ఇంటర్వ్యూ : గుణశేఖర్ – బన్నినే గోనగన్నారెడ్డి పాత్ర చేస్తానని ముందుకొచ్చాడు, హ్యాట్సాఫ్ టు బన్ని.

ఇంటర్వ్యూ : గుణశేఖర్ – బన్నినే గోనగన్నారెడ్డి పాత్ర చేస్తానని ముందుకొచ్చాడు, హ్యాట్సాఫ్ టు బన్ని.

Published on Oct 6, 2015 1:43 PM IST

guna-shekar
ఇప్పటివరకూ భారీ భారీ సెట్స్ తో భారీ చిత్రాలకు దర్శకత్వం వహించిన గుణశేఖర్ దాదాపు 9 ఏళ్ళు రీసర్చ్ చేసి తనే నిర్మాతగా, దర్శకుడిగా చేసిన హిస్టారికల్ సినిమా ‘రుద్రమదేవి’. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తీసిన ఈ సినిమా ఫైనల్ గా అక్టోబర్ 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ గుణశేఖర్ తో కాసేపు మాట్లాడి సినిమా ప్రస్థానం గురించి, ఈ ప్రస్థానంలో ఎదురైన సవాళ్ళ గురించి తెలుసుకున్నాం.. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) అసలు రుద్రమదేవి అనే చరిత్రని సినిమాగా తీయాలనే ఆలోచన ఎప్పుడు పుట్టింది.?
స) నేను 8వ తరగతి చదువుతున్న టైంలో తెలుగు ఉపవాచాకంలో రుద్రమదేవి కథ ఉంది. ఆ కథ నన్ను బాగా ఆకర్షించిది. అప్పటికి డైరెక్టర్ అవుతా, సినిమా తీస్తా అని తెలియదు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న టైంలో ‘బ్రేవ్ హార్ట్’ అనే హాలీవుడ్ సినిమా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇలాంటి కథలు ఎందుకు రావడం లేదు మన దగ్గర అని ఆలోచిస్తుంటే అప్పుడు అనిపించింది రుద్రమదేవి కథని సినిమా తీయాలని. అప్పటి నుంచి అది నా మైండ్ లో పెరుగుతూనే వచ్చి, ఇప్పుడిలా సినిమాగా వస్తోంది.

ప్రశ్న) సినిమాకి మూడేళ్ళ సమయం పడుతుంది. ఇంత కష్టం, ఇబ్బందులు ఉంటాయని ముందే ఊహించి ఈ సినిమా చేయడానికి సిద్దమయ్యారా.?
స) దర్శకుడిగా నాకు చాలా భారీ చిత్రాలు చేసిన అనుభవం ఉంది. రుద్రమదేవి లాంటి సినిమాని తెరపై చూపించాలి అంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. అన్నీ తెలిసే తెగించి ఈ సినిమా చేయడానికి రంగంలోకి దిగాను.

ప్రశ్న) వేరే నిర్మాతలెవరూ ప్రోత్సహించకపోవడం వలెనే మీరు ఈ సినిమాకి నిర్మాత అయ్యారు.?
స) అవునండి ఎక్కువ భాగం అదే కారణం.. చెప్పాలంటే ఒక్కడు తర్వాత నా ప్రాజెక్ట్ రుద్రమదేవి అని అనౌన్స్ కూడా చేసాను. అప్పట్లో సుమారు 25 కోట్ల బడ్జెట్ అనుకున్నాం. కథ విన్న నిర్మాతలు అందరూ బాగుందని అన్నారు గానీ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఇలాంటి సినిమా తీయాలంటే బడ్జెట్ కావాలని ఎదురు చూసాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నేనే నిర్మాతగా చేసుకుంటే బాగుంటుందని నిర్మాతగా మారాను.

