విడుదల తేదీ : జనవరి 13, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్, సునీల్, తారక్ పొన్నప్ప, సత్య, వెన్నెల కిశోర్ తదితరులు.
దర్శకుడు : కిషోర్ తిరుమల
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
సంగీత దర్శకుడు : భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రాఫర్ : ప్రసాద్ మురెళ్ళ
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi). ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం, మరి ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ:
రామ్ (రవితేజ) వైన్ కంపెనీ ఓనర్. తన భార్య బాలమణి (డింపుల్ హయాతి) తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు బాలామణి తన భర్త పట్ల చాలా జాగ్రత్తగా అతి ప్రేమ చూపిస్తూ ఉంటుంది. పైగా తన భర్త అసలు తప్పు చేయడు అని నమ్ముతూ ఉంటుంది. ఇలాంటి రామ్ తన కంపెనీ పని మీద స్పెయిన్ వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రామ్ కి మానస శెట్టి (ఆషికా రంగనాథ్) పరిచయం అవుతుంది. రామ్, మానస దగ్గర మాత్రం సత్యగా పరిచయం అవుతాడు. ఇద్దరూ ఒక్కటి అవుతారు. అనుకోకుండా జరిగిన ఆ తప్పు రామ్ అలియాస్ సత్య లైఫ్ ను ఎలా మార్చింది ?, రామ్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ?, ఇంతకీ, మానస విషయం బాలామణికి తెలిసిందా? లేదా ?, తెలిశాక బాలామణి ఏం చేసింది ?, చివరకు రామ్ ఇద్దర్ని ఎలా హ్యాండిల్ చేశాడు? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
‘‘ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగే ఓ మొగుడి కథతో ఈ సినిమా సాగింది. కథలోని కామెడీ మరియు సంఘర్షణ బాగానే ఉంది. ఇక ఈ సినిమాలో కూడా ఎప్పటిలాగే రవితేజ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్ తో చాలా బాగా నటించాడు. కొన్ని చోట్ల వింటేజ్ రవితేజ కనిపిస్తాడు. రవితేజ ఫ్యాన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. హీరోయిన్లుగా నటించిన డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఆషికా రంగనాథ్ తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది.
అలాగే, భార్య పాత్రలో డింపుల్ హయాతి పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. రవితేజ, వెన్నెల కిశోర్, సునీల్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ కొన్ని చోట్ల నవ్వించాయి. అలాగే, రవితేజ – సత్య మధ్య వచ్చే ఫన్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. మరో ఫన్నీ పాత్రలో నటించిన అజయ్ ఘోష్ కూడా నవ్వించడానికి కొత్తగా ట్రై చేశాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. మొత్తానికి భార్యను మోసం చేసిన భర్త ట్రాక్.. అలాగే ఆ ట్రాక్ తో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు సీన్స్, చివరగా రవితేజ తన పాత్రలో నటించిన విధానం ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కథ బాగానే ఉన్నా.. కథనం కొన్ని చోట్ల చాలా రెగ్యులర్ గా సాగింది. ఫుల్ ఫన్ రైడ్‌లా సాగాల్సిన కథనం రొటీన్ ప్లేతో బోరింగ్ సీన్స్ తో తేలిపోయింది. రవితేజ ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నా.. సన్నివేశాల్లో డెప్త్ లేకపోవడం, ఫోర్స్ ఫుల్ కామెడీ సీక్వెన్స్ ల కారణంగా మొత్తానికి ఈ సినిమా చాలా చోట్ల మెప్పించలేకపోయింది. దీనికితోడు రవితేజ పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ ను కూడా దర్శకుడు రెగ్యులర్ గానే డిజైన్ చేసుకున్నాడు. ఇంటర్వెల్ కూడా ఏదో షాక్ మూమెంట్ ఇవ్వాలి కాబట్టి, ఫోర్స్ గా పెట్టినట్టు ఉంది.
మొత్తమ్మీద కథలో ఉన్న కాన్ ఫ్లిక్ట్ ను కూడా కరెక్ట్ గా వాడుకోలేదు. దీంతో, సెకండ్ హాఫ్ ప్లేలో ఇంట్రెస్ట్ మిస్ అయింది. నిజానికి సెకండ్ హాఫ్ లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. హీరో – తారక్ పొన్నప్ప మధ్య మైండ్ గేమ్ ని ఇంకా ఇంట్రెస్ట్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. అటు క్లైమాక్స్ లో కూడా ఉత్సుకత మిస్ అయ్యింది. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. పాటలు బాగున్నా వాటి ప్లేస్ మెంట్ కూడా బాలేదు. పాట పడాలి కాబట్టి, వాంటెడ్ గా సాంగ్ కి లీడ్ ను క్రియేట్ చేయడం సినిమా స్థాయికి తగ్గట్టు లేదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు కిషోర్ తిరుమల తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తగ్గించాల్సింది. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi) అంటూ ఫ్యామిలీ ఫన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. రవితేజ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. ఐతే, రొటీన్ స్క్రీన్ ప్లే, అటు సీన్స్ కూడా స్లోగా రెగ్యులర్ గా సాగడం, హీరో – హీరోయిన్ల మధ్య కాన్ ఫ్లిక్ట్ ను కూడా సరిగ్గా వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా రవితేజ నటనతో పాటు కొన్ని కామెడీ ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


