ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్ విషయంలో రీసెంట్ గా ఇంటర్నెట్ లో ఎలాంటి దారుణ ఘటన జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే ఆమెపై ఏఐ తో చేసిన వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించి ఏ ఆడవారి విషయంలో ఇలాంటివి జరగకూడదు అని తనవంతు స్టాండ్ తీసుకున్నారు.
అయితే అక్కడ నుంచి మరింత మంది తారలు తారక్ తో పాటు జాన్వీ విషయంలో ఆమెకి అండగా నిలిచారు. ఇక ఈ సున్నితమైన అంశంపై జాన్వీ కపూర్ కూడా తన స్పందనను తెలియజేసింది. “మహిళలను ఒక వస్తువులా చూడటానికి, వారి అనుమతి లేకుండా కల్పిత విషయాలను వ్యాప్తి చేయడానికి టెక్నాలజీని నేరపూరితంగా దుర్వినియోగం చేయడం తీవ్రమైన ఉల్లంఘన ఒక్కటే కాదు, లైంగిక దాడితో సమానం. నా పరిశ్రమలోని దాదాపు ప్రతి మహిళ దీనికి సంబంధించి ఏదో ఒక రూపంలో ఎదుర్కొంది, మరియు ప్రతిచోటా మహిళలు దీనికి గురవుతూనే ఉన్నారు. అని ఆమె తెలిపింది.
అలాగే ఒక మహిళ శరీరానికి ఇవ్వాల్సిన గౌరవం అనేవి మానవత్వానికి సంబంధించిన అత్యంత ప్రాథమిక అంశాలు కావాలి అని ఆమె సూచించింది. అలాగే తనపై జరిగిన వికృత చేష్ట విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇంతటి బలమైన వైఖరిని తీసుకున్నందుకు ఎన్టీఆర్ సర్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదాలు, సర్. లక్షలాది మంది ఆదర్శంగా భావించే ఒక వ్యక్తి, నేరుగా తనకు సంబంధం లేని విషయంపై గళం విప్పినప్పుడు, ఇలాంటి ప్రవర్తనను ఏదో ఒక స్థాయిలో ఎదుర్కొన్న ప్రతి మహిళకూ అది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అని తెలిపింది.
తనతో పాటుగా ఈ భావనను మరింతగా విస్తరించి, ఇలాంటి అనైతిక చర్యలు మరియు మనస్తత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చినందుకు చిరంజీవి సర్, విజయ్ మరియు ఖుష్బూ మేడమ్ లకు కూడా నా ధన్యవాదాలు అని జాన్వీ తెలిపింది. దీనితో తన పోస్ట్ వైరల్ గా మారింది.