ప్రశ్న) 3డి అంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది, అలాగే ఖర్చుతో కూడుకున్నది. నిర్మాతగా మీకు మీరే బడ్జెట్ పెంచుకొని ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నారు.?
స) నేను చాలా మంది రిస్క్ తీసుకొని ఈ సినిమా చేసాను అంటున్నారు. నేనేమన్నా రిస్క్ చేసాను అంటే అది ౩ది ఫార్మాట్ లో చేయడమే. ఇలాంటి హిస్టారికల్ మూవీస్ లైఫ్ టైంలో ఒక్కసారే వస్తుంటాయి. దాన్ని సింపుల్ గా కాకుండా గ్రాండ్ గా చూపించాలి, అది చరిత్రలో నిలిచిపోవాలి. అలాగే ఎవరో ఒకరు ఒక కొత్త టెక్నాలజీని పరిచయం చెయ్యాలి. అలా నేను రిస్క్ చేసి 3డిని పరిచయం చేసాను. నాకు ఇలా టెక్నాలజీని పరిచయం చేయడం కొత్తేమీ కాదు. చూడాలని ఉందితో డిటిఎస్ ని పరిచయం చేశా, సైనికుడుతి డిఐని పరిచయం చేశా, ఇప్పుడు 3డిని పరిచయం చేసాను. ఓవరాల్ గా 3డి వెర్షన్ నా సరదా తీర్చేసింది.

ప్రశ్న) సినిమా కథ రాసుకున్నప్పుడే ఈ నటీనటుల్ని అందరినీ అనుకున్నారా.? లేక మధ్యలో మార్చారా.?
స) సినిమా కథ సిద్దం అవుతున్నప్పుడే చాలా మంది నటీనటులను అనుకుంటూ వచ్చాను. రుద్రమదేవి అంటే అనుష్క అనుకున్న కానీ రుద్రమదేవి పాత్రలో అరుంధతి అనే పాత్రనే చూస్తారేమో అన్న భయంతో కాస్త ఆలోచనలో పడ్డాను. అప్పుడు పబ్లిక్ నుంచి అనుష్క అయితేనే బాగుంటుందనే వార్తలు వచ్చాయి. దాంతో పబ్లిక్ నుంచే అనుష్కని ఫైనలైజ్ చేసాను. ఇక నిత్యా మీనన్ పాత్ర కోసం మొదట వేరే వాళ్ళని అనుకొని 15 రోజులు షూట్ చేసాం. కానీ అది నాకు సంతృప్తినివ్వలేదు. ఆ తర్వాతే ఆ పాత్రకి నిత్యా మీనన్ ని అనుకొని అప్రోచ్ అయ్యాను. తను కథ వినగానే బాగా నచ్చి వెంటనే డేట్స్ ఇచ్చింది. మిగతా అందరూ ముందు అనుకున్నావారే..

ప్రశ్న) అనుష్క మీరు రాసుకున్న కథకి, రుద్రమదేవి పాత్రకి ఎంత వరకూ న్యాయం చేసింది.? మిగిలిన నటీనటుల గురించి చెప్పండి.?
స) రుద్రమదేవి అనుకోగానే మొదట మదిలోకి వచ్చింది అనుష్క.. తను రుద్రమదేవి పాత్రలో జీవించింది. అసలు రుద్రమదేవి అంటే అనుష్కలానే ఉంటుంది, అనుష్కలానే బిహేవ్ చేసుండేదేమో అని మీరు కన్విన్స్ అయ్యేలా చేసింది. రానా కూడా చాలా బాగా చేసాడు. అల్లు అర్జున్ ఎపిసోడ్ ఆడియన్స్ కి ఒక స్పెషల్ పాకేజ్.

