
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’.. 2013లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌లకు మంచి క్రేజ్ ఏర్పడింది. దర్శకుడు మేర్లపాక గాంధీని కూడా వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. అయితే ఆయన మాత్రం మళ్ళీ ఒక బలమైన స్క్రిప్ట్‌తో సినిమా తీసేందుకు గానూ ఇప్పటివరకూ ఆగారు. మేర్లపాక గాంధీ శర్వానంద్‌తో ఓ సినిమా తీస్తారన్న విషయం ఇంతకుముందు తెలిసిందే. కాగా ఇప్పుడీ సినిమా త్వరలోనే పట్టాకెల్లెక్కే సూచనాలు కనిపిస్తున్నాయి.
‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘జిల్’ చిత్రాల ద్వారా మంచి పేరు సంపాదించిన నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుంది. నిజానికి కొంతకాలం ముందే ఈ సినిమా మొదలు కావాల్సి ఉన్నా, జిల్ చిత్రం పూర్తయ్యే వరకూ కొత్త చిత్రాలేవీ ప్రారంభించే ఆలోచనలో ఆ సంస్థ లేదు. ఇప్పుడిక జిల్ సినిమా కూడా పూర్తయిపోవడం, ఈనెల 27న విడుదలకు కూడా సిద్ధమౌతూండడంతో యూవీ క్రియేషన్ కొత్త సినిమాను ప్రారంభించే పనిలో ఉంది. త్వరలోనే మేర్లపాక గాంధీ, శర్వానంద్‍ల సినిమా లాంచయ్యే అవకాశం కనిపిస్తోంది.

