బాహుబలి వల్ల చాలా సినిమాలు మిస్సయ్యారు కదా అనడిగితే ప్రభాస్ చెప్పిన సమాధానం !
Published on Oct 22, 2016 8:22 pm IST

prabhas
ఒక హీరో ఎంత పెద్ద సినిమా అయినా దానికి మహా అయితే 6, 7 నెలలకు మించి టైమ్ ఇవ్వడు. అదీ కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అయిపోతే అంత సమయం కూడా ఇవ్వరు. కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దాదాపు నాలుగేళ్లు దర్శకుడు రాజమౌళి అద్భుత సృష్టి ‘బాహుబలి’ కోసం దారబోశాడు. సినిమాలో అతని తోటి నటీ నటులు అనుష్క, రానా, తమన్నా లు వేరే సినిమాలు చేసుకుపోతున్నా అతను మాత్రం ఆ ప్రాజెక్ట్ కోసమే కష్టపడ్డాడు. వేరే సినిమా జోలికి వెళ్ళలేదు. సినిమా పనులన్నీ పూర్తయ్యే వరకూ వేరే కథలు కూడా వినలేదు.

సినిమా కోసం అంతగా కష్టపడినందుకు ప్రభాస్ కు ఊహించనంత పాపులారిటీని, ఫేమ్ ని తెచ్చిపెట్టాడు రాజమౌళి. ఫస్ట్ పార్ట్ కే ప్రభాస్ ను నేషనల్ లెవల్ ఫిగర్ ని చేసేశాడు. దాంతో ప్రభాస్ త్యాగానికి, కష్టానికి తగిన ఫలితం దొరికినట్టయింది. ఇక ఈరోజు ముంబైలో జరిగిన జియో ఎంఏఎంఐ వేడుకలో బాహుబలి 2 ఫస్ లుక్ రిలీజ్ సందర్బంగా జరిగిన సమావేశంలో ఓ విలేఖరి ప్రభాస్ ను బాహుబలి వలన మీరు చాలా సినిమాలు మిస్సయ్యారు కదా మీ ఫీలింగ్ ఏంటి అని అడగ్గా ప్రభాస్ వెంటనే ‘ఒక బాహుబలి 100 సినిమాలతో సమానం’ అంటూ గొప్ప సమాధానం చెప్పి ప్రాజెక్ట్ తనకెంత గొప్పదో తెలియజేశాడు.

 
Like us on Facebook