంది.

ప్ర) ఈ సినిమాలో ఏయే అంశాలు ఉండబోతున్నాయి ?
జ) ఈ సినిమాలో కామెడీ, లవ్, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. ప్రతి సన్నివేశం సరదాగా సాగిపోతూ ప్రేక్షకులను అలరిస్తుంది.

ప్ర) ఈ సినిమాలో రాజ్ తరుణ్ పాత్రేమిటి ?
జ) ఇందులో హీరో రాజ్ తరుణ్ తనకున్న ఇబ్బందుల వలన డబ్బు అవసరమై కుక్కలను కిడ్నాప్ చేస్తుంటాడు. ఎందుకంటే హీరో మంచివాడు, కాబట్టి పెద్దగా రిస్క్ లేకుండా ఉంటుందని అలా కుక్కల్ని కిడ్నాప్ చేస్తుంటాడు.

ప్ర) గత సినిమాల్లో రాజ్ తరుణ్ కి ఇందులో రాజ్ తరుణ్ కి ఏంటి తేడా ?
జ) గత సినిమాల్లో చూస్తే రాజ్ తరుణ్ మాటలు, బాడీ లాంగ్వేజ్ చాలా మాస్ గా ఉంటాయి. కానీ ఇందులో మాత్రం చాలా క్లాస్ గా స్టైలిష్ గా ఉంటాయి. ఇంతకుముందుకన్నా కాస్త కొత్తగా కనిపిస్తాడు.

ప్ర) కుక్కల కిడ్నాప్ అంటే జనాలకు రీచ్ అవుతుందా ?
జ) ఖచ్చితంగా అవుతుంది. అది ఎలా అవుతుంది అనేది సినిమా చూశాకే తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో మంచి ఫన్ తో పాటు రేసీగా సాగే సెకండాఫ్ స్క్రీన్ ప్లే కూడా ఉంటుంది కనుక జనాలకు బాగా కనెక్టవుతుంది.

ప్ర) ఇక సినిమాలోని మిగతా పాత్రలు ఎలా ఉంటాయి ?
జ) సినిమాలో హీరో మాత్రమే కాకుండా అనిపించే ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది. వెన్నెల కిశోర్, పృథ్వి లాంటి నటుల కామెడీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. అలాగే విలన్ గా చేసిన అర్బాజ్ ఖాన్ గారు కూడా చాలా బాగా నటించారు. నాకు మంచి స్నేహితుడు కూడా అయ్యారు.

ప్ర) హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ?
జ) హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ చాలా బాగా నటించింది. ఆమె గత సినిమా ‘మజ్ను’ లో కాస్త డీ గ్లామరస్ గా కనిపింస్తుంది. కానీ ఇందులో మాత్రం చాలా గ్లామర్ గా ఉంటుంది. రాజ్ తరుణ్ తో ఆమె కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుట్ అవుతుంది.

ప్ర) కుక్కలతో పని చేయడం కష్టమని అనిపించలేదా ?
జ) ఈ సినిమాలో మొత్తం 13 కుక్కలతో షూటింగ్ చేశాం. వాటితో పని చేయడం కాస్త కష్టమనే అనిపించింది. అందుకే వాటికి రెండు వైపులా కెమరాలు పెట్టి షూట్ చేశాం. అయినా వాటి ట్రైనర్ వాటిని బాగా ట్రైన్ చేయడం మాకు హెల్ప్ అయింది.

ప్ర) మీ నెక్స్ట్ సినిమాలు ఏంటి ?
జ) రెండు,మూడు కథలు రెడీగా ఉన్నాయి. నా నెక్స్ట్ష్ సినిమా మాత్రం స్పై థ్రిల్లర్ చేస్తాను. అనిల్ సుంకర గారికి రెండు కథలు చెప్పాను. అవి ఆయనకు కూడా నచ్చాయి. కానీ నటీనటులు ఇంకా దొరకలేదు. నాని, శర్వానంద్ లాంటి హీరోలతో సినిమాలు చేయాలని ఉంది.

 
Like us on Facebook