పవన్ చేతుల మీదుగా ఎన్టీఆర్ సినిమా !
Published on Oct 22, 2017 9:41 am IST

ఇటీవలే ‘జై లవ కుశ’ చిత్రంతో మంచి విజయాన్నందుకుని, అందులో జై పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించి నటుడిగా ఇంకో మెట్టు పైకెక్కిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దీంతో వాళ్ళను ఎక్కువ రోజులు ఎదురుచూసేలా చేయకూడదనుకున్న టీమ్ రేపే సినిమాను అధికారికంగా లాంచ్ చేయనుంది. ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభోత్సవం జరగనుంది. ఇందులో విశేషమేమిటంటే ఈ వేడుకకు త్రివిక్రమ్ మిత్రుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై మొదటి క్లాప్ ఇవ్వనున్నారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని చెబుతున్న ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ పై రాధా కృష్ణ నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందివ్వనున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

 
Like us on Facebook