నాగబాబుకు ఘాటుగా సమాధానమిచ్చిన వర్మ!
Published on Jan 8, 2017 10:39 am IST

rgv-nagababu
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటు తాను ఎంచుకునే సినిమాల కథా నేపథ్యాలతో, అటు ట్విట్టర్‌లో చేసే వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటారు. కొద్దిరోజుల క్రితం చిరంజీవి 150వ సినిమా ఎలా ఉండాలో చెబుతూ ఆయన కొన్ని ట్వీట్స్ చేశారు. ఇదే విషయమై నిన్న సాయంత్రం జరిగిన ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడుతూ చిరంజీవి సోదరుడు నాగబాబు వర్మపై పలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వర్మ తన కెరీర్‌పై మనసు పెడితే బాగుంటుందని, మెగా ఫ్యామిలీ గురించి, చిరు సినిమాల గురించి మాట్లాడుతూ తప్పుగా వ్యవహరిస్తున్నారని ఆవేశంగా ఆయన పేరు ప్రస్తావించకుండా విరుచుకుపడ్డారు.

ఇక నాగబాబు ప్రసంగం తర్వాత మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పిన రామ్ గోపాల్ వర్మ, మరో గంటలో మాట మారుస్తూ తన ఎకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని వ్యంగ్యంగా జవాబిచ్చారు. దానికి తోడు నాగబాబుకు ఘాటుగా రిప్లై ఇస్తూ.. తనకు సలహాలిచ్చేముందు నాగబాబు, ఆయన కెరీర్ ఎలా ఉందో ఓసారి చూసుకోవాలని అన్నారు. చిరంజీవిని చాలాసార్లు నాగబాబు తప్పుదోవ పట్టించారని, ఇలాంటి ప్రతిష్టాత్మక వేడుకలకు నాగబాబును పిలవొద్దని చిరును కోరుతూ వర్మ వరుసగా ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో గత రాత్రి నుంచి దుమారం రేపుతున్నాయి.

 
Like us on Facebook