’శభాష్ నాయుడు’ గా వస్తున్న కమల్ హాసన్..!

’శభాష్ నాయుడు’ గా వస్తున్న కమల్ హాసన్..!

Published on Apr 30, 2016 1:02 PM IST

kamal
నటనలో దేశవ్యాప్తంగా తనదైన శైలిని చాటి చెప్పిన నటుల్లో కమల్ హాసన్ ఒకరు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన అభిరుచిని చాటుకున్నారు. ఇప్పుడు ఆయన ర‌జినీ, శంక‌ర్ కాంబినేష‌న్ లో వస్తోన్న రోబో-2 సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో క‌లిసి తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ సినిమాను ప్రఖ్యాత మళయాల దర్శకుడు టీ.కే. రాజీవ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నిన్న (29న) చెన్నైలో ప్రారంభం అయ్యింది. ఈ సినిమాకి తెలుగు, తమిళ భాషల్లో ’శభాష్ నాయుడు’ అన్న పేరు పెట్టగా హిందీ లో ’శభాష్ కుండు’ అని పేరు పెట్టారు.

ఈ సినిమాకు ఆ పేరు పెట్టడానికి స్ఫూర్తి మాత్రం దశావ‌తారం సినిమాలో క‌మ‌ల్ పోషించిన తొమ్మిది పాత్ర‌ల్లో ఒకటైన పోలీస్ ఆఫీస‌ర్ నాయుడు పాత్ర అని తెలిసింది. క‌మ‌ల్ గెట‌ప్ తో పాటు శ్రీకాకులం యాసలో ఆయ‌నకు యస్. పి. బాల‌సుబ్ర‌మ‌ణ్యం చెప్పిన డ‌బ్బింగ్ ఆ పాత్రకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే పాత్ర‌ను ప్రధాన పాత్రగా తీసుకుని ఓ పూర్తి స్థాయి సినిమానే చేయ‌బోతున్నాడు కమల్ హాసన్. క‌మ‌ల్ మోటార్ సైకిల్ న‌డుపుతుండగా వెనుక కూర్చున్న బ్ర‌హ్మానందం బెంబేలెత్తిపోతున్నట్లు గా ఉన్న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆకట్టుకుంది. కమల్ కూతురు శృతి హాసన్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ క‌మ‌ల్ హాసన్ కు జోడీగా నటిస్తోంది. షూటింగ్ ఎక్కువ భాగం విదేశాల్లోనే చేయ‌బోతున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు