‘ఈ కొత్తరకం ప్రమోషన్స్’ ఉంటానికా ? పోవటానికా ?

‘ఈ కొత్తరకం ప్రమోషన్స్’ ఉంటానికా ? పోవటానికా ?

Published on Feb 21, 2019 9:05 AM IST


తరం మారేకొద్దీ ఆలోచనా విధానం కూడా మారుతున్నట్లు.. సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా మూవీ మేకర్స్ అభిప్రాయాలు మారిపోతూ వస్తున్నాయి. క్లుప్తంగా చెప్పుకుంటే ఇప్పటి సినిమా ప్రమోషన్స్ ఒకప్పటిలా లేవు. ఏమైనా ఒకప్పుడు తెలుగు సినిమా ప్రమోషన్స్ అంటే.. ఆ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమంతోనే ప్రమోషన్ మొదలయ్యేది. ఆ సినిమాలో వాళ్ళు నటిస్తున్నారు, ఆ సినిమాకి వీళ్ళు పని చేస్తున్నారు అంటూ ఆ సినిమా షూట్ జరుగుతున్నంత కాలం ప్రజల్లో ఆ సినిమా పట్ల తెగ ఆసక్తి కనిపించేది.

పైగా తమ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ మారేకొద్దీ సినిమా పై జనంలో ఆసక్తి పెంచడానికి చిత్రబృందం కూడా అన్ని రకాలుగా విశ్వప్రయత్నాలు చేసేది. అందులో భాగంగా సినిమా విడుదలకి మూడు నాలుగు నెలలు ముందు నుంచే.. వర్కింగ్ స్టిల్స్ అని, లేటెస్ట్ అప్ డేట్స్ అని, న్యూ పోస్టర్స్ అని, ప్రోమోస్ అని, ఒక నెల ముందే ఆడియో ఫంక్షన్ అని.. ఇలా తమ సినిమాని నిత్యం ప్రజల్లో తీసుకెళ్లడానికి గట్టిగా కృషి చేసేవాళ్ళు ఒకప్పుడు. వీటికి తోడూ టీజర్, ట్రైలర్, ఇంటర్వ్యూస్ ఇలా రిలీజ్ డేట్ కి నెల ముందు నుంచే నానా హంగామా ఉండేది. అలాగే సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకున్న తరువాత కూడా.. ఆ సినిమా హీరో కావొచ్చు, దర్శక నిర్మతలు కావొచ్చు ఆ సినిమాని మాత్రం ఎప్పటికప్పుడు చివరి రోజు వరకూ ప్రమోట్ చేస్తూనే ఉండేవారు.

మరి ఇప్పుడు.. అన్నీ వారం రోజుల్లో అయిపోవాలి, అందుకే సినిమా ఆయుష్షు కూడా నెలలు నుండి రోజులలోకి వచ్చేసింది. నిజానికి ఇప్పుడున్న టెక్నాలజీను, సోషల్ మీడియాను వాడుకొని సినిమా ప్రమోషన్స్ ను ఇదివరకటిలా చాలా ప్లాన్డ్ గా చేసుకోవచ్చు. జనంలో తమ సినిమాని ఇంకా చాలా బలంగా రిజిస్టర్ చెయ్యొచ్చు. కానీ ఇప్పటి దర్శకనిర్మాతలు మాత్రం ఆ దిశగా ఆలోచించట్లేదు ఎందుకో. ఒకసారి ఒక్క పదిహేను సంవత్సరాలకు వెనక్కి వెళ్తే.. అప్పట్లో కొంతమంది సినీ మేధావులు ఈ విధంగా ఊహించారు.

భవిష్యత్తులో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాకా.. సినిమా ప్రమోషన్స్ విషయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయకున్నారు. సినిమాను ప్రజల్లోకి చాలా సులభంగా తీసుకు వెళ్ళొచ్చు అనుకున్నారు ఆ మేధావులు అంతా. కానీ అది కాస్తా రివర్స్ అయింది. ఓ సాధారణ ప్రేక్షకుడిని గత వారం ఏ ఏ సినిమాలు విడుదల అయ్యోయో చెప్పమంటే.. ఖచ్చితంగా చెప్పలేడు. అంటే దీని అర్ధం ఏమిటి ? యూట్యూబ్, ఆమెజిన్ ప్రైమ్ లాంటి బలమైన వీడియో ప్లాట్ ఫామ్స్ ఉన్నా, పేస్ బుక్, ట్విట్టర్స్ లాంటి చాటింగ్ సెషన్స్ అందుబాటులో ఉన్నా.. సాధారణ ప్రేక్షకుడికి గుర్తు ఉండేలా, తమ సినిమాని మాత్రం ప్రమోట్ చేయలేకపోతున్నారు మేకర్స్.

దీంతో ‘పడి పడి లేచె మనసు’, ‘మిస్టర్ మజ్ను’, ‘అంతరిక్షం’ లాంటి చిత్రాలూ ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద అవి ఫెయిల్యూర్ చిత్రాలుగా నిలిచిపోతున్నాయి. కారణం ఆ సినిమాలు ప్రతి ప్రేక్షకుడి దగ్గరకి చేరువవ్వడం లేదు. ఎందుకు ? కేవలం సినిమా విడుదలకు, వారం రోజులు ముందు నుంచి.. ఊపిరి ఆడకుండా ప్రమోషన్స్ చేస్తున్నప్పటికీ.. పొరపాటున ఆ టైంలో వేరే ఏ అంశం అయినా వైరల్ అయినా, పెద్ద ఇష్యూ అయినా.. జనం ఆ అంశం మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఈ లోపు సినిమా ఆయువు తీరిపోతుంది. ఆ వారం ఊపిరి ఆడకుండా చేసే ప్రమోషన్స్ జనంలోకి వెళ్లడం లేదు. దాంతో పర్వాలేదు అనిపించినా సినిమా కూడా కలెక్షన్స్ ను రాబట్టలేక చేతులు ఎత్తేస్తోంది.

అయినా సినిమా ప్రేక్షకుల కోసం తీస్తూ.. ఆ ప్రేక్షకులను ముందు నుంచి ఆకట్టుకోకపొతే ఎలా ? ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన అంశమేంటంటే.. ప్రమోషన్స్ ముందు నుంచి బలంగా చెయ్యకుండా.. చివరలో ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రేక్షకులు అంగీకరించడం లేదు అనే విషయాన్ని మనం అర్ధం చేసుకోవాలి. సర్వసాధారణమైన ఈ వారం రోజులు ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ లో ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు