ఇంటర్వ్యూ : – రకుల్ ప్రీత్ సింగ్ – ఈ ఏడాది నావి ఐదు సినిమాలు రిలీజ్ అవుతాయి !

Published on Feb 11, 2019 1:41 pm IST

తమిళ్ దర్శకుడు రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వంలో తమిళ్ స్టార్ కార్తీ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘దేవ్‌’. ఈ సినిమాకి హరీష్‌ జయరాజ్‌ సంగీతమందిస్తుండగా.. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకువస్తున్నారు. కాగా ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుంది. కాగా ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

‘వాలెంటైన్స్ డే’ రోజునే మీ సినిమా విడుదల అవుతుంది. ఈ డేట్ నే రిలీజ్ చెయ్యాలని ముందే ప్లాన్ చేశారా ?

లేదు, మా సినిమా షెడ్యూల్స్ ప్రకారం మేం షూట్ చేసుకుంటూ వెళ్ళాము. రిలీజ్ డేట్ కూడా ముందే అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ ఫోన్ అవుతూ.. ఫైనల్ గా ‘వాలెంటైన్స్ డే’ రోజునే దేవ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సంవత్సరం ‘వాలెంటైన్స్ డే’ని మీరు ఎలా జరుపుకోబోతున్నారు ?

నేను ఫస్ట్ దేవ్ విడుదల కోసమే ఎదురుచూస్తున్నాను. దేవ్ సక్సెసే నా ‘వాలెంటైన్స్ డే’ సెలెబ్రేషన్స్. అయినా వాలెంటైన్స్ డే అనేది ఒకరోజు జరుపుకొని మర్చిపోయేది కాదు, ప్రతి రోజూ ఏడాది పొడవునా జరుపుకోవాలి. ఈ సారి ‘వాలెంటైన్స్ డే’కి మా అమ్మానాన్నలు నాతోనే ఉంటున్నారు. మేము దేవ్ సినిమాని మొదటి రోజు మొదటి షో చూడటానికి వెళ్తున్నాం.

2018లో మీ సినిమాల ప్రభావం ఎక్కడా కనిపించలేదు. సినిమా అవకాశాలు తగ్గాయని వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు ?

2018లో నాకు ఏ సినిమా అవకాశాలు రాలేదని.. నాకు ఇక సినిమాలు లేవని.. ఇలాంటి వార్తలు నేను కూడా చాలా చదివాను. నిజానికి నేను తెలుగులో ఎక్కువ సినిమాలు చెయ్యలేదు. కానీ మూడు తమిళ్ సినిమాలు మరియు రెండు హిందీ సినిమాలు చేస్తున్నాను. వాటి షూటింగ్ లో చాలా బిజీ బిజీగా ఉన్నాను. ఆ ఐదు సినిమాలు ఈ ఏడాదిలోనే వరుసగా రిలీజ్ అవుతాయి.

దేవ్ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?

దేవ్ సినిమానే ప్రత్యేకంగా ఉంటుంది. నేను చాలా ఆధునికరమైన అమ్మాయి పాత్రను పోషిస్తున్నాను, చాలా మొండి పట్టుదలగల అమ్మాయిగా కనిపించబోతున్నాను. నాకు ఈ పాత్ర చాలా కఠినమైన పాత్ర అనే చెప్పాలి. కానీ నా పరిధిలో నేను ఈ పాత్రలో ఉత్తమంగా చెయ్యటానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను.

దేవ్ లో కార్తీతో పని చెయ్యడం ఎలా అనిపించింది ?

కార్తి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఒక్కమాటలో తను ఒక అద్భుతమైన నటుడు. నాకు తనతో ఇది రెండో సినిమా. ఈ సినిమాలో మా పాత్రలు చాలా భిన్నంగా ఉంటాయి. తనెప్పుడూ తోటి నటీనటులను బాగా సపోర్ట్ చేస్తాడు. తనతో ఇంకా ఎక్కువ సినిమాలు చెయ్యాలని ఉంది.

మీరు ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవ్వనున్నారు ?

‘వెంకీ మామ’ సినిమా షూటింగ్ తరువాతి వారం నుంచి ఉంటుంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ లో నేను కూడా నటిస్తున్నందుకు అందులో చాలా మంచి పాత్రలో కనిపించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ‘వెంకీ మామ’తో పాటు వచ్చే వారం నుండి నా కొత్త హిందీ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమవుతుంది.

సంబంధిత సమాచారం :