న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరో నాని చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నామని, సెప్టెంబర్ 23 రాత్రి నుంచే థియేటర్లలో పండుగ వాతావరణం మొదలవుతుందని నాని స్పష్టం చేశారు.
వేడుకలో నాని మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారని తెలిపారు. “నాతో పాటు కలిసి నటించిన ‘సవారీ గ్యాంగ్’ అందరి పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. దర్శకుడు శ్రీకాంత్‌కి నాకు మధ్య ఉన్నది అన్నదమ్ముల బంధం. తన పనితనం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంటుంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ సొంత సినిమాగా భావించి శ్రమించారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, ఈ నెల 24న వారి కళ్లల్లో ఆనందం మరింత రెట్టింపవుతుంది” అని నాని పేర్కొన్నారు.
నటీనటులు, సాంకేతిక బృందంపై ప్రశంసలు
సినిమాలోని కీలక పాత్రల గురించి నాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంపూర్ణేష్ బాబు పాత్రను ఎవరూ ఊహించలేరని, సోనాలి కులకర్ణి పాత్ర ప్రతి ఒక్కరికీ బాగా నచ్చుతుందని చెప్పారు. సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంపాక్ట్ ఈ తరం ప్రేక్షకులకు ఈ చిత్రంతో బలంగా గుర్తుండిపోతుందని నాని తెలిపారు. ఇక అనిరుధ్ రవిచందర్ ఈ సినిమా కోసం అద్భుతమైన సంగీతం అందించారని, థియేటర్లు డ్యాన్స్ ఫ్లోర్లా మారిపోతాయని చెప్పారు.
నెగెటివిటీని పట్టించుకోను: నాని
ఈ సందర్భంగా జీవితంలో ఎదుగుదల, చుట్టూ ఉండే పరిస్థితులపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మనం ఎదుగుతున్నప్పుడు పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా పెరుగుతుంది. అయితే ఆ నెగెటివిటీని పట్టించుకోకుండా పాజిటివ్‌ని పట్టుకుని ముందుకు సాగాలి. మనం గెలవాలని కోరుకునే వారు ఎంతమంది ఉంటారో, ఓడిపోతే చూద్దామనుకునే వారు కూడా అంతేమంది ఉంటారు. ఓడిపోవాలని చూసేవారిని ఓడించడానికి నేను ప్రయత్నించడం లేదు. కానీ నన్ను నమ్మి, నేను గెలుస్తానని ఆశించే వారిని గెలిపించడానికి మాత్రమే నిరంతరం కష్టపడుతూనే ఉంటాను. ప్రేక్షకులు నాకు 100 ఏళ్లకు సరిపడా ప్రేమను అందించారు” అని నాని ఎమోషనల్ అయ్యారు.
సినిమా మొదలైన వెంటనే ప్రేక్షకులు కథతో కనెక్ట్ అయిపోతారని చెబుతూ.. “సినిమా స్టార్ట్ కాగానే జడలకి మీకు ఒక లాక్ పడుతుంది. ఆ తర్వాత అంటుకునేది వైల్డ్ ఫైర్. శ్రీకాంత్ మాటల్లో చెప్పాలంటే థియేటర్లు తగలబడిపోతాయి.. ఇది జడల్ గానీ వాదా. నేరుగా థియేటర్లలోనే కలుసుకుందాం” అంటూ నాని తన స్పీచ్‌ను ముగించారు.


