ఇంటర్వ్యూ : సురేందర్ రెడ్డి – మళ్ళీ రీమేక్స్ జోలికి వెళ్ళను!

6th, December 2016 - 05:04:18 PM

surender-reddy
కమర్షియల్ సినిమాల్లో దర్శకుడు సురేందర్ రెడ్డి తనదైన మేకింగ్‌తో ఒక కొత్త పంథా సృష్టించారు. ‘అతనొక్కడే’, ‘కిక్’, ‘రేసుగుర్రం’ లాంటి అదిరిపోయే కమర్షియల్ సినిమాలను అందించిన ఆయన, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేసిన సినిమాయే ‘ధృవ’. ఈ శుక్రవారం (డిసెంబర్ 9న) భారీ ఎత్తున సినిమా విడుదలవుతోన్న సందర్భంగా సురేందర్ రెడ్డితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) కెరీర్‌లో మొదటిసారి ఒక రీమేక్ చేశారు. ‘కిక్ 2’ తర్వాత ఎందుకు రీమేక్ వైపుకు వెళ్ళారు?

స) రీమేక్ సినిమా చేయాలన్నది నా ఆలోచన కాదు. చరణ్‌తో కలిసి ఒక సినిమా చేయాలని ఆయనతో ట్రావెల్ చేస్తూ వస్తున్నా. కొన్ని కథలు అనుకున్నాం కానీ, చరణ్ అదే సమయంలో ‘తని ఒరువన్’ చూసి, ఇది రీమేక్ చేద్దాం అన్నారు. రీమేక్ అంటే నేనూ మొదట భయపడ్డా. ఒక రెండు, మూడు రోజులు టైమ్ తీసుకొని ఓకే చెప్పా.

ప్రశ్న) ఒక భాషలో బ్లాక్‌బస్టర్ అయిన సినిమాను రీమేక్ చేయడం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?

స) రీమేక్స్ అందరూ అనుకునేంత సులువు కాదు. మనం సొంతంగా తయారు చేసిన కథలు ఓపెన్ స్పేస్‍లో మంచో, చెడో మన క్రియేటివ్ యాంగిల్‌లో చేసేయొచ్చు. రీమేక్స్ విషయంలో మాత్రం అన్నీ పద్ధతిగా, ముందే తెలిసిన ఫార్మాట్‌లో, మన క్రియేటివిటీ జోడించి తీయాలి. అది నాకైతే చాలా కష్టమనిపించింది. ధృవని ఎంత ఎంజాయ్ చేశానో, అంత కష్టపడ్డా కూడా. చరణ్ గారితోనే ఓ సారి చెప్పానిది, ‘మళ్ళీ రీమేక్స్ జోలికి వెళ్ళన’ని. పూర్తిగా మార్చుకోగలిగే అవకాశం ఉన్న సినిమాలైతే తప్ప రీమేక్స్ చేయను.

ప్రశ్న) ఒరిజినల్ వర్షన్‌‌కు మీరు చేసిన మార్పులేంటి?

స) పెద్దగా మార్పులేమీ చేయలేదు. నాకు కథలో ఎక్కడెక్కడ మార్పులు చేయొచ్చు అనిపించిందో అవి టీమ్‌తో డిస్కస్ చేసి చేశా. అదేవిధంగా తని ఒరువన్ డైరెక్టర్ మోహన్ రాజాతో కూడా ఈ మార్పుల గురించి మాట్లాడా. తమిళ సినిమాలో ఉండే అసలైన కంటెంట్‌ను మాత్రం ఎక్కడా మార్చలేదు. అలా చేస్తే సినిమాయే పాడవుతుంది.

ప్రశ్న) రామ్ చరణ్‌తో కలిసి పనిచేయడం గురించి చెప్పండి?

స) రామ్ చరణ్ చాలా కాలంగా పరిచయం. నన్నడిగితే ఆయనంత హానెస్ట్ పర్సన్‌ని నేనెక్కడా చూడలేదు. ఒక మాట ఇచ్చాడంటే, మనం మర్చిపోయినా, ఆ మాట మీదే నిలబడి ఉంటాడు. సినిమా విషయానికొస్తే, ‘ధృవ’ కోసం నేను ఓ కొత్త లుక్ కోరుకుంటున్నా అని చెప్పా. టీమ్‌తో డిస్కస్ చేసి, కష్టపడి ఆ సిక్స్‌ప్యాక్ లుక్ రెడీ చేశాడు. అతడి డెడికేషన్ చూస్తే ఎవరికైనా ఇంకా బాగా పనిచేయాలన్న ఉత్సాహం వస్తుంది.

ప్రశ్న) నాటితరం హీరో అరవింద్ స్వామి మొదట్లో ఈ సినిమాకు ఓకే చెప్పలేదట? మీరే ఆయనను ఒప్పించారట?

స) లేదు. ఇలా ‘తని ఒరువన్’ రీమేక్ చేస్తున్నామని చెప్పి, నేను చేసిన మార్పులు చూపించిన వెంటనే, ఒక్క మాట మాట్లాడకుండా సినిమా ఒప్పుకున్నారు. ఆయన ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తారని చెప్పగలను. రీమేక్ చేస్తున్నప్పుడు నాకు ఎలా ఉండేదో, ఆయనా అలాగే ఫీల్ అయ్యేవాడు. మొదటిరోజు షూట్‌లో “ఏంటిది సూరీ.. అదే చేయాల్సి వస్తోంది” అంటూ నవ్వారు. ఆ తర్వాత నాలుగు రోజులకు ఆయనా ఫ్రెష్ సినిమా అన్నట్లు చేసేశారు.

ప్రశ్న) కొత్త వాళ్ళైన హిపాప్ థమిజానే సంగీత దర్శకులుగా ఎంపిక చేయడం రిస్క్ అనిపించలేదా?

స) నేనైతే ఎప్పుడూ రిస్క్ అనుకోలేదు. ‘తని ఒరువన్‌’లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రీ-రికార్డింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అది చూసిన తర్వాత వేరొకరు ఎందుకని వారినే (హిపాప్ థమిజా సంగీత ద్వయం – జీవా, ఆది) సంగీత దర్శకులుగా ఎంపిక చేశాం. ధృవకి కూడా అద్భుతమైన వర్క్ చేశారు.

ప్రశ్న) మేకింగ్ విషయంలో మీకు ఓ మంచి పేరుంది. రీమేక్ చేయడంతో మీ మార్క్ ఉండదని ఇబ్బందిగా ఫీలయ్యారా?

స) అలాంటిదేమీ లేదు. ఒక కంటెంట్‌ను మనం అర్థం చేస్కున్న విధానానికి తగ్గట్టు ఒక మేకింగ్‍ని ఫాలో అవుతాం. ఇక్కడ తప్పకుండా నా మార్క్ ఉంటుంది. చాలామంది వేరేవారి కథలను తీయడం కూడా ఈజీ అనేస్తారు. అందులో కూడా మేకింగ్ పరంగా నేను ఏదొకటి చేస్తేనే కదా సినిమా వచ్చేది.

ప్రశ్న) పూర్తిగా సినిమా చూశాక ఎలాంటి ఫీలింగ్‌తో ఉన్నారు?

స) చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పటికే సక్సెస్ అయిన కంటెంట్ కాబట్టి సాధారణంగా అన్ని సినిమాలతో పోల్చితే ఈ సినిమా విషయంలో కాస్త ఎక్కువ కాన్ఫిడెంట్‌గా ఉన్నా. రేపు ప్రేక్షకులు చూసి బాగుందంటారన్న నమ్మకంతోనే ఉన్నా.

ప్రశ్న) నిఖిల్ గౌడతో ఓ సినిమా చేస్తున్నారని వినిపించింది. తదుపరి సినిమా ఏంటి?

స) నిఖిల్ గౌడ సినిమా చేయట్లేదు. ఆ ఆఫర్ అయితే ఉంది కానీ నేనది చేయట్లేదు. చిరంజీవి గారితో ఓ సినిమాకు డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ గ్యాప్‌లో ఇంకేదైనా సినిమా చేస్తానా అన్నది చెప్పలేను. ప్రస్తుతానికైతే ధృవ రిలీజ్ కోసం వెయిటింగ్! (నవ్వుతూ..)