ఇంటర్వ్యూ : అభిజిత్ – ‘మిర్చిలాంటి కుర్రాడు’ నా కెరీర్‌కు చాలా ఇంపార్టెంట్!

ఇంటర్వ్యూ : అభిజిత్ – ‘మిర్చిలాంటి కుర్రాడు’ నా కెరీర్‌కు చాలా ఇంపార్టెంట్!

Published on Jul 30, 2015 4:12 PM IST

abijeet

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో తనదైన స్టైల్లో ఓ మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా ద్వారా ఆయన పలువురు కొత్త నటులను తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు. అందులో ఒకరే అభిజిత్. ఆ సినిమాలో ఒక మధ్యతరగతి అబ్బాయిగా కనిపించి మెప్పించిన అభిజిత్, చాలా కాలం తర్వాత సోలో హీరోగా ‘మిర్చిలాంటి కుర్రాడు’తో మన ముందుకు వస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాతగా జై నాగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. రేపు (జూలై 31న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అభిజిత్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫల్’ తర్వాత సోలో హీరోగా రావడానికి ఇంత కాలం పట్టిందేం?

స) అదేమీ కావాలని తీసుకున్న టైమ్ కాదు. శేఖర్ కమ్ముల గారి ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌’తో నేను ఊహించిన దానికంటే మంచి ఎంట్రీ లభించింది. ఆ తర్వాత కూడా ఆ సినిమా ఇచ్చిన గుర్తింపు చెడిపోకుండా ఉండాలని మంచి కథల కోసం చూశా. అయితే అదే సమయంలో కొన్ని పర్సనల్ పనుల కోసం అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. నేను అమెరికాలో ఉన్నప్పుడే ‘మిర్చిలాంటి కుర్రాడు’ ఆఫర్ వచ్చింది. ఏదేమైనా రెండో సినిమా రావడానికి ఆలస్యమైనా మంచి సినిమాతోనే వచ్చా.

ప్రశ్న) ఈ సినిమా రిలీజ్‌కు కూడా చాలా ఆలస్యమైంది. కారణమేంటి?

స) ఈ సినిమా నిర్మాత రుద్రపాటి రమణరావు గారు ‘లయన్’ సినిమా పనుల్లో బిజీ అయిపోవడంతో ఈ సినిమా ఆలస్యమైంది. లయన్ రిలీజయ్యాక ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేశారు. అనుకోకుండా పెద్ద సినిమాలన్నీ ఈ మధ్యకాలంలోనే వచ్చేయడంతో సినిమా రిలీజ్‌కు ఇప్పటికి అవకాశం దక్కింది.

ప్రశ్న) ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమా ఏం చెప్పబోతోంది?

స) ఈ సినిమాను లవ్ కమ్ యాక్షన్ ఎంటర్‍టైనర్‌గా చెప్పుకోవచ్చు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిసిన ఈ సినిమాలో లవ్, కామెడీ, యాక్షన్ ఇలా అన్నీ ఉన్నాయి. దర్శకుడు జై నాగ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయవుతున్నారు. ఆయన మొదట్నుంచీ ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తోనే ఎంట్రీ ఇవ్వాలని చూశారు. కమర్షియల్ ఎలిమెంట్స్, కమర్షియల్‌గా ఓ సినిమాను చెప్పే విధానంపై పట్టున్న దర్శకుడు తీసిన సినిమా ఇది.

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఏంటి?

స) మిర్చి లాంటి కుర్రాడులో నేను సిద్ధు అనే ఓ మాస్ తరహా పాత్ర చేశా. మాస్ అంటే గెటప్‌లో కాదు కానీ ఆలోచనలు, చేసే పనుల్లో అది కనిపిస్తుంది. జీవితమంటే ఒకే ఒక్క అమ్మాయిని ప్రేమించడం, ఆమెతోనే ఉండడం, అనే కాన్సెప్ట్‌తో బతికే సిద్ధు లవ్‌స్టోరీ చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. మొదట్లో ఓ మాస్ తరహా క్యారెక్టర్ అంటే భయపడ్డా. దర్శకుడే నేనిది చేయగలనన్న నమ్మకాన్ని కల్పించారు.

ప్రశ్న) ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ వచ్చిన మూడేళ్ళకు ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా మీ కెరీర్‌కు ఎలాంటి బూస్టింగ్ ఇస్తుంది?

స) చెప్పాలంటే నా కెరీర్‌కి ఈ సినిమా చాలా చాలా ఇంపార్టెంట్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వచ్చిన మూడేళ్ళకు మళ్ళీ ఈ సినిమా వస్తోందంటే దాదాపుగా నా మొదటి సినిమా ఇచ్చిన ఎనర్జీని రెట్టింపు చేసే విజయం దక్కాలి. ‘మిర్చిలాంటి కుర్రాడు’ కచ్చితంగా అలాంటి సినిమా అవుతుందన్న నమ్మకమైతే ఉంది.

ప్రశ్న) తదుపరి ప్రాజెక్టులేంటి?

స) ఇంకా ఏమీ అనుకోలేదు. ఈ సినిమాకు వచ్చే స్పందనను బట్టి నా తరువాతి సినిమాను అనౌన్స్ చేస్తా. ఇప్పటికీ కొన్ని అవకాశాలైతే వస్తూనే ఉన్నాయి. అందులో ఏది ఫైనలైజ్ చేయాలనేది ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆలోచిస్తా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు