మెడలో మంగళ మాలికతో, చేతిలో పురాణపండ శ్రీమాలికతో యాదాద్రిలో మంత్రి రోజా

మెడలో మంగళ మాలికతో, చేతిలో పురాణపండ శ్రీమాలికతో యాదాద్రిలో మంత్రి రోజా

Published on Aug 5, 2022 5:48 PM IST

Puranapada-srinivas-Roja

యాదగిరిగుట్ట : ఆగస్ట్: 5

ఆర్కే రోజా అనబడే ఆంధ్రప్రదేశ్ పర్యాటక, యువజన శాఖామంత్రి శ్రీమతి రోజా తనకి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిపై ఉన్న అపారమైన భక్తిని సుమారు ఐదుగంటలపాటు ప్రఖ్యాత పుణ్యక్షేత్రం , స్వయంభూ నారసింహ క్షేత్రం యాదాద్రిలో ప్రకటించుకోవడం లక్షలాది మందిని ఈ శ్రావణమాసపు శుక్రవారం శ్రీవరలక్ష్మీ వ్రత పర్వదిన సందర్భంలో విశేషంగా ఆకర్షించింది.

శ్రావణ మాసపు మహా సంరంభమైన శ్రీ వరలక్ష్మి వ్రత పుణ్య దిన ప్రభాతవేళ శ్రీమతి ఆర్కే రోజా యాదాద్రి మహాపుణ్యక్షేత్రంలో లక్ష్మీ నృసింహుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి అద్భుత అభిషేక కార్యక్రమాన్ని పూర్తిగా వీక్షించి ఆనందతరంగితులయ్యారు .శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం వేదపండితుల పవిత్ర ఆశీర్వచనాన్ని పొందారు. అనంతరం జరిగిన శ్రీవరలక్ష్మీవ్రతం , కోటి కుంకుమార్చనలలో స్వయంగా పాల్గొని భక్తితో శ్రీకార్యాలను నిర్వహించడం విశేషం,

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమతి రోజాకు పూలమాల , స్వామి వారి శేషవస్త్రం అందించి ప్రత్యేక ప్రసాదాన్ని అందించారు. అనంతరం ఆలయ ముఖమంటప ప్రాంగణంలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మహత్వ శక్తులతో, విశేష మంత్ర స్తోత్రాలతో అందించిన ‘ శ్రీమాలిక ‘ అపురూప గ్రంధాన్ని ఆవిష్కరించి ఆలయ పండిత వర్గాలకు, అర్చక బృందాలకు తానే స్వయంగా అందించడం విశేషం. గత ఐదు దశాబ్దాలుగా ప్రధాన అర్చకులుగా అపూర్వ సేవలందిస్తున్న యాదాద్రి దేవస్థాన ప్రధాన అర్చకులు నల్లంధీగల్ లక్ష్మీ నరసింహాచార్యులు రోజాను వాత్సల్యంతో ఆశీర్వదించారు .

ఈ కోటికుంకుమార్చనలో పాల్గొనే ప్రతీ ముత్తయిదువకు ఈ చక్కని గ్రంధం అందిస్తున్న యాదాద్రి లక్ష్మీనృసింహ దేవస్థాన సిబ్బందిని అభినందించాల్సిందే. రోజా ఈ గ్రంధాన్ని ప్రచురించడంపట్ల వేదపండితులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రోజా రాకతో ఆమెను చూసేందుకు మహిళా భక్తులు చాలా ఆసక్తి చూపడంతో ఆలయంలో కొంత సందడి వాతావరణం నెలకొంది.

ఇక శ్రీమాలిక ప్రత్యేక గ్రంధం విషయానికొస్తే శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ని తెలుగు రాష్ట్రాల భక్త పాఠకులు , ఆలయాల అధికారులు, వేదపండితులు , సాహిత్య వేత్తలు , కవిప్రముఖులు … ఒకరేమిటి ఎంతోమంది ఆయన ధార్మిక చైతన్య కృషికి మనసారా అభినందనలు వర్షిస్తున్నారు. సుమారు వందకు పై చిలుకు ధార్మిక గ్రంధాలను అపురూపపు విలువలతో రచించి, సంకలీనకరించి, ప్రచురించిన శ్రీనివాస్ ప్రత్యేక శైలికి, వ్యాఖ్యానాలకూ ఫాలోయింగ్ చాలా ఎక్కువనేది చాలామందికి తెలుసున్న విషయమే. మరీ ముఖ్యంగా అస్సలు స్వార్ధాన్ని దరిచేరనివ్వని సంస్కారం శ్రీనివాస్ దని నికార్సుగా చెప్పాల్సిందే.

గతంలో కూడా శ్రీమతి రోజా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానానికి , శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి పరమాద్భుతమైన గ్రంధాలని అందించి వందలాది భక్తుల అభినందనలు అందుకున్నారని కూడా తెలంగాణా పాత్రికేయ బృందం ముచ్చటించుకుంది.

శ్రీమతి రోజా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ పవిత్ర శ్రావణ మహాలక్ష్మి శుక్రవారం వరలక్ష్మి వ్రత సందర్భంగా యాదాద్రి క్షేత్రదర్శనమ్ తనకు అద్భుత అనుభూతినిచ్చిందని , పూర్వజన్మ పుణ్యవిశేషంవల్లనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతటి మహోజ్వలంగా యాదాద్రిని పునర్నిర్మించారని , కేసీఆర్ చరిత్రలో నిలిచిపోవడానికి యాదాద్రి గొప్ప పవిత్ర సాక్ష్యమని సంతోషాన్ని వ్యక్త పరచడం విశేషం.

ఈ పవిత్ర కార్యక్రమంలో యాదాద్రి దేవస్థాన ప్రధాన అర్చకులు నల్లంధీగల్ లక్ష్మీ నరసింహాచార్యులు ఆలయ సిబ్బంది , వందలకొలది భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు