ఇంటర్వ్యూ : రామ్ చరణ్ – రీమేక్స్ చేయడం తప్పని నేననుకోను!

7th, December 2016 - 07:49:18 PM

ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’, సినీ అభిమానుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ శుక్రవారం భారీ ఎత్తున విడుదలవుతోన్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన గత చిత్రం ‘బ్రూస్‌లీ’ పరాజయం పాలవ్వడంతో రామ్ చరణ్ సైతం ధృవపై భారీ ఆశలు పెట్టుకున్నారు. సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా చరణ్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) సినిమా రిలీజ్‌కు దగ్గరైంది. ఎలా ఉంది?

స) టెన్షన్‌గా ఉంది. ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా టెన్షన్‌గా ఉంటుంది. ధృవ కంటెంట్ బలమైనది కాబట్టి కాస్త కాన్ఫిడెంట్‌గానే ఉన్నా, మళ్ళీ రీమేక్ కావడంతో అదొక టెన్షన్ ఉంది. రేపు సినిమా విడుదలయ్యాక గానీ ఈ టెన్షన్ పోదు.

ప్రశ్న) ‘బ్రూస్‌లీ’ ఫ్లాప్ తర్వాత రీమేక్ ఎంచుకోడానికి కారణం? సక్సెస్ గ్యారంటీ అన్న నమ్మకమా?

స) సక్సెస్ గ్యారంటీ అన్నదేం లేదు. నాకు ఈ కథ బాగా నచ్చింది. ఎన్.వీ.ప్రసాద్ గారు ఈ కథ పట్టుకొచ్చి నేను చేస్తే బాగుంటుంది అన్నప్పుడు నాకు కూడా రిఫ్రెషింగ్‍గా అనిపించింది. ఇమేజ్ నుంచి బయటకొచ్చి, కొత్తగా కమర్షియల్ సినిమా చేస్తే బాగుంటుందన్నప్పుడు ఈ కథ దొరికింది. ఇదే కరెక్ట్ సినిమా అనుకొని చేసేశా. నన్నడిగితే ఒక భాషలో సక్సెస్ అయిన సినిమాను మరో భాషలో ప్రేక్షకులకు అందించాలన్న ఆలోచనలో తప్పులేదు. రీమేక్స్ చేయడం తప్పని నేననుకోను.

ప్రశ్న) దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మళ్ళీ రీమేక్స్ చేయను అన్నారు. మీకెలా అనిపించింది రీమేక్ చేయడం?

స) (గట్టిగా నవ్వుతూ..) సూరీ అలా అన్నాడా? ఓకే. నిజానికి మొదట్లో సూరీ నాతో ఒక స్ట్రైట్ సినిమా చేద్దామనే అనుకున్నాడు. నేనే ఈ రీమేక్ గురించి చెప్పా. నా కోసమే ఒప్పుకున్నాడు. ఆ తర్వాత చాలా హోమ్‌వర్క్ చేసి, మా అందరి కంటే ఎక్కువగా తనే ఓన్ చేసుకొని సినిమా చేశాడు. ధృవకు మేజర్ అస్సెట్ అంటే సూరీ మేకింగ్ అనే చెబుతా. కాకపోతే రీమేక్స్‌లో నటుడికైనా, దర్శకుడికైనా ఒత్తిడి ఉంటుంది. ఒరిజినల్‌ని అందుకోవాలన్న ఆలోచన ఒకటి తిరుగుతూ ఉంటుంది. అదంతా ఇబ్బందితో కూడుకున్న వ్యవహారమే కాబట్టి ఆ ఉద్దేశంలో సూరీ మళ్ళీ రీమేక్ చేయనన్నాడేమో! నాకు కథ బాగుంటే రీమేక్స్ చేయడంలో అభ్యంతరం లేదు.

ప్రశ్న) ‘ధృవ’ కోసం ఒరిజినల్ కథలో ఏమైనా మార్పులు చేశారా? విలన్ క్యారెక్టర్ తగ్గించి, హీరో క్యారెక్టర్ పెంచడం లాంటివి చేశారని వినిపించింది?

స) ఒరిజినల్ కథ అలాగే ఉంటుంది. తెలుగు సెన్సిబిలిటీస్‌కి తగ్గట్టు అక్కడక్కడా కొన్ని మార్పులవీ చేశాం. హీరో, విలన్ రెండూ కథను నడిపించే పాత్రలు. కథ ఎలా ఉంటుందో, ఈ పాత్రలూ అలాగే ఉంటాయి. తెలుగు వర్షన్ కోసం హీరో క్యారెక్టర్ పెంచడం, విలన్‌ది తగ్గించడం లాంటివేమీ చేయలేదు. మీరు సినిమా చూసినా కథ, ఆ రెండు పాత్రలూ అన్నీ ఒకేసారి కనిపిస్తాయి.

ప్రశ్న) తమిళంలో విలన్‌ రోల్ చేసిన అరవింద్ స్వామినే ఇక్కడా తీసుకున్నారు. ముందు వేరే ఎవరి పేరైనా ఆలోచించారా?

స) లేదు. మాకైతే వేరొక ఆప్షన్ కనిపించలేదు. తని ఒరువన్‌లో అరవింద్ స్వామి అద్భుతంగా నటించారు. ఇక్కడా ఆయనైతేనా బాగుంటుందని అనుకున్నాం. సీనియర్ యాక్టర్ కావడంతో మొదట్లో కాస్త భయపడ్డా. ఆ తర్వాత మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామంటే, హీరో-విలన్ సీన్ ఛాలెంజ్ సీన్ వస్తే చేయడానికి కష్టపడేంత!

ప్రశ్న) మీ కెరీర్‌కి ఇది మేకోవర్ సినిమా అనుకుంటున్నారు?

స) నేనైతే అదే అనుకుంటున్నా. కాస్త కొత్తగా ప్రయత్నించాలనే ఈ సినిమా ఎంపిక చేసుకున్నా. లుక్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా, డిఫరెంట్ కమర్షియల్ సినిమాను ఎంచుకోవాలన్న ఆలోచనైనా అన్నీ ఇమేజ్ చేంజ్ కోసమే! ఆడియన్స్ కోరుకుంటున్న ఆ కొత్తదనం ఈ సినిమాతో అందించాలనుకుంటున్నా.

ప్రశ్న) ‘ధృవ’ బాక్సాఫీస్ దగ్గర ఇంత వసూలు చేస్తుందని ఇప్పట్నుంచే లెక్కలు వస్తున్నాయి. వాటి గురించి ఏమంటారు?

స) కలెక్షన్స్ బాగుంటే మంచిదే కదా! అందరూ సినిమా బాగా వసూళ్ళు సాధించాలనే ఎవ్వరైనా కోరుకుంటారు. నోట్ల రద్దు ఎఫెక్ట్ ఇంకా ఉన్న రోజుల్లో వస్తోన్న పెద్ద సినిమా మాదే. చూద్దాం.. ఎలా ఉంటుందో!

ప్రశ్న) చిరంజీవి గారి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం 150 కోసం నిర్మాతగా మారారు. నిర్మాతగా ప్రయాణం ఎలా ఉంది?

స) బాగుంది. నా వెనుక వీవీ వినాయక్ గారు ఉన్నారు కాబట్టి సరదాగా పూర్తి చేసేశా. రేపటితో ఆ సినిమా పూర్తవుతుంది. నిర్మాతగా నా మొదటి సినిమా రెడీ అవుతోందన్నమాట!

ప్రశ్న) తదుపరి సినిమా గురించి చెప్పండి? భవిష్యత్‌లో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?

స) సుకుమార్‌తో ఓ సినిమా ‘ఖైదీ నెం 150’ విడుదలయ్యాక మొదలవుతుంది. ఇక ఇలాంటి సినిమాలే చేయాలని గిరి గీసుకోవడం లేదు. డిఫరెంట్ జానర్స్‌లో డిఫరెంట్ కమర్షియల్ సినిమాలు చేయాలనుంది.