సమీక్ష : పులిజూదం – జూదం’ ఉందిగాని, పులే లేదు

Published on Mar 22, 2019 3:30 am IST

విడుదల తేదీ : మార్చి 21, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : మోహన్ లాల్, యాక్షన్ హీరో విశాల్, శ్రీకాంత్, హన్సిక, రాశీ ఖన్నా త‌దిత‌రులు.

దర్శకత్వం : ఉన్నికృష్ణన్‌

నిర్మాత : రాక్ లైన్ వెంకటేశ్

సంగీతం : సుషిన్ శ్యామ్

స్క్రీన్ ప్లే : ఉన్నికృష్ణన్‌

ఎడిటర్ : సమీర్ మహమ్మద్

ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ్ యాక్షన్ హీరో విశాల్, శ్రీకాంత్, హన్సిక, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పులిజూదం’. రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాక్ లైన్ వెంకటేశ్ ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

ముగ్గురు వ్యక్తుల హత్యతో ఈ చిత్రం మొదలవుతుంది. ఆ హత్యలు చేసిన వారిని పట్టుకోవడానికి డీజీపి, ఏడీజీపి మాథ్యూ (మోహన్ లాల్) ను పిలిపిస్తాడు. అయితే వాలంటరీ రిటర్మెంట్ తీసుకోని వెళ్లిపోవడానికి అప్పటికే నిర్ణయించుకుంటాడు మాథ్యూ. క్రైమ్ జరిగిన ప్లేస్ ను చూసి.. ఆ క్రైమ్ జరిగిన విధానాన్ని కనిపెట్టగలిగే మాథ్యూ మాత్రమే ఈ కేసును డీల్ చేయగలరని డీజీపీ మాథ్యూని రిక్వెస్ట్ చేయగా.. తన లీవ్ పక్కన పెట్టి మాథ్యూ ఈ కేసును హ్యాండిల్ చేస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అసలు ఆ హత్యలు చేస్తోంది ఎవరు..? దువ్వూరి మదనగోపాల్ (విశాల్)కి ఆ హత్యలకు ఉన్న సంబధం ఏమిటి ? చివరికీ మాథ్యూ ఆ హత్యలు చేస్తోన్న వారిని పట్టుకున్నాడా ? లేదా ? మదనగోపాల్ కి మాథ్యూకు మధ్య ఎలాంటి ముగింపు ఉంటుంది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఏడీజీపి మాథ్యూ పాత్రలో మోహన్ లాల్ ఎప్పటిలాగే తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా తన భార్య నీలమ చనిపొయ్యే సన్నివేశంలో మరియు విశాల్ తో సాగే క్లైమాక్స్ లో అలాగే మిగిలిన క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో కూడా ఆయన తీవ్రమైన భావోద్వేగాలను పండించారు.

ఇక వైద్యుడిగా నటించిన విశాల్‌ సినిమాలో కనిపించనంతసేపూ తన నటనతో ఆకట్టుకుంటారు. అలాగే విశాల్ కి జోడిగా నటించిన హన్సిక కొన్ని సన్నివేశాల్లోనే కనిపించినప్పటికీ.. తన అందంతో అభినయంతో ఆకట్టుకున్నే ప్రయత్నం చేసింది. పోలీస్‌ కానిస్టేబుల్‌ గా నటించిన రాశీ ఖన్నా కూడా బాగానే నటించింది.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన శ్రీకాంత్‌ కూడా తన నటనతో మెప్పిస్తారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. దర్శకుడు ఉన్నికృష్ణన్‌ సినిమాలో చెప్పాలనుకున్న ‘ప్రతి హీరోలో ఒక విలన్ ఉంటాడు, ప్రతి విలన్ లో ఒక హీరో ఉంటాడు’ అనే స్టోరీ థీమ్ బాగుంది. అలాగే దర్శకుడు సినిమా ముగింపులో కూడా చక్కని దర్శకత్వ పనితనం కనబర్చారు.

మైనస్ పాయింట్స్:

దర్శకుడు ఉన్నికృష్ణన్‌ మంచి స్టోరీ థీమ్ తీసుకున్నప్పటికీ.. టిపికల్ నేరేషన్ తో, పూర్తి ఆసక్తికరంగా సాగని క్రైమ్ డ్రామాతో సినిమాను ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. ముఖ్యంగా కథ, కథనం ఉండాల్సిన స్థాయిలో లేవు. ఆసక్తిని పెంచే పాయింట్ తో సినిమాని ప్రారంభించి.. మోహన్ లాల్ గత జీవితానికి సంబంధించి మంచి ఎమోషనల్‌ సన్నివేశాలతో ఆకట్టకునే ప్రయత్నం చేసినప్పటికీ.. సినిమా చాలా చోట్ల బోర్ గా సాగుతుంది.

మొత్తానికి సినిమా నిండా కాన్ ఫ్లిట్ ఉన్నట్లే అనిపిస్తోంది కానీ.. ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యే విధంగా మాత్రం, ఆ కాన్ ఫ్లిట్ సరిగ్గా ఎలివేట్ కాలేదు. దీనికి తోడు సినిమా ఎక్కువుగా తెలుగు నేటివిటీకి దూరంగా సాగడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. పైగా సినిమాలో అస్సలు ఎంటెర్టైమెంట్ లేకపోవడం కూడా.. ఎంటెర్టైమెంట్ ను కోరుకునే ప్రేక్షకులను బాగా నిరుత్సాహ పరుస్తోంది.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు ఉన్నికృష్ణన్‌ మంచి స్టోరీ ఐడియా తీసుకున్నా దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. అయితే ఆయన కొన్ని సన్నివేశాల్లో చక్కని దర్శకత్వ పనితనం కనబర్చారు.

సంగీత దర్శకుడు సుషిన్ శ్యామ్ అందించిన నేపధ్య సంగీతం పర్వాలేదనిపిస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో మాత్రం ఆ నేపధ్య సంగీతం బాగా ఆకట్టుకున్నేలా ఉంది. ఎడిటర్ సమీర్ మహమ్మద్ ఎడిటింగ్ కూడా పర్వాలేదు. నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో మోహన్ లాల్, విశాల్, శ్రీకాంత్, హన్సిక, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ భారీ మల్టీస్టారర్ లో విశాల్ ట్రాక్, అలాగే మోహన్ లాల్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ మరియు కొన్ని ఇన్వెస్టిగేట్ సన్నివేశాలు బాగా అలరిస్తాయి. అయితే సినిమా చాలా చోట్ల బోరింగ్ గా అనిపించడం, ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యే విధంగా కథనం లేకపోవడం, తెలుగు నేటివిటీకి సినిమా దూరంగా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మొత్తం మీద ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ ను బాగా ఇష్టపడే ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తోంది. కానీ క్రైమ్ డ్రామా సినిమాలను అలాగే ఓ డిఫరెంట్ జోనర్ లో సినిమాను చూద్దామకొన్నే ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రం పర్వాలేదనిపిస్తోంది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More