ప్రశ్న) రుద్రమదేవి పాత్రలో అనుష్కని గ్లామరస్ గా చూపడానికి గల కారణం ఏమిటి.?
స) ఇందులో మొదట నేను ఒకటి చెప్పుకున్నాను. రుద్రమదేవి అనేది చారిత్రాత్మక పాత్ర, పురాణ పాత్ర కాదు అనగా దేవత కాదు. అలాగే రుద్రమదేవి అంటే అందరికీ వీరణారిగానే తెలుసు, కానీ తన యవ్వన దశలో తనకొక లైఫ్ ఉంది. ఆ లైఫ్ ఎలా ఉండేది అని మాత్రమే చెప్పాను. అలా అని వల్గర్ గా చూపలేదు. ఎలా అంటే నీతా లుల్లా లాంటి డిజైనర్ అప్పటి కాకతీయులు ఎలాంటి బట్టలు వేసుకునే వారు, వారి సాంప్రదాయ కట్టుబాట్లు ఎలా ఉండేవి అనేది తెలుసుకొని అలాంటి బట్టలనే డిజైన్ చేసాం. అలానే చూపించాం తప్ప గ్లామరస్ గా చూపించాలని చేసిన ప్రయత్నం అయితే కాదు.

ప్రశ్న) గోనగన్నా రెడ్డి పాత్ర కోసం మహేష్ బాబు, ఎన్.టి.ఆర్ లాంటి పేర్లు వినిపించాయి. చివరిగా అల్లు అర్జున్ ఎలా బోర్డ్ లోకి వచ్చాడు.?
స) నేను అనుకుంటున్న రుద్రమదేవి కథ గురించి మహేష్ బాబుకి, ఎన్.టి.ఆర్ కి తెలుసు. కలిసినప్పుడల్లా ఈ సినిమా గురించి ఆసక్తికరంగా మాట్లాడుకునే వాళ్ళం. అందుకే వాళ్ళు ఈ సినిమాకి ఏం సాయం కావాలన్నా చేస్తాం అని చెప్పారు. కానీ సినిమా తీసే టైంకి వారిద్దరికీ టైం కుదరకపోవడం వల్ల చేయలేదు. వరుడు లాంటి ఫ్లాప్ ఇచ్చినా అల్లు అర్జున్ నా దగ్గరికి వచ్చి మీ సినిమాకి నా నుంచి ఏం సాయం కావాలన్నా తీసుకోండి, గోనగన్నారెడ్డి అనే పాత్ర అంటే నాకు చాలా ఇష్టం, నేను సరిపోతా అంటే ఒక్క కాల్ చేయండి, వచ్చేస్తా అని అన్నాడు. ఆ విషయంలో తనకి హ్యాట్సాఫ్ చెప్పాలి. అప్పుడు ఆలోచించి తనకి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని అల్లు అర్జున్ ని ఫైనలైజ్ చేసాం.

ప్రశ్న) గోనగన్నారెడ్డి పాత్రకి అల్లు అర్జున్ ఓకే అయ్యాక పాత్రలో ఏమన్నా మార్పులు చేసారా.? అలాగే ఆ పాత్ర ఎలా ఉంటుంది.?
స) అల్లు అర్జున్ ని అనుకున్నాక తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేసాను. అంతే కానీ తనకోసం తన పాత్రని పెంచడం, తగ్గించడం, పాత్ర తీరుని మార్చలేదు. ఈ సినిమాలో అతనొక బందిపోటుగా కనిపిస్తాడు. సుమారు 50 నిమిషాల పాటు సినిమాలో కనిపిస్తాడు. ఇక్కడ అల్లు అర్జున్ ని ఒక విషయంలో మెచ్చుకోవాలి. బన్ని ఒక సోలో హీరోగా సినిమా చేస్తున్నాడు అంటే కచ్చితంగా కొన్ని అంశాలు ఉండాలి అనే లిమిటేషన్స్ ఉంటాయి. కానీ అలాంటి లిమిటేషన్స్ లేకుండా ఈ సినిమాలో చేసాడు. అది సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. ఒక్కటి మాత్రం చెప్పగలను ఈ సినిమాలో అల్లు అర్జున్ ని చూసాక చాలా మంది స్టార్ హీరోలు ఇలాంటి లిమిటేషన్స్ లేని పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

