ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి వస్తున్న పుకార్లను చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు ఖండించింది. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఏదైనా టీజర్ లేదా వీడియో గ్లింప్స్ వస్తుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి వీడియో కంటెంట్ విడుదల చేయడం లేదని సమాచారం రావడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురవుతున్నారు.
వీడియో గ్లింప్స్ లేకపోయినప్పటికీ, ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా సినిమా టైటిల్ పోస్టర్‌తో పాటు తారక్ లుక్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కంటెంట్ విషయంలో ఎన్టీఆర్ అస్సలు తొందరపడటం లేదని, సరైన సమయంలోనే వీడియోలను బయటకు తీసుకురావాలని ఆయన ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయిన తర్వాతే విడుదల తేదీని ప్రకటిస్తూ, అదే సమయంలో ఒక పవర్ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది.
మరోవైపు, ఈ సినిమాలో విలన్ పాత్రలో మార్పులు ఉండబోతున్నాయని, పలువురు ప్రముఖ నటుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.


