విడుదల తేదీ : జనవరి 01, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి, కౌస్తుభ మణి, జిషు సేన్‌గుప్తా తదితరులు
దర్శకుడు : అర్జున్ జాన్య
నిర్మాత : ఎం.రమేష్ రెడ్డి
సంగీత దర్శకుడు : అరుణ్ జాన్య
సినిమాటోగ్రాఫర్ : సత్య హెగ్డే
ఎడిటర్ : కె.ఎం.ప్రకాష్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
కన్నడ స్టార్స్ శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం ‘45’. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా కన్నడలో డిసెంబర్ నెలలో రిలీజ్ అయింది. అయితే, న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన వినయ్ (రాజ్ బి శెట్టి) ఓ కుక్క కారణంగా బైక్ యాక్సిడెంట్ అయి మరణించినట్లు కల వస్తుంటుంది. క్రమంగా అతడి కలలోని కొన్ని సన్నివేశాలు నిజమవుతుంటాయి. రోసీ అనే ఆ కుక్క రాయప్ప(ఉపేంద్ర) అనే డాన్‌కు చెందింది. ఆ కుక్కని తన తల్లిలా చూసుకుంటాడు రాయప్ప. తన కుక్క చావుకు కారణమైన వినయ్‌ను 45 రోజుల్లో చంపేస్తానంటూ రాయప్ప వార్నింగ్ ఇస్తాడు. రోజులు లెక్కపెట్టుకుంటున్న వినయ్ జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. ఈ క్రమంలో శివ(శివ రాజ్‌కుమార్) వినయ్ జీవితంలోకి వస్తాడు. వినయ్ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు శివ ప్రయత్నిస్తుంటాడు. ఇంతకీ ఈ శివ ఎవరు..? వినయ్‌కు ఎందుకు సాయం చేయాలనుకుంటాడు..? రాయప్ప వినయ్‌ను చంపేస్తాడా..? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఇంత మంది స్టార్స్‌ను ఒప్పించడం అర్జున్ జాన్యకు పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు స్టార్ నటులను ఒకే చిత్రంలో ఒప్పించడం అతడి ప్రతిభకు నిదర్శనం. సినిమాలోని పాత్రలన్నీ చక్కగా డిజైన్ చేశారు.
రాజ్ బి శెట్టి సటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో తన పాత్రను పోషించిన తీరు ఆకట్టుకుంటుంది. మరణ భయం, దానితో పాటు జరిగే పరిణామాలను తన అభినయంతో బలంగా ఆవిష్కరించాడు.
ఈ సినిమాలో విలన్‌గా మారిన ఉపేంద్ర తన స్టైలిష్ లుక్స్, ఫైట్ సన్నివేశాలతో అభిమానులను ఆకట్టుకుంటాడు. ఇక సెకండ్ హాఫ్‌లో ఎంట్రీ ఇచ్చే శివ రాజ్‌కుమార్ కూల్ పెర్ఫార్మెన్స్‌తో కథకు బలం చేకూర్చాడు.
సినిమా ప్రారంభంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. తరువాత ఏమవుతుందో తెలుసుకోవాలనే ఉత్కంఠను కలిగిస్తాయి. వివిధ దేవతా రూపాలు ఉపేంద్రతో పోరాడే క్లైమాక్స్ ఫైట్ అద్భుతంగా చిత్రీకరించబడింది. మొత్తం సినిమాలో చూసేందుకు తప్పనిసరిగా ఎదురుచూడాల్సిన బెస్ట్ పార్ట్ ఇదే.
మైనస్ పాయింట్స్ :
సినిమా ప్రారంభం బాగానే ఉంటుంది. సెటప్ చూస్తే ఏదో భారీగా ప్లాన్ చేశారనే భావన కలుగుతుంది. కానీ క్రమంగా వేగం తగ్గిపోతూ, కథ నత్తనడకన సాగుతుంది. కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా, రిపీటెడ్‌గా అనిపిస్తాయి. ఇది కేవలం ఫస్ట్ హాఫ్ వరకే అనుకుంటే పొరపాటే. అసలు ఆట మొదలవుతుందని భావించే సెకండ్ హాఫ్ కూడా క్లైమాక్స్ వచ్చే వరకూ అదే స్థాయిలో నెమ్మదిగా సాగుతుంది.
ముగ్గురు స్టార్‌లను ఒకే సినిమాకు ఒప్పించడం గొప్ప విషయమే కానీ, వారికి మరింత బలమైన పాత్రలను ఇవ్వడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఇది పూర్తిగా కథలోని బలహీనతే. ప్రారంభంలో కొన్ని నిమిషాలు తప్ప సినిమా పెద్దగా ప్రభావం చూపించదు. క్రమంగా కథలోని వేగం తగ్గిపోయి నత్తనడకకు మారుతుంది.
శివరాజ్‌కుమార్ తన పాత్రను బాగానే పోషించినా, ఆయనతో డిజైన్ చేసిన కామెడీ సన్నివేశాలు పండలేదు. అవి సీరియస్‌గా సాగుతున్న కథలోకి అడ్డుపడుతూ పిల్లర్‌లా అనిపిస్తాయి. ఉపేంద్ర పాత్ర కూడా పెద్దగా కొత్తదనం చూపించదు. రావడం, ఫైట్ చేయడం, వార్నింగ్ ఇవ్వడం, వెళ్లిపోవడం అనే తరహాలోనే అతడి సన్నివేశాలన్నీ సాగుతాయి. అదే స్టైల్ పదే పదే రావడంతో చూసేవారికి విసుగు కలుగుతుంది.
మొత్తం కథ కర్మ సిద్ధాంతాన్ని ఆధునిక రూపంలో చెప్పాలన్నదే లక్ష్యంగా ఉంటుంది. ఆ ఉద్దేశం బాగానే ఉన్నా, దానికి కావాల్సిన బలమైన ఎమోషన్స్, కథన బలం లేకపోవడంతో ప్రభావం తగ్గిపోయింది. మెరుగైన రచన, బలమైన స్క్రీన్‌ప్లే ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది.
ఇతర పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇంటర్వెల్‌లో హుక్‌గా నిలిచిన తల్లి భావోద్వేగం కూడా తర్వాత పూర్తిగా పక్కన పడేస్తారు. ఇలాంటి అనుసంధానం లేని సన్నివేశాలు ఈ సినిమాలో చాలానే కనిపిస్తాయి.
సాంకేతిక విభాగం :
కర్మ సిద్ధాంతాన్ని భిన్నంగా ప్రేక్షకులకు అందించాలనే ఆలోచన అర్జున్ జాన్యకు ఉన్నప్పటికీ, బలహీనమైన రచన మరియు పూర్తిగా అభివృద్ధి చెందని పాత్రలు అతడి ఆశయాన్ని పరిమితం చేశాయి. సాంకేతికంగా సినిమా మీద భారీగా ఖర్చు పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్‌కు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించినా, పెద్ద తెరపై అవి ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయాయి. క్లైమాక్స్ ఓకే అనిపించినా గొప్పగా మాత్రం లేదు.
దర్శకుడే అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవసరానికి మించి గట్టిగా ఉండి, కొన్ని సన్నివేశాలకే సరిపోయింది. కేఎం ప్రకాశ్ చేసిన ఎడిటింగ్ పూర్తిగా నిరాశపరిచింది. రెండు భాగాల్లోనూ అనవసరమైన, ల్యాగ్‌గా అనిపించే సన్నివేశాలను కత్తిరించి ఉంటే రన్‌టైమ్‌ను గణనీయంగా తగ్గించవచ్చు. ప్రొడక్షన్ విలువలు మాత్రం సగటు స్థాయిలోనే ఉన్నాయి.
తీర్పు:
ఓవరాల్‌గా చూస్తే.. ‘45’ కథలో కోర్ పాయింట్ ఉన్నప్పటికీ ఇది ఒక యావరేజ్ చిత్రంగా మిగిలిపోయింది. వీక్ రైటింగ్, స్క్రీన్‌ప్లే కారణంగా సినిమా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. లీడ్ స్టార్స్ తమ పర్ఫార్మెన్స్‌తో మెప్పించినా, వారి పాత్రలకు సరైన డెప్త్ లేకపోవడం, అనవసర సన్నివేశాలు, ల్యాగ్ కలిసి ఈ ఫాంటసీ డ్రామాను డిజప్పాయింటింగ్ చిత్రంగా మార్చాయి. క్లైమాక్స్ తప్ప మిగతా భాగాల్లో గుర్తుండిపోయే సన్నివేశాలు లేవు. న్యూ ఇయర్ సందర్భంగా ఎంగేజింగ్ చిత్రాన్ని చూడాలనుకునే వారు ఈ సినిమాను స్కిప్ చేయడం బెటర్.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team