ప్రశ్న) రుద్రమదేవి కథని ఉన్నది ఉన్నట్టుగా చెప్పారా లేక దానికి సినిమాటిక్ అంశాలను ఏమన్నా జత చేసి తీశారా.?
స) ఈ విషయంలో ఒకటి చెప్పాలండి.. చరిత్రలో ఎక్కడా ఇదీ రుద్రమదేవి కథ అని పర్ఫెక్ట్ గా లేదండీ.. ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంది. అందుకే మేము ఒక స్పెషల్ టీం ని పెట్టి మొత్తం రీసర్చ్ చేసి బుక్స్ ని కాకుండా అసలైన కాకతీయుల శిలాపలకాల నుంచి సేకరించిన విషయాలతో కథని సిద్దం చేసాం. అలా దొరికిన సమాచారంలో చాలా చోట్ల లింక్స్ లేవు. అక్కడ మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి లింక్ పెడితే బాగుంటుందని ఆలోచించి రాసాను. అది బాగుందా లేదా అని కాకతీయ యూనివర్సిటీ, చరిత్ర రీసర్చ్ చేసిన ప్రముఖుల ముందు ఉంచి వారు పర్ఫెక్ట్ గా ఉంది అన్నాకే సెట్స్ పైకి తీసుకెళ్ళాం.

ప్రశ్న) రుద్రమదేవి జీవితం మొత్తాన్ని ఈ కథలో చెప్పారా.? లేక ఏదైనా ప్రత్యక ఘట్టాన్ని మాత్రమే చెప్పారా.?
స) చెప్పాలంటే రుద్రమదేవి జీవితం మొత్తాన్ని చెప్పలేదు. రుద్రమదేవి జననం నుంచి సినిమాని మొదలు పెట్టి తన బాల్యం, యవ్వనం, ప్రేమకథతో పాటు తన జీవితంలో వచ్చిన ఒక భారీ ఘట్టంతో సినిమాని ముగించాం.

ప్రశ్న) బాహుబలి తర్వాత వస్తుండడం వలన ఈ సినిమాని ఆ సినిమాతో పోల్చుకొని ఆడియన్స్
సినిమా చూస్తారు. దానివల్ల సినిమాకి హైప్ ఎక్కువ ఉంది. ఆ హైప్ సినిమాకి ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నారా.?
స) బాహుబలికి ఇండియన్ ఫస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ అనే ఒక ట్యాగ్ లైన్ ఉంది. దాంతో అది అందరినీ ఆకర్షించింది. అలాగే అది పూర్తి జానపద చిత్రం. కానీ రుద్రమదేవి హిస్టారికల్ సినిమా. 800 ఏళ్ళ క్రితం వచ్చిన జరిగిన కథని తెరపై చూపిస్తున్నాను. ఆడియన్స్ కి క్లారిటీగా తెలియాల్సింది, అది వేరే జోనర్ ఫిల్మ్, ఇది వేరే జోనర్ ఫిల్మ్. అందుకే రెండు సినిమాలని పోల్చి చూడకూడదని చెబుతున్నాను. నా వరకూ ఆడియన్స్ కి ఆ విషయంలో బాగా క్లారిటీ ఉందని అనుకుంటున్నాను.

ప్రశ్న) ‘రుద్రమదేవి’కి సీక్వెల్ గా ‘ప్రతాప రుద్రుడు’ సినిమా చేస్తున్నారని అన్నారు. అది ఎంతవరకూ నిజం.?
స) రుద్రమదేవి నుంచి కాకతీయ రాజ్యాన్ని పరిపాలించిన కాలంలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి. రుద్రమదేవి తర్వాత కాకతీయ రాజ్యాన్ని పరిపాలించిన చివరి రాజు ప్రతాప రుద్రుడు. అతని కథ తీయాలని ఉంది. కానీ ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి వచ్చే ఆదరణని బట్టి ఆ సినిమా గురించి ఆలోచిస్తాను.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి గుణశేఖర్ కి రుద్రమదేవి మంచి విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పాం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు