బడా బ్యానర్లో రజనీ కుమార్తె స్ట్రైట్ తెలుగు చిత్రం.!

బడా బ్యానర్లో రజనీ కుమార్తె స్ట్రైట్ తెలుగు చిత్రం.!

Published on Oct 2, 2021 4:26 PM IST


మన దక్షిణాది సినిమాలో భారీ సినిమాలు తెరకెక్కించే అతి తక్కువ బడా బ్యానర్స్ లో లైకా ప్రొడక్షన్స్ కూడా ఒకటి. భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా… రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌ నటించిన ‘2.0’ను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. అదొక్కటే కాదు. ఇంకా పలు భారీ బడ్జెట్‌, హిట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘రామ్‌ సేతు’తో హిందీ పరిశ్రమలోకి ప్రవేశిస్తోంది. ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమా చేయడానికి లైకా ప్రొడక్షన్స్‌ సిద్ధమైంది.

పాన్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ కుమార్తె, హీరో ధనుష్‌ భార్య ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మాతలు సుభాస్కరన్‌, మహవీర్‌ జైన్‌ స్ట్రయిట్‌ తెలుగు సినిమా నిర్మించనున్నారు. ధనుష్‌ హీరోగా నటించిన తమిళ సినిమా ‘3’తో ఐశ్వర్య దర్శకురాలిగా పరిచయమయ్యారు. తెలుగులో కూడా ఆ సినిమా విడుదలైంది. ఆ తర్వాత ‘వెయ్‌ రాజా వెయ్‌’ చేశారు. ఇప్పుడు దర్శకురాలిగా మూడో సినిమా, తెలుగులో చేయడానికి ఐశ్వర్య ఆర్‌. ధనుష్‌ సిద్ధమవుతున్నారు. పాన్‌ ఇండియన్‌ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

మరి ఈ సందర్భంగా ఐశ్వర్య ఆర్‌. ధనుష్‌ మాట్లాడుతూ ‘‘లైకా ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాను. పాన్‌ ఇండియన్‌ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది’’ అని చెప్పారు.

అలాగే లైకా ప్రొడక్షన్స్‌ సీఈవో ఆశిష్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘మా సంస్థలో తొలి స్ట్రయిట్‌ తెలుగు సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుండటం మాకెంతో ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం మాకుంది’’ అని చెప్పారు. ఇక ఈ సినిమాలో ఇతర నటులు మరియు టెక్నీకల్ టీం వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు