యూఎస్‌లో హాఫ్‌ మిలియన్‌కు దగ్గరైన ‘శతమానం భవతి’
Published on Jan 18, 2017 8:35 am IST

Shatamanam-Bhavati1
డిఫరెంట్ కమర్షియల్ సినిమాలతో మెప్పిస్తూ ఉండే హీరో శర్వానంద్, తాజాగా ‘శతమానం భవతి’ అన్న సినిమాతో సంక్రాంతి కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లాంటి రెండు భారీ సినిమాల మధ్యన వచ్చినా కూడా ఈ సినిమా అందరి అంచనాలను అధిగమించి సూపర్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే అన్ని ప్రధాన ఏరియాల్లో ఈ సినిమా లాభాల బాట పట్టిందని నిర్మాత దిల్‌రాజు స్పష్టం చేశారు.

ఇక అమెరికాలోనూ ఎవ్వరి ఊహకూ అందకుండా ఈ సినిమా మంచి వసూళ్ళు రాబడుతోంది. ఇప్పటివరకూ యూఎస్ బాక్సాఫీస్ వద్ద శతమానం భవతి 478కే డాలర్లు (సుమారు 3.25కోట్ల రూపాయలు) వసూలు చేసింది. మంగళవారం పూర్తయ్యేసరికల్లా హాఫ్ మిలియన్ మార్క్ చేరుకుంటుందని ట్రేడ్ భావిస్తోంది. అదేవిధంగా ఈవారం సినిమాలేవీ లేకపోవడంతో వీకెండ్ మళ్ళీ కలెక్షన్స్ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు.

 
Like us on Facebook