మాస్ రాజా పక్కన నటించనున్న నివేత !

రవితేజ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్ సినిమాలో నటిస్తున్నాడు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ చెయ్యబోయే చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఏప్రిల్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ నివేత థామస్ నటించే అవకాశం ఉంది. ఈమె ‘నేల టికెట్’ సినిమాలోనే నటించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా చెయ్యలేకపోయింది.

ఈ మూవీ కోసం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే డిఫరెంట్ టైటిల్ పరిశీలనలో ఉంది. మూడు విభిన్న పాత్రల్లో రవితేజ కనిపించబోతున్నట్లు సమాచారం. ‘నీకోసం, వెంకి, దుబాయ్ శ్రీను’ సినిమాల తరువాత రవితేజ, శ్రీను వైట్ల చెయ్యబోతున్న సినిమా ఇదే అవ్వడం విశేషం. కామెడి ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు దర్శకుడు శ్రీను వైట్ల.